46
1 “యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, పని చేసే ఆరు రోజులు తూర్పు దిశగా ఉన్న లోపలి ఆవరణ ద్వారం తలుపులు మూసి ఉండాలి, విశ్రాంతి రోజున అమావాస్య రోజున తెరచి ఉండాలి. 2 అధిపతి వెలుపలినుంచి ద్వారం వసారా గుండా ప్రవేశించి ద్వారబంధం దగ్గర నిలబడాలి. యాజులు అతని హోమబలి జంతువులనూ శాంతి బలి పశువులనూ అర్పించాలి. ఆలోగా అతడు ద్వారందగ్గర నిలుచుండి ఆరాధన చేయాలి. ఆ తరువాత అతడు బయటికి వెళ్ళాలి గాని సాయంకాలమయ్యే వరకు ద్వారం తలుపులు మూయడం జరగకూడదు. 3 విశ్రాంతి దినాలలో, అమావాస్యలలో దేశప్రజలు ఆ ద్వారందగ్గర నిలుచుండి యెహోవాను ఆరాధించాలి. 4 విశ్రాంతి దినాన అధిపతి యెహోవాకు అర్పించవలసిన హోమబలి ఏమంటే, లోపం లేని ఆరు గొర్రెపిల్లలూ లోపం లేని ఒక పొట్టేలూ. 5 పొట్టేలుతో పాటు తూమెడు పిండి నైవేద్యంగా అర్పించాలి, గొర్రెపిల్లతో పాటు ఇష్టమున్న కొలది పిండి నైవేద్యంగా అర్పించాలి. అయితే ప్రతి తూమెడు పిండితో కూడా నాలుగు లీటర్ల నూనె అర్పించాలి. 6 అమావాస్యనాడు కోడెదూడనూ ఆరు గొర్రెపిల్లలనూ ఒక పొట్టేలునూ అర్పించాలి. అన్ని లోపం లేనివిగా ఉండాలి. 7 కోడెతోపాటు తూమెడు పిండి, పొట్టేలుతోపాటు తూమెడు పిండి, గొర్రెపిల్లలతో పాటు ఇష్టమున్నకొలది పిండి నైవేద్యంగా అతడు అర్పించాలి. ప్రతి తూమెడు పిండితో నాలుగు లీటర్ల నూనె కూడ అర్పించాలి. 8 అధిపతి ప్రవేశించేటప్పుడెల్లా ద్వార వసారాగుండా రావాలి, దానిగుండా బయటికి వెళ్ళాలి.
9 “దేశప్రజలు నియామక కాలాలలో యెహోవాను ఆరాధించడానికి వచ్చేటప్పుడెల్లా ఉత్తర ద్వారంగుండా ప్రవేశించేవారు దక్షిణ ద్వారంగుండా బయటికి వెళ్ళాలి. దక్షిణ ద్వారంగుండా ప్రవేశించేవారు ఉత్తర ద్వారంగుండా బయటికి వెళ్ళాలి. వచ్చిన ద్వారంగుండా ఎవరూ తిరిగి వెళ్ళకూడదు గాని అందరూ ఎదురుగా ఉన్న ద్వారంగుండా వెళ్ళాలి. 10 అధిపతి వారిమధ్య ఉండాలి. వారు ప్రవేశించేటప్పుడు అతడు ప్రవేశించాలి. వారు బయటికి వెళ్ళేటప్పుడు అతడు వెళ్ళాలి.
11 “పండుగ రోజులలో, నియామక కాలాలలో అర్పించవలసిన నైవేద్యం ఎద్దుతో గానీ పొట్టేలుతో గానీ తూమెడు పిండి. గొర్రెలతోపాటు ఇష్టమున్నంత పిండి అర్పించవచ్చు. ప్రతి తూమెడు పిండితోకూడా నాలుగు లీటర్లు నూనె అర్పించాలి. 12 అధిపతి స్వేచ్ఛాపూర్వకమైన అర్పణ – అది హోమ బలి కానివ్వండి, శాంతి బలి కానివ్వండి – యెహోవాకు అర్పిస్తే తూర్పు దిక్కున ఉన్న ద్వారం తలుపులు అతనికి తీయాలి. విశ్రాంతి దినాలలో అర్పించేప్రకారం అతడు హోమబలినీ శాంతిబలినీ అర్పించి వెళ్ళిపోవాలి. అతడు వెళ్ళిన తరువాత ద్వారం తలుపులు మూయడం జరగాలి.
13 “ప్రతి రోజూ మీరు లోపం లేని ఏడాది గొర్రెపిల్లను హోమబలిగా తేవాలి. 14 దానితోపాటు ప్రతి ఉదయమూ నైవేద్యంగా తూమెడు పిండిలో ఆరో భాగం, పిండి కలపడానికి ఒక లీటరు నూనె తేవాలి. ఇది ఎప్పటికీ నిలిచి ఉండే శాసనం. 15 ప్రతి ఉదయకాలంలో నిత్యమైన హోమంగా అర్పించడానికి గొర్రెపిల్లనూ నైవేద్యాన్నీ నూనెనూ తేవాలి.
16 “యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, అధిపతి తాను వారసత్వంగా పొందిన భూమిలో ఒక భాగం తన కొడుకులలో ఎవడికైనా ఇస్తే అది అతని కొడుకులదవుతుంది. ఆ ఆస్తి వారసత్వంవల్ల వారికి వస్తుందన్నమాట. 17 ఒకవేళ అతడు తన సేవకులలో ఎవడికైనా తన భూమిలో ఒక భాగం ఇస్తే అది విడుదల సంవత్సరంవరకే ఆ సేవకుని అధీనంలో ఉంటుంది. అప్పుడు అది అధిపతికి మళ్ళీ వస్తుంది. అధిపతి వారసత్వం భూమి అతని సంతతివారిదే. 18 ప్రజల వారసత్వం భూమిలో ఏ భాగాన్నీ అధిపతి ఆక్రమించకూడదు. వారి ఆస్తిమీదనుంచి వారిని వెళ్ళగొట్టకూడదు. నా ప్రజలలో ఎవరూ తమ భూములను విడిచి చెదరిపోకుండేలా అధిపతి తన భూమిలోనుంచే తన కొడుకులకు భాగాలివ్వాలి.”
19 అప్పుడాయన ఉత్తర దిశగా ఉన్న యాజుల పవిత్రమైన గదులలోకి, వాటి ద్వారం ప్రక్కన ఉన్న గుమ్మంగుండా నన్ను తీసుకుపోయాడు. అక్కడ వెనుకవైపు పడమటి దిక్కున ఒక స్థలం నాకు చూపి, 20 ఆయన నాతో ఇలా అన్నాడు: “యాజులు అపరాధబలి మాంసం, పాపాలకోసమైన బలిమాంసం, నైవేద్యాలు బయటికి ఆవరణంలోకి తెచ్చి ప్రజలను ప్రతిష్ఠించకుండా, ఈ స్థలంలోనే మాంసం వండాలి, నైవేద్యాలు కాల్చాలి.”
21 అప్పుడాయన బయటి ఆవరణలోకి నన్ను తీసుకుపోయి దాని నాలుగు మూలల్లో ప్రతిదాని దగ్గరికి నన్ను నడిపించాడు. ప్రతి మూలలో చిన్న ఆవరణమున్నట్టు చూశాను. 22 బయటి ఆవరణంలో ఉన్న నాలుగు మూలలలో ఏర్పరచబడ్డ ఆ చిన్న ఆవరణాల పొడవు నలభై మూరలు, వెడల్పు ముప్ఫయి మూరలు. నాలుగు మూలల ఆవరణాల కొలత ఒక్కటే. 23 నాలుగు ఆవరణాలలో చుట్టు వరుసగా ఉన్న అటకలున్నాయి. చుట్టు ఉన్న అటకలక్రింద పొయ్యిలు ఉన్నాయి. 24 ఆయన నాతో ఇలా అన్నాడు: “ఇది వంట స్థలం. ప్రజలు తెచ్చే బలి పశుమాంసం దేవాలయంలో పరిచర్య చేసేవారు ఇక్కడే వండుతారు.”