44
1 తూర్పు దిశగా ఉన్న పవిత్రాలయం బయటి ద్వారం దగ్గరికి ఆయన నన్ను తీసుకుపోయాడు. ఆ ద్వారం తలుపులు మూసి ఉన్నాయి. 2 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవా ఈ ద్వారంగుండా ప్రవేశించాడు గనుక ఏ మనిషీ దీనిద్వారా ప్రవేశించకూడదు. ఇది ఎప్పుడూ తీయబడకుండా మూసి ఉండాలి. 3 అధిపతి తానొక్కడే యెహోవా సన్నిధానంలో భోజనం చేయడానికి ఈ ద్వారం లోపల కూర్చుంటాడు. ఆయన ఈ ద్వారం వసారా గుండా ప్రవేశిస్తాడు, బయటికి వెళ్తాడు.”
4 అప్పుడాయన ఉత్తర ద్వారం గుండా దేవాలయం ముందుకు నన్ను తీసుకుపోయాడు. యెహోవా శోభా ప్రకాశంతో యెహోవా ఆలయం నిండి ఉండడం చూచి నేను సాగిలపడ్డాను.
5 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “మానవపుత్రా, యెహోవా ఆలయాన్ని గురించిన అన్ని చట్టాలూ శాసనాలూ నేను నీకు తెలియజేయబోతున్నాను. శ్రద్ధతో గమనించు. ఈ విషయాలన్నీ చూచి చెవిని బెట్టు. దేవాలయంలోకి ప్రవేశించే మార్గాన్ని, పవిత్రాలయంలోనుంచి బయటికి పోయే మార్గాలన్నిటినీ గమనించు. 6 తిరగబడే ఇస్రాయేల్ ప్రజలకు ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేది ఏమిటంటే ఇస్రాయేల్ ప్రజలారా, ఇంతవరకు మీరు చేసిన అసహ్య క్రియలు చాలు! 7 ఆహారాన్నీ క్రొవ్వునూ రక్తాన్నీ మీరు నాకు అర్పించినప్పుడు నా పవిత్రాలయాన్ని అపవిత్రం చేయడానికి హృదయంలో, శరీరంలో సున్నతి లేని విదేశీయులను దానిలోకి వెంటబెట్టుకు వచ్చారు. ఈ విధంగా అసహ్యక్రియలు చేస్తూ నా ఒడంబడిక భంగపరచారు. 8 నేను మీకు అప్పగించిన నా పవిత్ర వస్తువుల విషయం మీరు బాధ్యత వహించలేదు. దానికి బదులు ఆ బాధ్యత మీరు విదేశీయుల చేతికి అప్పగించారు. 9 యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, హృదయంలో శరీరంలో సున్నతి లేని విదేశీయుడెవ్వడూ నా పవిత్రాలయంలో ప్రవేశించకూడదు. ఇస్రాయేల్ ప్రజలలో నివాసం చేస్తున్న అలాంటివాడు కూడా దానిలో ప్రవేశించకూడదు.
10 “ఇస్రాయేల్ ప్రజ నన్ను విసర్జించి తాము పెట్టుకొన్న విగ్రహాలను అనుసరించినప్పుడు వారితోపాటు నానుంచి దూరమైపోయిన లేవీగోత్రికులు తమ అపరాధం భరించాలి. 11 వారు నా పవిత్ర స్థానంలో సేవ చేయవచ్చు. ఆలయ ద్వారాలకు కావలివారుగా ఉండవచ్చు, ఆలయ సేవ చేయవచ్చు. ప్రజలకోసం వారు హోమబలి పశువులనూ ఇతర బలి పశువులనూ వధించి ప్రజలకోసం సేవ చేయడానికి వారి సమక్షంలో నిలబడవచ్చు. 12 అయితే లేవీగోత్రికులు వారి విగ్రహాల ఎదుట ఇస్రాయేల్ ప్రజకు పరిచారకులయ్యారు, ప్రజల పతనానికి కారకులయ్యారు గనుక నేను వారికి వ్యతిరేకంగా నా చెయ్యి ఎత్తాను. తమ అపరాధం వారు భరించాలి. ఇది యెహోవాప్రభు వాక్కు. 13 యాజిగా సేవ చేయడానికి వారు నా సన్నిధానానికి రాకూడదు, పవిత్ర వస్తువులను గానీ అతి పవిత్ర వస్తువులను గానీ ముట్టకూడదు. తాము చేసిన అసహ్య క్రియలవల్ల కలిగిన అవమానం వారు అనుభవించాలి. 14 అయినా నా ఆలయాన్ని గురించిన బాధ్యత అంతా, దానిలో జరిగే పనులన్నీ వారి చేతికి అప్పగిస్తాను.
15 “ఇస్రాయేల్ ప్రజలు నన్ను విసర్జించినప్పుడు, నా పవిత్రాలయాన్ని గురించిన బాధ్యత లేవీగోత్రంవారిలో యాజులుగా ఉన్న సాదోకు వంశస్థులు నమ్మకంగా వహించారు. వారే సేవ చేయడానికి నా సన్నిధానానికి వస్తారు. క్రొవ్వు, రక్తం నాకు సమర్పించడానికి వారే నా ఎదుట నిలబడుతారు. ఇది యెహోవాప్రభు వాక్కు. 16 వారే నా పవిత్ర స్థలంలో ప్రవేశిస్తారు. నా సన్నిధానంలో సేవ చేయడానికి వారు మాత్రమే నా బల్లదగ్గరికి వస్తారు. నేను నియమించిన ఈ బాధ్యత వారే వహిస్తారు.
17 “లోపలి ఆవరణ ద్వారాల గుండా వారు వచ్చేటప్పుడెల్లా నారబట్ట వేసుకోవాలి. లోపలి ఆవరణ ద్వారాల దగ్గర గానీ ఆలయంలో గానీ వారు సేవ చేస్తూ ఉన్నప్పుడు ఉన్నిబట్టలు వారు వేసుకోకూడదు. 18 వారు నార పాగాలు ధరించుకొని నడుముకు నారబట్ట కట్టుకోవాలి. చెమట పుట్టించేదేదీ ధరించుకోకూడదు. 19 ప్రజలున్న బయటి ఆవరణంలోకి వారు వెళ్ళేటప్పుడు సేవ చేయడానికి తాము వేసుకొన్న వస్త్రాలు తీసి పవిత్రమైన గదులలో వాటిని ఉంచాలి. వారు బయటికి ఆవరణంలోకి వెళ్ళేటప్పుడు ఆ వస్త్రాల మూలంగా ప్రజలు ప్రతిష్ఠించబడకుండేలా వారు వేరు బట్టలు వేసుకోవాలి.
20 “వారు తమ తలలు క్షౌరం చేయించుకోకూడదు, తలవెంట్రుకలు పొడవుగా పెరగనియ్యకూడదు – వాటిని కత్తిరించి దిద్దాలి. 21 లోపలి ఆవరణంలో ప్రవేశించేటప్పుడు ఏ యాజీ మధ్యం త్రాగకూడదు. 22 యాజులు వితంతువులను గానీ విడవబడ్డ స్త్రీలను గానీ వివాహమాడకూడదు. వారు ఇస్రాయేల్ ప్రజలలో ఉన్న కన్యలను గానీ యాజులతో వివాహమాడి వితంతువులైన స్త్రీలను గానీ వివాహమాడవచ్చు. 23 దేవునికి అర్పించినదానికీ సామాన్యమైనదానికీ మధ్య భేదమేమిటో, శుద్ధమైనదానికీ అశుద్ధమైనదానికీ మధ్య భేదం ఏమిటో వారు ప్రజలకు నేర్పాలి.
24 “ప్రజలు వ్యాజ్యెమాడితే యాజులు తీర్పరులుగా ఉండి నా న్యాయ నిర్ణయాల ప్రకారం పరిష్కారం చేయాలి. నా నియామక కాలాల విషయం నా ఉపదేశాన్నీ చట్టాలనూ వారు అనుసరించాలి. నా విశ్రాంతి దినాలను పవిత్రంగా ఆచరించాలి.
25 “యాజి ఒక మృతదేహం దగ్గరికి రావడంచేత తనను అశుద్ధం చేసుకోకూడదు. చనిపోయింది తన తండ్రి అయితే, తన తల్లి, తన కొడుకు, తన కూతురు, తన సోదరుడు, పెండ్లి కాని తన సోదరి అయితే, ఆ మృత దేహాన్ని బట్టి అంటుపడవచ్చు. 26 అతడు శుద్ధుడైన తరువాత ఏడు రోజులు ఆగాలి. 27 పవిత్రస్థానంలో సేవ చేయడానికి తాను లోపలి ఆవరణంలో ప్రవేశించే రోజున అతడు తనకోసం పాపాలకోసమైన బలి అర్పించాలి. ఇది యెహోవాప్రభు వాక్కు.
28 “యాజుల వారసత్వం విషయమేమంటే, నేనే వారి వారసత్వాన్ని. ఇస్రాయేల్‌లో వారికి సొత్తు ఏమీ ఇవ్వకూడదు. నేనే వారి సొత్తును. 29 నైవేద్యాలనూ పాపాలకోసం, అపరాధంకోసం అర్పించబడ్డ బలుల మాంసాన్నీ వారు తింటారు. ఇస్రాయేల్ ప్రజలు యెహోవాకు ప్రతిష్ఠించినవన్నీ వారివవుతాయి. 30 మీ ప్రథమ ఫలాలలో, మీరు అర్పించేవాటన్నిటిలో శ్రేష్ఠమైనవి యాజులవవుతాయి. మీ కుటుంబాలకు దేవుని ఆశీస్సులు కలిగేలా మీరు మొట్టమొదట పిసికిన పిండి ముద్దను యాజులకివ్వాలి. 31 పక్షులలో పశువులలో దానికి అదే చస్తే అలాంటిదానిని గానీ మృగాలు చీల్చినదానిని గానీ యాజులు తినకూడదు.