45
1 మీరు చీట్లు వేసి దేశాన్ని వారసత్వంగా విభాగించేటప్పుడు✽ దేశంలో ఒక భాగాన్ని పవిత్రప్రదేశంగా✽ “యెహోవాకు ప్రతిష్ఠించాలి. ఆ భాగానికి ఇరవై యైదు వేల మూరల పొడవు, ఇరవై వేల మూరల వెడల్పు✽ ఉండాలి. ఈ భాగమంతా పవిత్రంగా ఉంటుంది. 2 ✝దానిలో పవిత్రస్థానం కోసం అయిదు వందల మూరల చదరం ఉండాలి. చదరం చుట్టూ యాభై మూరల వెడల్పుగల మైదానం ఉండాలి. 3 ముందు కొలిచిన భాగంలో ఇరవై యైదు వేల మూరల పొడవూ పది వేల మూరల వెడల్పూ గల చోటు కొలత తీసుకోవాలి. అందులోనే అతి పవిత్ర స్థలంగా ఉన్న పవిత్రాలయం ఉంటుంది. 4 ✽యెహోవాకు సేవ చేయడానికి ఆలయంలో ఆయన సన్నిధానానికి వచ్చే యాజుల కోసం ఆ చోటు ఉంటుంది. దేశంలో అదే వారి కోసం పవిత్ర భాగంగా ఉంటుంది. ఆలయానికి అది పవిత్రస్థానంగా ఉండడం మాత్రమే కాకుండా, వారి ఇండ్ల స్థలంగా కూడా ఉంటుంది. 5 ఇరవై యైదు వేల మూరల పొడవూ పది వేల మూరల వెడల్పూ గల భాగం ఆలయంలో సేవ చేసే లేవీగోత్రికులదవుతుంది. అందులో నివాస స్థలాలు ఉంటాయి.6 ✽“పవిత్ర భాగం ప్రక్కనే నగరానికి ఇరవై వేల మూరల పొడవూ అయిదు వేల మూరల వెడల్పూ గల ప్రాంతం ఏర్పాటు చేయాలి. అది ఇస్రాయేల్ ప్రజలందరికీ చెందుతుంది.
7 ✽“పవిత్ర భాగం ప్రక్కన నగరానికి ఏర్పాటు చేసిన ప్రాంతం ప్రక్కన, తూర్పుగా, పడమటగా ఉన్న భూమి అధిపతికి చెందుతుంది. పడమటినుంచి తూర్పువరకు దాని పొడవు ఒక గోత్రానికి చెందిన ప్రదేశం కొలతప్రకారం ఉండాలి. 8 ✽ఇస్రాయేల్‌లో అది అతడికి ఆస్తిగా ఉంటుంది. అప్పటినుంచి అధిపతులు నా ప్రజలను బాధించక దేశమంతా ఇస్రాయేల్ ప్రజ గోత్రాల స్వాధీనం చేస్తారు.
9 “యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఇస్రాయేల్ ప్రజల అధిపతులారా! మీరు చేసిన బలాత్కారం, దౌర్జన్యం చాలు. అలా చేయడం మానండి, నీతిన్యాయాలను అనుసరించి నడుచుకోండి. నా ప్రజల సొమ్ము దోచుకోవడం మానండి. ఇది యెహోవాప్రభు వాక్కు. 10 మీరు సరైన త్రాసు, సరైన తూము, సరైన పడి వినియోగించాలి. 11 ఒక్కటే తూము, ఒక్కటే పడి వినియోగించాలి. తూము పందుంలో పదో భాగం పట్టేదిగా ఉండాలి. పందుం మీకు పరిమాణంగా ఉండాలి. 12 ఒక తులం ముప్ఫయి చిన్నములు. ఒక మీనా అరవై తులాలు – ఇరవై తులాల ఎత్తు, ఇరవై అయిదు తులాల ఎత్తు, పదిహేను తులాల ఎత్తు.
13 ✽“మీరు అర్పించవలసిన ప్రత్యేక నైవేద్యమిది – పందుం గోధుమలుంటే తూములో ఆరో భాగం, పందుం యవలుంటే తూములో ఆరో భాగం. 14 మీరు కోర్‌లో నూరో భాగం అర్పించాలి – అంటే బత్‌లో పదో భాగం. కోర్ పది బంతులు. హోమెర్ కూడా అంతే. 15 మంచి మేత తిన్న గొర్రెలలో, మందకు రెండు వందలలో ఒక గొర్రెను కూడా తేవాలి. ఇస్రాయేల్‌ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి నైవేద్యాలుగా హోమ బలులుగా శాంతి బలులుగా వీటిని అర్పించాలి. ఇది యెహోవాప్రభు వాక్కు. 16 దేశంలో ఉన్నవారంతా వీటిని ఇస్రాయేల్ అధిపతిదగ్గరికి తేవాలి. 17 పండుగలలో, అమావాస్య దినాలలో, విశ్రాంతి దినాలలో ఇస్రాయేల్ ప్రజలు సమకూడే నియామక కాలాలలో హోమబలులూ నైవేద్యాలూ పానార్పణలూ అమర్చే బాధ్యత అధిపతిది. ఇస్రాయేల్ ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపాలకోసమైన బలి పశువులనూ ధాన్య నైవేద్యాలనూ హోమబలి పశువులనూ శాంతిబలి పశువులనూ అతడే ఇవ్వాలి.
18 ✽“యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, మొదటి నెల మొదటి రోజున లోపం లేని కోడి దూడను తీసుకొని పవిత్రస్థానాన్ని శుద్ధి చేయడానికి దానిని వధించాలి. 19 యాజి పాపాలకోసమైన ఆ బలి పశురక్తం కొంత తీసి ఆలయ ద్వార బంధాలమీద, బలిపీఠం చూరు నాలుగు మూలలమీద, లోపలి ఆవరణ ద్వార బంధాలమీద పెట్టాలి. 20 తెలియక పొరపాటున అపరాధం చేసిన ప్రతి ఒక్కరికోసం కూడా మొదటి నెల ఏడో రోజున అలా చేయాలి. ఆ విధంగా ఆలయానికి ప్రాయశ్చిత్తం చేయాలి.
21 “మొదటి నెల పద్నాలుగో రోజున పస్కా✽పండుగ మీకు ఆరంభం అవుతుంది. ఆ పండుగ ఏడు రోజులు ఆచరించాలి. పొంగబెట్టే పదార్థమేమీ వేయకుండా చేసిన రొట్టెలు ఆ రోజుల్లో తినాలి. 22 ✽ఆ రోజున అధిపతి తనకూ దేశంలో ఉన్న వారందరికీ పాపాలకోసమైన బలిగా ఒక ఎద్దును ఇవ్వాలి. 23 ఏడు రోజులకోసం లోపం లేని ఏడు ఎద్దులనూ ఏడు పొట్టేళ్ళనూ హోమబలులుగా అతడు ఇవ్వాలి. రోజుకు ఒక ఎద్దూ ఒక పొట్టేలూ అర్పించడం జరగాలి. పాపాల కోసమైన బలిగా రోజుకు ఒక మేకపోతును అతడు ఇవ్వాలి. 24 ప్రతి ఎద్దుతోపాటు, ప్రతి పొట్టేలుతో పాటు నైవేద్యంగా ఒక తూమెడు పిండి, నాలుగు లీటర్ల నూనె కూడా అతడు ఇవ్వాలి. 25 ✽ఏడో నెల పదిహేనో రోజున ఆరంభమయ్యే పండుగకోసం కూడా ఏడు రోజులు పాపాలకోసమైన బలి జంతువులనూ హోమబలి జంతువులనూ నైవేద్యాలనూ నూనెనూ అతడు ఇవ్వాలి.