48
1 “గోత్రాల పేరులు ఇవి: ఉత్తర దిక్కున తూర్పు సరిహద్దు నుంచి పడమటి సరిహద్దు వరకు దానువారికి ఒక భాగముంటుంది. దాని సరిహద్ధు హెతలోను త్రోవమీదుగా లబోహమాతకు సాగి హసర్ ఏనానువరకూ హమాతు దగ్గర ఉన్న దమస్కు ఉత్తరం సరిహద్దువరకూ పోతుంది. 2 ఆషేరువారికి ఒక భాగముంటుంది. తూర్పునుంచి పడమటివరకు అది దానువారి భూమిని ఆనుకొని ఉంటుంది. 3 నఫ్తాలివారికి ఒక భాగముంటుంది. తూర్పునుంచి పడమటివరకు అది ఆషేరువారి భూమిని ఆనుకొని ఉంటుంది. 4 మనష్షేవారికి ఒక భాగముంటుంది. తూర్పునుంచి పడమటివరకు అది నఫ్తాలి భూమిని ఆనుకొని ఉంటుంది. 5 ఎఫ్రాయింవారికి ఒక భాగముంటుంది. తూర్పునుంచి పడమటివరకు అది మనష్షే వారి భూమిని ఆనుకొని ఉంటుంది. 6 రూబేను వారికి ఒక భాగముంటుంది. తూర్పునుంచి పడమటివరకు అది ఎఫ్రాయింవారి భూమిని ఆనుకొని ఉంటుంది. 7 యూదావారికి ఒక భాగముంటుంది. తూర్పునుంచి పడమటివరకు అది రూబేను వారి భూమిని ఆనుకొని ఉంటుంది. 8 తూర్పునుంచి పడమటివరకు యూదా భూమిని ఆనుకొని ఉన్న ప్రదేశం మీరు ప్రత్యేకించవలసిన భూమి. దాని వెడల్పు ఇరవైయైదు వేల మూరలు. తూర్పునుంచి పడమటికి దాని పొడవు, ఇతర భాగాల పొడవు సమానంగా ఉంటాయి. దాని మధ్యలోనే పవిత్ర స్థానం ఉంటుంది.
9 “యెహోవాకు మీరు ప్రతిష్ఠించే ప్రత్యేక భాగానికి ఇరవై యైదు వేల మూరల పొడవూ పదివేల మూరల వెడల్పూ ఉండాలి. 10 ఈ ప్రత్యేక ప్రదేశం యాజులకు చెందుతుందన్న మాట. ఉత్తర దిక్కున దానికి ఇరవై యైదు వేల పొడవూ పడమటి దిక్కున పదివేల మూరల వెడల్పూ తూర్పు దిక్కున పదివేల మూరల వెడల్పూ దక్షిణ దిక్కున ఇరవైయైదు వేల మూరల పొడవూ ఉండాలి. ఆ భూమి మధ్యలోనే యెహోవా పవిత్ర స్థానం ఉంటుంది. 11 ఆ భూమి సాదోకు వంశీయులై పవిత్రపరచబడ్డ యాజులకు చెందుతుంది. ఇస్రాయేల్ ప్రజలు త్రోవ తప్పిపోయినప్పుడు తక్కిన లేవీగోత్రికులలాగా సాదోకు వంశీయులు తప్పిపోలేదు. వారు నా ఆజ్ఞలను శిరసావహించి సేవ చేశారు. 12 ప్రత్యేక ప్రదేశంలోని ఆ ప్రత్యేక భూమి వారిదవుతుంది. అది అతి పవిత్రంగా ఉంటుంది. ఆ భూమి లేవీగోత్రికుల సరిహద్దు ప్రక్కనే ఉంటుంది. 13 యాజుల భూమి సరిహద్దు ప్రక్కన ఉన్న లేవీగోత్రికుల భాగానికి కూడా ఇరవైయైదు వేల మూరల పొడవూ పది వేల మూరల వెడల్పూ ఉండాలి. దాని పొడవంతా ఇరవైయైదు వేల మూరలు, వెడల్పు పది వేల మూరలు. 14 ఆ భూమి యెహోవాకు పవిత్రంగా ఉంటుంది గనుక వారు దానిలో ఏ భాగమూ అమ్మకూడదు, బదులివ్వకూడదు, దేశమంతట్లో ఉన్న ఆ శ్రేష్ఠ భూమి ఇతరుల స్వాధీనం చేయకూడదు.
15 “మిగతా భూమి పొడవు ఇరవైయైదు వేల మూరలు, వెడల్పు అయిదు వేల మూరలు. అది సాధారణమైన ఉపయోగాలకోసం – ఇండ్లకోసం, మైదానాలకోసం ఉంటుంది. నగరం దాని మధ్యలోనే ఉంటుంది. 16 నగరానికి ఉండవలసిన కొలతలేవంటే, ఉత్తర దిక్కున నాలుగు వేల ఐదు వందల మూరలు, దక్షిణ దిక్కున నాలుగు వేల అయిదు వందల మూరలు. తూర్పు దిక్కున నాలుగు వేల అయిదు వందల మూరలు, పడమటి దిక్కున నాలుగు వేల అయిదు వందల మూరలు.
17 నగరానికి చెందిన మైదానాల కొలత ఉత్తర దిక్కున రెండు వందల యాభై మూరలు, దక్షిణ దిక్కున రెండు వందల యాభై మూరలు, తూర్పు దిక్కున రెండు వందల యాభై మూరలు, పడమటి దిక్కున రెండు వందల యాభై మూరలు. 18 పవిత్ర ప్రదేశంలో సమదూరంగా ఉండి దాని సరిహద్దు ప్రక్కనే ఉన్న మిగతా భూమి కొలత తూర్పు దిక్కున పది వేల మూరలు, పడమటి దిక్కున పది వేల మూరలు. ఆ భూమి పంటలు నగరంలో నివాసముండే పనివారికోసం ఉంటాయి. 19 నగరంలో నివాసముండి దానిని సాగు చేసేవారు ఇస్రాయేల్ గోత్రాలన్నిటికీ చెందుతారు. 20 ప్రత్యేక ప్రదేశమంతా ఇరవైయైదు వేల మూరల చదరంగా ఉంటుంది. దానిలో పవిత్ర భాగాన్నీ నగరానికి చెందే భూమినీ మీరు ప్రత్యేకించాలి.
21 “పవిత్ర భాగం కోసం, నగర భూమికోసం ఏర్పాటు చేసిన భాగానికి ఇరుప్రక్కల ఉన్న మిగతా భూమి అధిపతిదవుతుంది. తూర్పు దిక్కున ఇరవైయైదు వేల మూరలు గల పవిత్ర భాగంనుంచి అది తూర్పు సరిహద్దువరకు వ్యాపిస్తుంది. పడమటి దిక్కున ఇరవైయైదు వేల మూరలు గల పవిత్ర భాగంనుంచి పడమటి సరిహద్దు వరకు వ్యాపిస్తుంది. గోత్రాల భాగాలతో సమదూరంగా ఉన్న ఈ రెండు భాగాలు అధిపతివవుతాయి. పవిత్రాలయం ఉన్న పవిత్ర భాగం వాటి మధ్యగా ఉంటుంది. 22 అధిపతికి చెందే భాగాల మధ్యలోనే లేవీగోత్రికుల భాగం, నగరం భూమి ఉంటాయి. యూదావారి సరిహద్దుకూ బెన్‌యామీనువారి సరిహద్ధుకూ మధ్యగా ఉన్న భాగం అధిపతిది.
23 “తక్కిన గోత్రాల సంగతి ఏమంటే, బెన్‌యామీనువారికి ఒక భాగముంటుంది. అది తూర్పు సరిహద్దునుంచి పడమటి సరిహద్దు వరకు ఉంటుంది. 24 షిమ్యోనువారికి ఒక భాగముంటుంది. తూర్పు నుంచి పడమటివరకు అది బెన్‌యామీనువారి భూమిని ఆనుకొని ఉంటుంది. 25 ఇశ్శాకారువారికి ఒక భాగముంటుంది. తూర్పునుంచి పడమటివరకు అది షిమ్యోనువారి భూమిని ఆనుకొని ఉంటుంది. 26 జెబూలూనువారికి ఒక భాగముంటుంది. అది తూర్పునుంచి పడమటివరకు ఇశ్శాకారువారి భూమిని ఆనుకొని ఉంటుంది. 27 గాదువారికి ఒక భాగముంటుంది. అది తూర్పునుంచి పడమటివరకు జెబూలూనువారి భూమిని ఆనుకొని ఉంటుంది. 28 దక్షిణ దిక్కున గాదువారికి సరిహద్దు తామారునుంచి కాదేషుదగ్గర ఉన్న మెరీబా ఊటలవరకు, అక్కడనుంచి ఈజిప్ట్ వాగు వెంట మహా సముద్రంవరకు ఉంటుంది. 29 మీరు చీట్లు వేసి ఇస్రాయేల్ గోత్రాలకు విభాగించవలసిన దేశం ఇదే. వారి వారి భాగాలు ఇవే. ఇది యెహోవాప్రభు వాక్కు.
30  “నగరంనుంచి బయటికి పోయే గుమ్మాలు ఇలా ఉంటాయి. నాలుగు వేల అయిదు వందల మూరల పొడవు గల ఉత్తర దిక్కున మూడు ద్వారాలుంటాయి. 31 నగర ద్వారాలకు ఇస్రాయేల్ గోత్రాల పేర్లు పెట్టాలి. ఉత్తర దిక్కున రూబేను ద్వారం, యూదా ద్వారం, లేవీ ద్వారం ఉంటాయి. 32 నాలుగు వేల అయిదు వందల మూరల పొడవు గల తూర్పు దిక్కున మూడు ద్వారాలుంటాయి – యోసేపు ద్వారం, బెన్యామీను ద్వారం, దాను ద్వారం. 33 నాలుగు వేల అయిదు వందల మూరల పొడవు గల దక్షిణ దిక్కున మూడు ద్వారాలుంటాయి – షిమ్యోను ద్వారం, ఇశ్శాకారు ద్వారం, జెబూలూను ద్వారం. 34 నాలుగు వేల అయిదు వందల మూరల పొడవుగల పడమటి దిక్కున మూడు ద్వారాలుంటాయి – గాదు ద్వారం, ఆషేరు ద్వారం, నఫ్తాలి ద్వారం. 35 దాని చుట్టు కొలత పద్ధెనిమిది వేల మూరలు.
అప్పటినుంచి ఆ నగరానికి “యెహోవా ఉన్న స్థలం” అని పేరు.