47
1 అప్పుడాయన ఆలయ ద్వారం దగ్గరికి నన్ను తీసుకుపోయాడు. ఆలయం ముందుభాగం తూర్పు దిశగా ఉంది. ఆలయం గడపక్రిందనుంచి నీళ్ళు ఉబికి తూర్పుగా పారుతూ ఉండడం నేను చూశాను. నీళ్ళు బలిపీఠానికి దక్షిణంగా ఆలయం దక్షిణ దిక్కున క్రిందనుంచి పారుతూ ఉన్నాయి. 2 అప్పుడాయన ఉత్తర ద్వారంగుండా నన్ను వెంటబెట్టుకొని తూర్పుదిశగా ఉన్న బయటి ద్వారందగ్గరికీ గోడ బయటికీ నన్ను తీసుకుపోయాడు. అక్కడ ద్వారం దక్షిణ దిక్కునుంచి నీళ్ళుబికి పారుతూ ఉన్నాయి.
3 ఆ వ్యక్తి కొలనూలు చేతపట్టుకుని తూర్పువైపు నడుస్తూ వెయ్యి మూరలు కొలిచాడు. అప్పుడా నీళ్ళగుండా నన్ను నడిపించాడు. నీళ్ళు చీలమండ లోతున్నాయి. 4 అతడు మరో వెయ్యి మూరలు కొలిచి నీళ్ళగుండా నన్ను నడిపించాడు. నీళ్ళు మోకాళ్ళవరకు ఉన్నాయి. మరో వెయ్యి మూరలు కొలిచి నీళ్ళగుండా నన్ను నడిపించాడు. అక్కడ నీళ్ళు నడుమువరకు వచ్చాయి. 5 అతడు మరో వెయ్యి మూరలు కొలిచాడు. నీళ్ళు నేను నడిచి దాటలేనంత నది అయ్యాయి. ఆ నది ఈతవల్ల తప్ప దాటలేనంత లోతైనది. 6 ఆయన “మానవపుత్రా, ఇది చూశావు గదా” అని చెప్పి నన్ను నది ఒడ్డుదగ్గరికి మళ్ళీ చేర్చాడు. 7  అక్కడ చేరి నేను చూస్తే నదికి అటూ ఇటూ అనేక చెట్లు కనిపించాయి.
8 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు: “ఈ నీళ్ళు ఉబికి తూర్పు ప్రదేశానికి పారి అరాబాలోయలోకి దిగి సరస్సులో పడుతాయి. అప్పుడా సముద్రం నీళ్ళు మంచి నీళ్ళవుతాయి. 9 నది ఎక్కడ పారుతుందో అక్కడ జలచరాలన్నీ బ్రతుకుతాయి. ఈ నీళ్ళు సరస్సులో పడి దాని నీళ్ళు మంచివి అయ్యేలా చెయ్యడంవల్ల దానిలో చాలా చేపలు ఉంటాయి. నది ఎక్కడ పారుతుందో అక్కడ అన్ని బ్రతుకుతాయి. 10 దాని ఒడ్డున చేపలు పట్టేవారు నిలబడి ఉంటారు. ఏన్‌గెదీ నుంచి ఏన్ ఎగ్లాయిం వరకు వలలు పరచి ఉంటాయి. మహా సముద్రంలో ఉన్నట్టు అనేక రకాల చేపలు దానిలో విస్తారంగా ఉంటాయి. 11 చిత్తడి నేల, ఊబిస్థలాలు మాత్రం ఉప్పుచోట్లుగా మిగిలి ఉంటాయి. వాటి నీళ్ళు మంచి నీళ్ళుగా మారిపోవు. 12 నదికి అటూ ఇటూ అన్ని రకాల పండ్ల చెట్లు పెరుగుతాయి. వాటి ఆకులు వాడిపోవు. అవి పండ్లు కాయకుండా ఉండవు. నది నీళ్ళు పవిత్ర స్థానంలోనుంచి పారుతూ ఉంటాయి. ఆ చెట్లు ప్రతి నెలా పండ్లు కాస్తాయి. వాటి పండ్లు ఆహారంగా, ఆకులు ఔషధంగా ఉంటాయి.
13 “యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: మీరు వారసత్వంగా ఇస్రాయేల్ ప్రజల పన్నెండు గోత్రాలకు పంచిపెట్టవలసిన దేశం సరిహద్దులివి. మీరు యోసేపు వంశీయులకు రెండు భాగాలివ్వాలి. 14 భేదమేమీ లేకుండా మీలో ప్రతి ఒక్కరూ దానిలో సమానంగా వారసత్వం పొందాలి. మీ పూర్వీకులకు ఇస్తానని నేను ప్రమాణం చేశాను గనుక ఈ దేశం మీకు వారసత్వంగా వస్తుంది.
15 “దేశ సరిహద్దులేవంటే, ఉత్తర దిక్కున మహా సముద్రంనుంచి హెతలోను త్రోవమీదుగా సెదాదు దగ్గరికి పోతుంది. 16 అక్కడనుంచి అది హమాతుకూ బేరోతాకూ సిబ్రయీంకూ (అది దమస్కు సరిహద్దుకూ హమాతు సరిహద్దుకూ మధ్య ఉంది) హాజేర్‌హాతీకోను వరకూ ఉంటుంది (అది హవ్రాను సరిహద్దు దగ్గరే ఉంది). 17 సముద్రంనుంచి వచ్చిన ఈ సరిహద్దు దమస్కు సరిహద్దు ఉన్న హసర్ ఏనానుకు పోతుంది. దానికి ఉత్తరంగా హమాతు సరిహద్దు ఉంటుంది. ఇది ఉత్తరం సరిహద్దు.
18 “తూర్పుదిక్కు సరిహద్దు హవ్రానుకూ దమస్కుకూ మధ్య నుంచి బయలుదేరి గిలాదు ప్రదేశానికీ ఇస్రాయేల్ దేశానికీ మధ్య ఉన్న యొర్దాను పొడుగున సాగి తూర్పు సరస్సుకు తామారువరకు పోతుంది. ఇది మీకు తూర్పు సరిహద్దు.
19 “దక్షిణ దిక్కు సరిహద్దు తామారు నుంచి కాదేషు దగ్గర ఉన్న మెరీబా ఊటలవరకు ఉంటుంది. అక్కడనుంచి ‘ఈజిప్ట్ వాగు’ వెంట మహా సముద్రంవరకు పోతుంది. ఇది దక్షిణం సరిహద్దు. 20 పడమటి దిక్కున దక్షిణం సరిహద్దునుంచి హమాతుకు పోయే త్రోవకు ఎదురుగా ఉన్న స్థలంవరకు మహా సముద్రమే సరిహద్దు. ఇది పడమటి సరిహద్దు.
21 “ఇస్రాయేల్ ప్రజల గోత్రాల ప్రకారం దేశాన్ని మీరు పంచుకోవాలి. 22 మీకూ మీ మధ్య ఉంటూ పిల్లలు కన్న విదేశీయులనూ వారసత్వంగా చీట్లు వేసి పంచిపెట్టాలి. ఆ విదేశీయులనూ దేశంలో పుట్టిన ఇస్రాయేల్‌వారినీ మీరు ఏక దృష్టితో చూడాలి. చీట్లు వేసి మీతోపాటు వారికి ఇస్రాయేల్ గోత్రికుల మధ్య వారసత్వం ఏర్పాటు చేయాలి. 23 ఏ గోత్రికులమధ్య ఆ విదేశీయులు కాపురముంటారో ఆ గోత్ర భూభాగంలో వారికి వారసత్వమివ్వాలి. ఇది యెహోవా ప్రభు వాక్కు.