3
1 నెబుకద్‌నెజరురాజు ఒక బంగారు విగ్రహం చేయించాడు. దాని ఎత్తు అరవై మూరలు, వెడల్పు ఆరు మూరలు. అతడు దాన్ని బబులోను ప్రదేశంలో ఉన్న “దూరా” మైదానంలో నిలబెట్టించాడు. 2 అప్పుడు రాజు తాను నిలబెట్టించిన విగ్రహం ప్రతిష్ఠకు రమ్మని పరిపాలకులనూ ప్రముఖులనూ రాష్ట్రాధిపతులనూ మంత్రులనూ ఖజానాదారులనూ న్యాయాధిపతులనూ ప్రముఖ న్యాయాధిపతులనూ ప్రాంతీయ పాలకులందరినీ పిలిపించాడు. 3 కనుక నెబుకద్‌నెజరురాజు నిలబెట్టించిన విగ్రహం ప్రతిష్ఠకు ఆ పరిపాలకులూ ప్రముఖులూ రాష్ట్రాధిపతులూ మంత్రులూ ఖజానాదారులూ న్యాయాధిపతులూ ప్రముఖ న్యాయాధిపతులూ ప్రాంతీయ పాలకులంతా సమకూడారు, ఆ విగ్రహం ఎదుట నిలబడ్డారు.
4 అప్పుడు వార్తావహుడు బిగ్గరగా చాటించాడు: “ప్రజలారా, దేశస్థులారా, ఆయా భాషలవారలారా మీకిచ్చే ఆజ్ఞ ఏమిటంటే 5 బాకా, పిల్లనగ్రోవి, తంతివాద్యాలు, విపంచి, సుతితిత్తి, అన్నిరకాల వాద్యాల గానం వినబడగానే మీరంతా సాష్టాంగపడాలి, నెబుకద్‌నెజరురాజు నిలబెట్టించిన బంగారు విగ్రహాన్ని పూజించాలి. 6 ఎవరైతే సాష్టాంగపడక పూజింపక ఉన్నారో వాళ్ళను వెంటనే భగభగమండే కొలిమిలో వేయడం జరుగుతుంది.”
7 బాకా, పిల్లనగ్రోవి, తంతివాద్యాలు, విపంచి, సుతితిత్తి, అన్ని రకాల వాద్యాల గానం వినబడింది. తక్షణమే ప్రజలు, దేశస్థులు, ఆయా భాషా జనాలు సాష్టాంగపడి నెబుకద్‌నెజరు నిలబెట్టించిన విగ్రహాన్ని పూజించారు.
8 అప్పుడు జ్యోతిష్కులు కొందరు ముందుకు వచ్చి యూదులమీద నింద మోపారు. 9 వాళ్ళు నెబుకద్‌నెజరు రాజుతో ఇలా అన్నారు: “రాజు చిరంజీవి అవుతాడు గాక! 10 రాజా, మీరు ఒక ఆజ్ఞ జారీ చేశారు. దానిప్రకారం బాకా, పిల్లనగ్రోవి, తంతివాద్యాలు, విపంచి, సుతితిత్తి అన్ని రకాల వాద్యాల గానం వినేవాళ్ళంతా సాష్టాంగపడి బంగారు విగ్రహాన్ని పూజించాలి. 11 ఎవరైతే సాష్టాంగపడక పూజించక ఉన్నారో భగభగమండే కొలిమిలో వేయడం జరగాలి. 12 రాజా, కొందరు యూదులను మీరు బబులోను ప్రదేశంమీద అధికారులుగా నియమించారు. వాళ్ళు షద్రకు, మేషాకు, అబేద్‌నెగో. వాళ్ళకు మీ ఆజ్ఞ అంటే ఏమీ శ్రద్ధ లేదు. మీ దేవుళ్ళను సేవించరు, మీరు నిలబెట్టించిన బంగారు విగ్రహాన్ని పూజించరు.”
13 నెబుకద్‌నెజరు అతి కోపంతో మండిపడి షద్రకునూ మేషాకునూ అబేద్‌నెగోనూ పట్టుకురండని ఆజ్ఞాపించాడు. ఆ మనుషులను రాజు ఎదుటికి తీసుకువచ్చిన తరువాత, 14 నెబుకద్‌నెజరు వారితో ఇలా అన్నాడు: “షద్రకు! మేషాకు! అబేద్‌నెగో! మీరు నా దేవుళ్ళను సేవించడం లేదట, నేను నిలబెట్టించిన బంగారు విగ్రహాన్ని పూజించడం లేదట. ఇది నిజమా? 15 ఇప్పుడు వినండి. బాకా, పిల్లనగ్రోవి, తంతివాద్యాలు, విపంచి, సుతితిత్తి, అన్నిరకాల వాద్యాల గానం మీకు వినబడగా మీరు సాష్టాంగపడి నేను చేయించిన విగ్రహాన్ని పూజించడానికి సిద్ధంగా ఉన్నారంటే సరే. కానీ మీరు దాన్ని పూజించకపోతే తక్షణమే భగభగమండే కొలిమిలో మిమ్మల్ని వేయడం జరుగుతుంది. అలాంటప్పుడు మిమ్మల్ని నా చేతిలోనుంచి ఏ దేవుడు విడిపించగలుగుతాడు?”
16 షద్రకు, మేషాకు, అబేద్‌నెగో ఈ విధంగా రాజుతో అన్నారు: “నెబుకద్‌నెజరు! ఈ విషయాన్ని గురించి మేము మీకు జవాబివ్వవలసిన అవసరమేమీ లేదు. 17 ఒకవేళ మమ్మల్ని భగభగమండే ఆ కొలిమిలో వేయడం జరిగితే మేము సేవిస్తూ ఉన్న దేవుడు అందులోనుంచి మమ్మల్ని తప్పించగలడు. రాజా, ఆయన మీ చేతిలోనుంచి మమ్మల్ని విడిపిస్తాడు. 18 ఒకవేళ విడిపించకపోయినా, మేము మీ దేవుళ్ళను సేవించము, మీరు నిలబెట్టించిన బంగారు విగ్రహాన్ని పూజించము. రాజా, ఇది మాత్రం మీరు తెలుసుకొని తీరాలి.”
19 అందుకు నెబుకద్‌నెజరుకు ఆగ్రహం ముంచుకు వచ్చింది. షద్రకు, మేషాకు, అబేద్‌నెగోలను చూచి అతడి ముఖకవళికలు మారాయి. కొలిమి ఎప్పటికంటే ఏడంతలుగా వేడి చేయాలని ఆజ్ఞ జారీ చేశాడు. 20 సైన్యంతో ఉన్న బలిష్ఠులలో కొందరిని పిలిచి “షద్రకు, మేషాకు అబేద్‌నెగోలను బంధించి తీవ్రంగా మండుతున్న కొలిమిలో వేయండి” అని ఆజ్ఞాపించాడు. 21 ఆ ముగ్గురు వేసుకొన్న అంగీలూ లాగులూ పైవస్త్రాలూ ఇతర బట్టలతోకూడా కట్టబడి కొలిమిలో వేయబడ్డారు. 22 రాజు చాలా నొక్కి చెపుతూ ఆజ్ఞ జారీ చేసినందుచేతా కొలిమి చాలా వేడిగా ఉండడం చేతా షద్రకు, మేషాకు, అబేద్‌నెగోలను కొలిమిదగ్గరికి ఎత్తుకుపోయిన మనుషులు ఆ మంటలకు మాడిపోయి చచ్చారు. 23 షద్రకు, మేషాకు, అబేద్‌నెగో – ఈ ముగ్గురు – బంధితులై తీవ్రంగా మండుతున్న కొలిమిలో పడ్డారు.
24 అప్పుడు నెబుకద్‌నెజరురాజు ఆశ్చర్యంతో లేచి నిలబడ్డాడు, “మేము బంధించి అగ్నిలో వేసినది ముగ్గురు మనుషులు మాత్రమే గదా!” అని తన మంత్రులను అడిగాడు.
అందుకు వాళ్ళు “రాజా, నిజమే” అన్నారు.
25 అతడు “ఇరుగో! నలుగురు మనుషుల్ని చూస్తున్నాను. అగ్నిలో అటూ ఇటూ నడుస్తూ ఉన్నారు. వాళ్ళకు బంధకాలు లేవు. హాని ఏమీ కలగడం లేదు. ఆ నాలుగోవాడు దేవకుమారుని లాంటివాడు” అన్నాడు.
26 అప్పుడు నెబుకద్‌నెజరు భగభగమండే కొలిమి తలుపుదగ్గరికి వెళ్ళి “షద్రకు! మేషాకు! అబేద్‌నెగో! సర్వాతీతుడైన దేవుని సేవకులారా! బయటికి రండి! నాదగ్గరికి రండి!” అని పిలిచాడు. షద్రకు, మేషాకు, అబేద్‌నెగో ఆ మంటల్లోనుంచి బయటికి వచ్చారు. 27 పరిపాలకులూ ప్రముఖులూ రాష్ట్రాధిపతులూ రాజమంత్రులూ వారి చుట్టు గుమిగూడి వారిని పరిశీలనగా చూశారు. వారి శరీరాలకు మంటలచేత ఏ హానీ కలగలేదు. వారి తలవెంట్రుకలలో ఒక్కటి కూడా కమిలిపోలేదు. వారి బట్టలు కాలిపోలేదు. నిప్పు వాసన కూడా వారిని ఆవరించలేదు.
28 అప్పుడు నెబుకద్‌నెజరు ఇలా అన్నాడు: “షద్రకు మేషాకు అబేద్‌నెగోల దేవునికి స్తుతి కలుగుతుంది గాక! ఆయన తన దూతను పంపి తన సేవకులను రక్షించాడు. వారు ఆయనను నమ్ముకొని రాజాజ్ఞను ధిక్కరించారు. తమ దేవుణ్ణి తప్ప మరే దేవుణ్ణి సేవించము, పూజించము అంటూ తమ శరీరాలను అప్పగించివేశారు. 29 కనుక ఇప్పుడు నా ఆజ్ఞ ఏమిటంటే, ఏ ప్రజల్లో గానీ ఏ ప్రాంతీయులలో గానీ ఏ భాష మాట్లాడేవాళ్ళలో గానీ ఎవరైనా షద్రకు మేషాకు అబేద్‌నెగోల దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చెపితే వాళ్ళను ముక్కలు చేయడం, వాళ్ళ ఇండ్లు పూర్తిగా కూలగొట్టడం జరగాలి. ఎందుకంటే, ఈ దేవుడు రక్షించినట్టు మరే దేవుడూ రక్షించలేడు.”
30 అప్పుడు రాజు షద్రకు మేషాకు అబేద్‌నెగోలకు బబులోను ప్రదేశంలో హెచ్చు ఉద్యోగమిచ్చాడు.