దానియేలు
1
1 ✽యూదా రాజైన యెహోయాకీమ్ పరిపాలనలో మూడో ఏట బబులోనుదేశం రాజైన నెబుకద్‌నెజరు జెరుసలం మీదికి వచ్చి దానిని ముట్టడించాడు. 2 ✽ ప్రభువు యూదా రాజైన యెహోయాకీమ్ను అతడి చేతికి అప్పగించాడు. దేవాలయంలో ఉన్న కొన్ని వస్తువులు కూడా అతడికి అప్పగించాడు. అతడు వాటిని షీనార్‌కు తన దేవుడి ఆలయానికి తీసుకుపోయాడు. తన దేవుడి ఆలయంలో ఉన్న ఖజానాలో వాటిని ఉంచాడు.3 ✽తరువాత బబులోను రాజు తన నపుంసకుల అధిపతిని పిలిపించాడు. అతడి పేరు అష్‌పెనజు. రాజు ఇస్రాయేల్‌వారి రాజ వంశంలో, గొప్ప వంశాలలో కొందరు యువకులను రప్పించమని అతణ్ణి ఆజ్ఞాపించాడు. 4 వారు ఎలాంటి లోపం లేనివారై అందమైనవారై అన్ని విధాల విద్యాప్రవీణత, తెలివితేటలు, జ్ఞాన వివేకాలు గలవారై రాజభవనంలో సేవ చేయడానికి సమర్థులై ఉండాలని చెప్పాడు. కల్దీయవారి భాష, విద్య వారికి నేర్పాలని ఆదేశించాడు. 5 అంతేగాక, రాజు తన ఆహారంలోనుంచీ✽ ద్రాక్ష మద్యంలోనుంచీ ఒక భాగాన్ని ప్రతి రోజూ వారికివ్వాలని నిర్ణయించాడు. మూడు సంవత్సరాలు తర్బీతు పొందినతరువాత వారు తన సమక్షంలో సేవ చేయాలని రాజు ఆశయం. 6 ✽వారిలో యూదావారు కొందరు ఉన్నారు. వారు దానియేలు, హనన్యా, మిషాయేలు, అజరయా. 7 నపుంసకుల అధిపతి వారికి వేరే పేర్లు పెట్టాడు. దానియేలును బెల్‌తెషాజరు, హనన్యాను షద్రకు, మిషాయేలును మేషాకు, అజరయాను అబేద్‌నెగో అన్నాడు.
8 ✽రాజు ఇచ్చే ఆహారాన్నీ ద్రాక్ష మద్యాన్నీ పుచ్చుకోవడంవల్ల తనను అపవిత్రం చేసుకోకూడదని దానియేలు నిశ్చయించు కొన్నాడు. ఆ విధంగా అపవిత్రుడు కాకుండేలా సహాయం చేయమని నపుంసకుల అధిపతిని ప్రాధేయపడ్డాడు. 9 అంతకు ముందు ఆ అధిపతి దానియేలును దయతో వాత్సల్యంతో చూచేలా దేవుడు✽ చేశాడు. 10 ✽అయినా అతడు దానియేలుతో ఇలా అన్నాడు: “నా యజమాని – నా రాజు – మీకు ఆహారాన్నీ పానీయాన్నీ నియమించాడు గదా. ఆయనంటే నాకు భయం. మీ వయసు ఉన్న ఇతర యువకులకంటే మీ ముఖాలు కుశించిపోతే ఆయన చూస్తాడు గదా. అలాంటప్పుడు మీవల్ల నాకు ప్రాణాపాయం కలుగుతుంది.”
11 ✽దానియేలును, హనన్యాను, మిషాయేలును, అజరయాను పైవిచారణ చేయడానికి నపుంసకుల అధిపతి నియమించినవాడితో దానియేలు ఇలా అన్నాడు: 12 “పది రోజులవరకు మీ దాసులైన మమ్మల్ని పరీక్షించి చూడండి. తినడానికి శాకాహారం, త్రాగడానికి నీళ్ళు మాత్రమే మాకిప్పించండి. 13 ఆ తరువాత రాజు ఇచ్చే ఆహారం తిన్న యువకుల ముఖాలతో మా ముఖాలను పోల్చి చూడండి. అప్పుడు మీకు కనిపించే ప్రకారం మాపట్ల వ్యవహరించండి.”
14 అందుకు అతడు ఒప్పుకొని పది రోజులపాటు వారిని అలా పరీక్షించాడు. 15 ✽ఆ పది రోజుల తరువాత రాజు ఇచ్చే ఆహారం తిన్న యువకులందరికంటే వారి ముఖాలు ఆరోగ్యవంతంగా ఉన్నాయి, వారి శరీరాలు పుష్టిగా ఉన్నాయి. 16 ✽కనుక వారికి నియమించిన ఆహారాన్నీ ద్రాక్ష మద్యాన్నీ వారిని పైవిచారణ చేసేవాడు తీసివేసి వారికి శాకాహారమే ఇచ్చాడు.
17 ఈ నలుగురు యువకులకు సమస్త సాహిత్యం, విద్య విషయంలో దేవుడు తెలివి, వివేకం ప్రసాదించాడు✽. దానియేలుకు అన్ని రకాల దేవదర్శనాలనూ కలలనూ గ్రహించే సామర్థ్యం ఉంది. 18 నెబుకద్‌నెజరు తన సముఖానికి వారిని తేవడానికి నిర్ణయించిన సమయం వచ్చింది. నపుంసకుల అధిపతి వారిని తెచ్చి రాజు సమక్షంలో నిలబెట్టాడు. 19 రాజు వారితో మాట్లాడినప్పుడు ఆ యువకులందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజరయాలతో సమానులెవ్వరు కనిపించలేదు గనుక వారు రాజు సమక్షంలో సేవ✽ చేయడం ఆరంభించారు. 20 ✽జ్ఞానవివేకాలను గురించి రాజు వారిని ప్రశ్నించిన ప్రతి విషయంలోనూ వారు ఆ రాజ్యమంతట్లో ఉన్న సమస్తమైన శకునగాళ్ళకంటే మాంత్రికులకంటే పది రెట్లు సమర్థులని తెలిసింది. 21 ✽కోరెషు చక్రవర్తి పరిపాలించే మొదటి సంవత్సరంవరకు దానియేలు అక్కడ ఉండిపోయాడు.