42
1 అప్పుడాయన ఉత్తర దిక్కున ఉన్న బయటి ఆవరణంలోకి నన్ను నడిపించాడు. ఖాళీ స్థలానికి ఉత్తరంగా ఉన్న కట్టడానికి ఎదురుగా ఉన్న గదుల దగ్గరికి తీసుకువచ్చాడు. 2 ఆ కట్టడం వాకిలి ఉత్తర దిక్కున ఉంది. కట్టడం పొడవు నూరు మూరలు, వెడల్పు యాభై మూరలు. 3 ఇరవై మూరల వెడల్పున్న ఖాళీ స్థలానికి ఎదురుగా, బయటి ఆవరణంలో రాళ్ళు పరచిన స్థలానికి ఎదురుగా, మూడు అంతస్తుల వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. 4 ఆవరణంలోపలికి నడవడానికి గదులముందు త్రోవ ఉంది. దాని వెడల్పు పది మూరలు, పొడవు నూరు మూరలు. గదుల వాకిండ్లు ఉత్తర దిక్కున ఉన్నాయి. 5 పై అంతస్తు గదుల వెడల్పు నడిమి అంతస్తు క్రింద అంతస్తు గదుల వెడల్పుకంటే తక్కువగా ఉంది. ఎందుకంటే పై అంతస్తు వసారాలు ఎక్కువ వెడల్పు కలవి. 6 అంతేగాక, ఆవరణంలో ఉన్న స్తంభాలలాంటివి మూడో అంతస్తు గదులకు లేవు గనుక అవి క్రింది గదులకంటే, నడిమి గదులకంటే, చిన్నవిగా కట్టబడ్డాయి. 7 గదులదగ్గర, బయటి ఆవరణంవైపు, గదులకు ఎదురుగా గోడ ఉంది. దాని పొడవు యాభై మూరలు. 8 బయటి ఆవరణానికి ఎదురుగా ఉన్న గదుల వరుస పొడవు యాభై మూరలు. దేవాలయానికి ఎదురుగా ఉన్న గదుల వరుస నూరు మూరల పొడవు. 9 బయటి ఆవరణంలోనుంచి క్రింది గదులకు ప్రవేశించడానికి తూర్పు దిక్కున త్రోవ ఉంది.10 ఖాళీ స్థలానికి ఎదురుగా, కట్టడానికి ఎదురుగా తూర్పు దిక్కున ఆవరణం గోడ దగ్గరే కొన్ని గదులు ఉన్నాయి. 11 వాటిముందు దారి ఉంది. ఈ గదులు ఉత్తర దిక్కున ఉన్న గదులలాగే ఉన్నాయి. పొడవు ఒక్కటే, వెడల్పు ఒక్కటే. వాకిండ్లూ తలుపులూ కూడా ఒక్కటే. 12 ఈ తలుపులు దక్షిణ దిక్కున ఉన్న గదుల తలుపులలాంటివే. తూర్పు దిక్కుగా ఉన్న గోడ ఎదుట ఆవరణంలోకి పోయే త్రోవ మొదట్లో కూడా అలాంటి తలుపు ఉంది.
13 ✽అప్పుడాయన నాతో ఇలా అన్నాడు: “ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున ఖాళీ స్థలానికి ఎదురుగా ఉన్న గదులు పవిత్రమైన గదులు. యెహోవాదగ్గరికి సమీపించే యాజులు ఆ గదులలోనే అతి పవిత్ర అర్పణలను తింటారు. ఆ స్థలం పవిత్రం గనుక వారు అక్కడే అతి పవిత్ర అర్పణలను – నైవేద్యాలనూ పాపాలకోసమైన అర్పణలనూ అపరాధం కోసమైన అర్పణలనూ – ఉంచుతారు. 14 యాజులు పవిత్ర స్థలంలోకి వెళ్ళేటప్పుడు, అక్కడ సేవ చేయడానికి వారు ధరించుకొనే వస్త్రాలు పవిత్రమైనవి గనుక వారు బయటి ఆవరణంలోకి వెళ్ళేముందు ఆ వస్త్రాలు అక్కడే ఉంచాలి. ప్రజలు వచ్చే స్థలానికి యాజులు వెళ్ళేటప్పుడు వేరే బట్టలు వేసుకోవాలి.
15 గర్భాలయం కొలత తీసుకోవడం ముగించి ఆయన నన్ను వెంటబెట్టుకొని, తూర్పుగా ఉన్న ద్వారం గుండా బయటికి వెళ్ళాడు. బయటి గోడ నలుప్రక్కలా కొలత తీసుకొన్నాడు. 16 తూర్పు ప్రక్క కొలబద్దతో కొలిచాడు – అయిదు వందల కొలబద్దలు. 17 ఉత్తరప్రక్క కొలబద్దతో కొలత తీసుకొన్నాడు – అయిదు వందల కొలబద్దలు, 18 దక్షిణ ప్రక్క కొలబద్దతో కొలిచాడు – అయిదు వందల కొలబద్దలు, 19 పడమటి ప్రక్కదగ్గరగా వెళ్ళి కొలబద్దతో కొలత తీసుకొన్నాడు – అయిదు వందల కొలబద్దలు. 20 ఆయన నాలుగు ప్రక్కల కొలత తీసుకొన్నాడు. పవిత్రమైనదానిని పవిత్రం కానిదానినుంచి ప్రత్యేకించడానికి గోడ నలుప్రక్కల కట్టబడి ఉంది. అది నలుచదరంగా ఉంది. ప్రక్కలన్నిటిలో దాని కొలత అయిదు వందల కొలబద్దలు.