2
1 తన పరిపాలనలో రెండో సంవత్సరాన✽ నెబుకద్‌నెజరుకు కలలు✽ వచ్చాయి. వాటివల్ల అతడు కంగారుపడ్డాడు, నిద్ర పోలేకపోయాడు. 2 ✽ అందుచేత తాను కన్న కలలు తనకు తెలియజెప్పడానికి శకునజ్ఞులనూ మాంత్రికులనూ గారడీ వాళ్ళనూ జ్యోతిష్కులనూ పిలవనంపించాడు. వాళ్ళు వచ్చి రాజు ఎదుట నిలబడ్డప్పుడు అతడు వాళ్ళతో, 3 “నాకో కల వచ్చింది. దాని భావం తెలుసుకోవాలని కంగారుపడుతున్నాను” అన్నాడు.4 ✽అందుకు జ్యోతిష్కులు అరాం భాషలో రాజుతో “రాజు చిరంజీవి అవుతాడు గాక! ఆ కల ఏదో మీరు మీ దాసులైన మాతో చెప్పండి. మేము దాని భావం తెలియజేస్తాం” అన్నారు.
5 ✽రాజు జ్యోతిష్కులకు ఇలా జవాబిచ్చాడు: “నేను నిర్ణయించినదేమిటంటే, నాకు వచ్చిన కలనూ దాని భావాన్నీ మీరు తెలియజేయకపోతే మిమ్మల్ని ముక్కలు చేయిస్తాను, మీ ఇండ్లను పూర్తిగా కూలగొట్టిస్తాను. 6 ఆ కలనూ దాని భావాన్నీ తెలియజేస్తే మీకు ఈవులూ బహుమతులూ ఇప్పిస్తాను. మిమ్మల్ని అధికంగా ఘనపరుస్తాను. కాబట్టి ఆ కలనూ దాని భావాన్నీ నాకు తెలియజేయండి.” 7 మరోసారి వాళ్ళు “రాజు ఆ కలను మీ దాసులైన మాకు చెపితే దాని భావం తెలుపుతాం” అన్నారు.
8 అందుకు రాజు ఇలా అన్నాడు: “నా నిర్ణయం తెలుసుకొని కాలహరణం చేయడానికి మీరు చూస్తున్నారని నాకు బాగా తెలుసు. 9 కాలం గడుస్తూ ఉంటే అబద్ధాలూ వంచన మాటలూ నాకు చెప్పడానికి మీరు ఉద్దేశించారు. మీరు నా కలను తెలపకపొయ్యారా, మీకు ఒకే ఒక శిక్షావిధి ఉంటుంది. గనుక నా కలను నాకు చెప్పండి. అప్పుడు దాని భావం కూడా మీరు చెప్పగలరని నేను తెలుసుకొంటాను.”
10 అందుకు జ్యోతిష్కులు ఇలా జవాబిచ్చారు: “రాజు అడిగిన సంగతి చెప్పగలవాడు భూమిమీద ఎవ్వడూ లేడు. ఇదివరకు ఏ రాజూ ఏ పరిపాలకుడూ ఇలాంటి సంగతి తెలియజేయమని ఏ శకునజ్ఞుణ్ణీ మంత్రకుణ్ణీ జ్యోతిష్కుణ్ణీ అడగలేదు. 11 రాజు అడిగినది చాలా కష్టతరం. దేవుళ్ళు మాత్రమే దానిని రాజుకు తెలపగలరు గాని మరెవ్వరూ కాదు. దేవుళ్ళు మనుషులమధ్య నివసించరు గదా.”
12 ✽ఇది విని రాజు అధికంగా కోపగించాడు. అతడికి ఎంత ఆగ్రహం కలిగిందంటే, బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ నాశనం చేయాలని ఆజ్ఞ జారీ చేశాడు. 13 జ్ఞానులను చంపాలని శాసనం ప్రకటన అయింది గనుక దానియేలునూ అతని స్నేహితులనూ చంపడానికి మనుషులు వారికోసం వెదికారు.
14 బబులోనులో ఉన్న జ్ఞానులను చంపడానికి రాజ రక్షక భటుల అధిపతి అర్యోక్ బయలుదేరినప్పుడు దానియేలు అతడి దగ్గరికి వచ్చి జ్ఞానవివేకాలతో మాట్లాడాడు. 15 “రాజు ఇంత అయోమయంగా ఆజ్ఞ జారీ చేశాడేమిటి?” అని రాజాధిపతి అర్యోక్‌ను అడిగాడు. అర్యోక్ ఆ సంగతి దానియేలుకు వివరించాడు. 16 వెంటనే దానియేలు రాజుదగ్గరికి వెళ్ళి ఆ కల భావాన్ని తెలియజేయడానికి కొంత సమయం కావాలని రాజును ప్రాధేయపడ్డాడు. 17 అప్పుడు దానియేలు ఇంటికి వెళ్ళి తన స్నేహితులైన హనన్యా, మిషాయేలు, అజరయాలకు ఆ సంగతి వివరించాడు. 18 ✽బబులోనులో ఉన్న తక్కిన జ్ఞానులతోపాటూ తానూ తన మిత్రులూ నాశనం కాకుండా ఆ కల రహస్యం విషయంలో దయ చూపమని పరలోక దేవుణ్ణి బతిమాలుకోవాలని వారిని హెచ్చరించాడు. 19 ఆ రాత్రే దేవదర్శనం✽లో ఆ రహస్యం✽ దానియేలుకు వెల్లడి అయింది. గనుక దానియేలు పరలోక దేవుణ్ణి✽ ఇలా స్తుతించాడు:
20 ✽“దేవుని పేరుకు యుగయుగాలకు స్తుతి కలుగుతుంది గాక! జ్ఞానమూ బలప్రభావాలూ✽ ఆయనవే! 21 ✽ఆయన కాలాలనూ రుతువులనూ మారుస్తాడు. రాజులను సింహాసనమెక్కిస్తాడు, త్రోసివేస్తాడు. జ్ఞానులకు జ్ఞానం, వివేకులకు వివేకం ప్రసాదిస్తాడు. 22 ✝గుప్తమైన సంగతులనూ రహస్యాలనూ వెల్లడి చేస్తాడు. చీకటిమయమైన విషయాలు ఆయనకు తెలుసు. ఆయనదగ్గరే వెలుగుకు ఉనికిపట్టు ఉంది. 23 నా పూర్వీకుల దేవా! నేను నిన్ను స్తుతిస్తున్నాను, కృతజ్ఞత చెపుతున్నాను✽. నీవు నాకు జ్ఞానమూ బలప్రభావాలూ✽ ప్రసాదించావు. మేము నిన్ను అడిగిన సంగతి నాకు వెల్లడి చేశావు. రాజు కల సంగతి మాకు తెలియజేశావు.”
24 బబులోను జ్ఞానులను నాశనం చేయడానికి రాజు నియమించిన అర్యోక్‌దగ్గరికి దానియేలు వెళ్ళి ఇలా అన్నాడు: “బబులోను జ్ఞానులను నాశనం చేయకండి. నన్ను రాజుదగ్గరికి తీసుకువెళ్ళండి. నేను ఆయన కల భావాన్ని తెలియజేస్తాను.”
25 వెంటనే అర్యోక్ దానియేలును రాజుదగ్గరికి తీసుకుపోయాడు, “రాజు కల భావాన్ని చెప్పగలవాడు నాకు దొరికాడు. అతడు యూదానుంచి బందీలుగా వచ్చినవారిలో ఒకడు” అన్నాడు.
26 “నాకు వచ్చిన కలనూ దాని భావాన్నీ నీవు చెప్పగలవా?” అని రాజు దానియేలును అడిగాడు (దానియేలుకు బెల్‌తెషాజరు అనే మారు పేరు ఉంది).
27 ✽దానియేలు రాజుకు ఇలా జవాబిచ్చాడు: “రాజు అడిగిన రహస్య విషయం జ్ఞానులలో గానీ మాంత్రికులలో గానీ శకునజ్ఞులలో గానీ జ్యోతిష్కులలో గానీ ఎవ్వరూ తెలపలేకపోతున్నారు. 28 అయితే రహస్య విషయాలను వెల్లడి చేసే దేవుడు పరలోకంలో ఉన్నాడు. భవిష్యత్తులో జరగబోయేది ఆయన నెబుకద్‌నెజరురాజుకు తెలియజేశాడు. మీరు పడకమీద పడుకొని ఉన్నప్పుడు మీకు వచ్చిన కలలూ దర్శనాలూ ఇవి – 29 ✽రాజా, మీరు పడకమీద పడుకొని భవిష్యత్తులో ఏమి జరగబోతుందో అంటూ ఆలోచన చేశారు. రహస్య విషయాలు వెల్లడి చేసేవాడు జరగబోయేవాటిని మీకు తెలియజేశాడు. 30 ✽ఈ రహస్య విషయం ఆయన నాకు బయలుపరచిన కారణం నేను ఇతర మనుషులకంటే గొప్ప జ్ఞానిని అని కాదు. రాజా, ఆ కల భావమూ మీ మనసులోని ఆలోచనలూ మీకు తెలియాలని నాకు బయలుపరచడం జరిగింది.
31 “రాజా, మీరు చూస్తున్నప్పుడు బ్రహ్మాండమైన విగ్రహం ఒకటి మీకు కనిపించింది. అది గొప్పది, ప్రకాశమానమైనది, చూపుకు✽ భయంకరమైనది. ఆ విగ్రహం మీ ఎదుటే నిలబడింది. 32 ✽దాని తల మేలిమి బంగారం. దాని వక్షస్థలం, చేతులు వెండి. దాని ఉదరం, తొడలు కంచు. 33 దాని కాళ్ళు ఇనుము. దాని పాదాలు కొంత ఇనుము, కొంత కాల్చిన బంకమన్ను. 34 మీరు చూస్తూ ఉండగానే చేతి సహాయం లేకుండా ఒక రాయి✽ వేరై ఆ విగ్రహం పాదాలమీద పడింది, ఇనుమూ బంకమన్నూ కలిసిన ఆ పాదాలను ముక్కలు చేసివేసింది. 35 ✽అప్పుడు ఆ ఇనుము కాల్చిన బంకమన్ను, కంచు, వెండి, బంగారం ఏకంగా చూర్ణమయ్యాయి, కోత కాలాన కళ్ళంలో ఉన్న చెత్తలాగా అయిపోయాయి. వాటి జాడ కనబడకుండా అవి గాలిచేత కొట్టుకుపొయ్యాయి. అయితే విగ్రహాన్ని విరగ్గొట్టిన ఆ రాయి మహా పర్వతమై భూలోకమంతటా వ్యాపించింది.
36 “మీకు వచ్చిన కల ఇదే. ఇప్పుడు దాని భావం రాజుకు తెలియజేస్తాం. 37 ✽ రాజా, మీరు రాజులకు రాజు అయ్యారు. పరలోక దేవుడు రాజ్యాన్నీ అధికారాన్నీ బలాన్నీ వైభవాన్నీ మీకు ప్రసాదించాడు. 38 ఆయన మానవకోటినీ భూజంతువులనూ గాలిలో ఎగిరే పక్షులనూ మీ చేతిలో ఉంచాడు. మనుషులు ఎక్కడ కాపురమున్నా, వారందరిమీదా మీకు ప్రభుత్వం అనుగ్రహించాడు. బంగారు తల మీరే!
39 “మీ తరువాత మరో సామ్రాజ్యం పైకి వస్తుంది. అది మీ రాజ్యంకంటే తక్కువై ఉంటుంది. దాని తరువాత మూడో సామ్రాజ్యం సర్వ లోకాన్ని పరిపాలిస్తుంది. అది కంచులాంటిదిగా ఉంటుంది.
40 ✽“దాని తరువాత నాలుగో సామ్రాజ్యం ఉంటుంది. అది ఇనుములాగా బలంగా ఉంటుంది. ఇనుము అన్నిటినీ చితగ్గొట్టివేస్తుంది, ముక్కలు చేస్తుంది. ఇనుము అన్నిటిని బ్రద్దలు చేసినట్టే ఈ సామ్రాజ్యం ఆ రాజ్యాలన్నిటినీ విరగగొట్టేస్తుంది, చూర్ణం చేస్తుంది. 41 ✽ఆ విగ్రహం పాదాలకూ కాలి వ్రేళ్ళకూ కొంత ఇనుము, కొంత కాల్చిన బంకమన్ను ఉన్నట్టు మీరు చూశారు గదా. అలాగే నాలుగో సామ్రాజ్యంలో భేదాలు ఉంటాయి. ఇనుము కాల్చిన బంకమట్టితో కలిసివుండడం మీరు చూశారు గదా. అలాగే ఆ సామ్రాజ్యంలో ఇనుములాంటి బలం ఉంటుంది. 42 కానీ కాలి వ్రేళ్ళు కొంత ఇనుము, కొంత కాల్చిన బంకమన్ను. అందుచేత ఆ సామ్రాజ్యం కొంతమట్టుకు బలంగా, కొంతమట్టుకు పెళుసుగా ఉంటుంది. 43 ఇనుము కాల్చిన బంకమట్టితో కలిసి ఉన్నట్టు మీరు చూశారు. ఆ విధంగానే ఆ సామ్రాజ్యంలో ఉన్న ప్రజలు మిశ్రితమై ఉంటారు. ఇనుము బంకమట్టితో అతికిపోదు గదా. అలాగే ఆ ప్రజలు ఒకటిగా ఉండిపోరు.
44 “ఆ రాజుల✽ కాలంలో పరలోక దేవుడు ఒక రాజ్యం నెలకొలుపుతాడు. ఆ రాజ్యం ఎన్నటికీ నశించదు. అది వేరే ప్రజల చేతిలో పడదు. అది ఆ రాజ్యాలన్నిటినీ చితగ్గొట్టి వేస్తుంది, తుదముట్టిస్తుంది గాని అది ఎప్పటికీ నిలుస్తుంది. 45 చేతి సహాయం లేకుండా పర్వతంనుంచి వేరైన రాయి ఇనుమునూ కంచునూ వెండినీ బంగారాన్నీ ముక్కలు చేయడం మీరు చూశారు గదా. అలాగే జరుగుతుంది. జరగబోయే విషయం గొప్ప దేవుడు రాజుకు వెల్లడి చేశాడు. ఆ కల యథార్థం. ఈ వివరణ నమ్మతగినది.”
46 అప్పుడు నెబుకద్‌నెజరురాజు దానియేలు ఎదుట సాగిలపడ్డాడు, సాష్టాంగ నమస్కారాలు✽ చేశాడు. అతనికి నైవేద్యం, ధూపం అర్పించాలని✽ ఆజ్ఞ జారీ చేశాడు. 47 రాజు దానియేలుతో “నీవు ఈ రహస్య విషయం వెల్లడి చేయగలిగావు గనుక నీ దేవుడే దేవుళ్ళకు దేవుడనడానికి ఎలాంటి అనుమానం లేదు. ఆయనే రాజులకు ప్రభువు, రహస్య విషయాలు వెల్లడి చేయగలవాడు” అన్నాడు.
48 ✽ అప్పుడు రాజు దానియేలుకు ఉన్నత పదవి కట్టబెట్టాడు, అనేక గొప్ప బహుమతులిచ్చాడు. అతణ్ణి బబులోను ప్రదేశమంతటిమీదా అధికారిగా, అక్కడి జ్ఞానులందరికీ పెద్దగా నియమించాడు. 49 దానియేలు చేసిన మనవి ప్రకారం రాజు షద్రకునూ మేషాకునూ అబేద్‌నెగోనూ బబులోను ప్రదేశమంతటిమీదా పాలకులుగా నియమించాడు. అయితే దానియేలు రాజభవనంలో ఉండిపోయాడు.