43
1 అప్పుడాయన తూర్పు దిశగా ఉన్న ద్వారానికి నన్ను వెంటబెట్టుకుపోయాడు. 2 ఇస్రాయేల్ ప్రజల దేవుని శోభాప్రకాశం తూర్పు దిక్కునుంచి రావడం నాకు కనిపించింది. ఆయన స్వరం జలప్రవాహాల ధ్వనిలాంటిది. ఆయన శోభాప్రకాశం చేత భూమి ప్రకాశించింది. 3 నాకు కనిపించిన ఈ దర్శనం, ఆయన నగరాన్ని నాశనం చేయడానికి వచ్చిన సమయాన నాకు కనిపించిన దర్శనం వంటిది. నేను సాగిలపడ్డాను. 4 యెహోవా శోభాప్రకాశం తూర్పుదిశగా ఉన్న ద్వార మార్గాన వచ్చి దేవాలయంలో ప్రవేశించింది. 5 అప్పుడు దేవుని ఆత్మ నన్ను ఎత్తి లోపలి ఆవరణంలోకి తీసుకువచ్చాడు. దేవాలయం యెహోవా శోభాప్రకాశంతో నిండిపోయింది.
6 ఆ వ్యక్తి నాదగ్గర ఇంకా నిలబడి ఉన్నాడు. అప్పుడు దేవాలయంలోనుంచి నాతో మాట్లాడే ఒకరి స్వరం నేను విన్నాను. 7 ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవపుత్రా, ఇది నా సింహాసన స్థలం, నా పాదపీఠం. ఇక్కడే నేను ఇస్రాయేల్‌ప్రజల మధ్య చిరకాలం నివాసం చేస్తాను. ఇప్పటినుంచి వారు వేశ్యలాగా ప్రవర్తించరు, వారు రాజుల మృతదేహాలకు ఎత్తయిన పూజా స్థలాలను కట్టరు. ఆ విధంగా వారు గానీ వారి రాజులు గానీ మరెన్నడూ నా పవిత్రమైన పేరును దూషణకు గురి చేయరు. 8 ఇంతకుముందు వారు వారి స్థలాల గడపలను నా గడప దగ్గర కట్టి, వారి అసహ్య కార్యాలచేత నా పవిత్రమైన పేరును దూషణకు గురి చేశారు. అందుచేత నేను కోపగించి వారిని నాశనం చేశాను. 9 వారు వేశ్యలాగా ప్రవర్తించడం మాని నా సముఖంనుంచి వారి రాజుల శవాలను దూరంగా తీసుకుపోవాలి. అప్పుడు వారి మధ్య నేను చిరకాలం నివాసం చేస్తాను.
10 “మానవపుత్రా, ఇస్రాయేల్ ప్రజలు తమ అపరాధాల విషయం సిగ్గుపడేలా వారికి ఈ ఆలయాన్ని గురించి వివరంగా చెప్పు. వారు దాని ఏర్పాటు విషయం ఆలోచించాలి. 11 వారు చేసిన క్రియల కారణంగా వారికి సిగ్గు కలిగితే, ఆలయంయొక్క ఆకారం, ఏర్పాటు, ద్వారాలు, దాని తీరులన్నీ, నియమాలన్నీ, చట్టాలన్నీ వారికి తెలియజెయ్యి. వారి కళ్ళెదుటే వాటిని వ్రాయి. 12 ఇది ఆ ఆలయం విషయమైన శాసనం: పర్వతంమీద దాని చుట్టూ ఉన్న ప్రదేశమంతా అతి పవిత్రం. ఆలయం విషయమైన శాసనమిదే.
13  “పెద్ద మూరల కొలతప్రకారం (పెద్ద మూర అంటే మూరెడు, బెత్తెడు) బలిపీఠం కొలతలు ఇవి – దాని అడుగుభాగం ఎత్తు ఒక మూర, వెడల్పు ఒక మూర. దాని అంచుకు ఉన్న చూరు ఒక జేన. 14 నేలమీద ఉన్న అడుగుభాగంనుంచి క్రింది చూరువరకు బలిపీఠం ఎత్తు రెండు మూరలు, వెడల్పు ఒక మూర. ఆ చిన్న చూరునుంచి పెద్ద చూరువరకు దాని ఎత్తు నాలుగు మూరలు, వెడల్పు ఒక మూర. 15 బలిపీఠం పొయ్యి ఎత్తు నాలుగు మూరలు. దానిమీదనుంచి నాలుగు కొమ్ములు పైకి ఉన్నాయి. 16 ఆ పొయ్యి నలుచదరంగా ఉంది; పొడవు పన్నెండు మూరలు, వెడల్పు పన్నెండు మూరలు. 17 దాని చూరు కూడా నలుచదరంగా ఉంది; పొడవు పద్నాలుగు మూరలు, వెడల్పు పద్నాలుగు మూరలు. దాని అంచు వెడల్పు ఒక జేన. దాని అడుగుభాగం వెడల్పు ఒక మూర. దాని మెట్లు తూర్పువైపు ఉన్నాయి.”
18  అప్పుడాయన నాతో ఇలా అన్నాడు: “మానవపుత్రా, యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, వారు ఈ బలిపీఠం కట్టిన తరువాత దానిమీద రక్తం చిలకరించేటప్పుడు, హోమబలి అర్పించేటప్పుడు ఈ చట్టాలను అనుసరించాలి: 19 నాకు సేవ చేయడానికి నా సన్నిధానానికి వచ్చే యాజులు లేవీగోత్రంవారై, సాదోకు వంశీయులై ఉండాలి. ఇది యెహోవాప్రభు వాక్కు. నీవు వారికి పాపాలకోసమైన బలిగా కోడె దూడను ఇవ్వాలి. 20 బలిపీఠానికి ప్రాయశ్చితం చేసి దాన్ని శుద్ధీకరించడానికి నీవు ఆ కోడె రక్తంలో కొంత తీసుకొని బలిపీఠం మీద ఉన్న కొమ్ములమీద, చూరుయొక్క నాలుగు మూలలమీద, చుట్టు ఉన్న అంచుమీద పెట్టాలి. 21 తరువాత పాపాలకోసమైన బలి కోడెను తీసుకుపోయి దేవాలయం బయట నిర్ణీత స్థలంలో కాల్చివేయాలి.
22 “రెండో రోజున నీవు పాపాలకోసమైన బలిగా లోపం లేని మేకపోతును అర్పించాలి. కోడెదూడ రక్తంతో బలిపీఠాన్ని శుద్ధి చేసిన ప్రకారం మళ్ళీ శుద్ధి చేయాలి. 23 శుద్ధి చేసిన తరువాత, లోపం లేని కోడెదూడనూ పొట్టేలునూ అర్పించాలి. 24 నీవు వాటిని యెహోవా సన్నిధానానికి తేవాలి. యాజులు వాటిమీద ఉప్పు చల్లి హోమబలిగా యెహోవాకు అర్పించాలి.
25 “ఏడు రోజులు వరుసగా పాపాలకోసమైన బలిగా మేకపోతును సిద్ధం చేయాలి. లోపం లేని కోడెనూ పొట్టేలునూ కూడా సిద్ధం చేయాలి. 26 ఏడు రోజులు యాజులు బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేస్తూ దాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. ఈ విధంగా వారు దాన్ని ప్రతిష్ఠించాలి. 27 ఆ రోజుల తరువాత ఎనిమిదో రోజు మొదలుకొని యాజులు బలిపీఠంమీద మీ హోమబలులూ శాంతి బలులూ అర్పించాలి. అప్పుడు నేను మిమ్ములను స్వీకరిస్తాను. ఇది యెహోవా ప్రభు వాక్కు.”