41
1 అప్పుడాయన ఆలయంలో ఉన్న మొదటి భాగంలోకి నన్ను వెంటబెట్టుకుపోయి దాని స్తంభాల కొలత తీసుకొన్నాడు. ఇరుప్రక్కల వాటి వెడల్పు ఆరు మూరలు. 2 వాకిలి వెడల్పు పది మూరలు. వాకిలికి ఇరుప్రక్కల ఉన్న గోడలు వెడల్పు అయిదేసి మూరలు. ఆలయం మొదటి భాగం కొలత తీసుకొన్నాడు. దాని పొడవు నలభై మూరలు, వెడల్పు ఇరవై మూరలు. 3 అప్పుడాయన రెండో భాగంలోకి వెళ్ళి వాకిలి స్తంభాల కొలత తీసుకొన్నాడు. వాటి వెడల్పు రెండు మూరలు. వాకిలి ఎత్తు ఆరు మూరలు, వెడల్పు ఏడు మూరలు. 4 ఆయన నాతో “ఇది అతిపవిత్ర స్థలం” అని చెప్పి కొలత తీసుకొన్నాడు. దాని పొడవు ఇరవై మూరలు. ఆలయం మొదటి భాగానికి వెనుకగా ఉండి ఇరవై మూరల వెడల్పు గలది.
5 అప్పుడాయన దేవాలయం గోడ కొలత తీసుకొన్నాడు. ఆ గోడ మందం ఆరు మూరలు. ఆలయం ప్రక్కల ఉన్న గదుల కొలత తీసుకొన్నాడు. ప్రతిదాని వెడల్పు నాలుగు మూరలు. 6 ప్రక్కల ఉన్న ఆ గదులు మూడు అంతస్తులుగా ఉన్నాయి. ప్రతి అంతస్తులో ముప్ఫయి గదులున్నాయి. ఈ గదులన్నీ ఆలయం గోడమీద అనుకోలేదు గాని ఆలయం గోడకు చుట్టు కట్టబడి గోడతో కలిసి ఉన్న ఆధారాల మీద ఆనుకొన్నాయి. 7 ఆలయానికి చుట్టూ ఉన్న ఆ గదుల అంతస్తులకు ఎక్కినకొద్దీ వాటి వెడల్పు ఎక్కువ అయింది. గనుక ఆలయం పై అంతస్తు క్రింద వాటికంటే వెడల్పుగా ఉంది. క్రింది అంతస్తునుంచి నడిమి అంతస్తుద్వారా పై అంతస్తువరకు మెట్లు ఉన్నాయి. 8 ఆలయం చుట్టు, ఆ ప్రక్కల గదులకు ఉన్న ఎత్తయిన పునాది నాకు కనిపించింది. దాని ఎత్తు ఆరు పెద్ద మూరలు. 9 ఆ ప్రక్కల గదుల బయటిగోడ వెడల్పు అయిదు మూరలు. 10 ఈ గదులకూ ఆ ఇతర గదులకూ మధ్య ఖాళీగా ఉన్న స్థలం ఇరవై మూరల వెడల్పు గలది. అది ఆలయం చుట్టు నలుదిక్కులా ఉంది. 11 ఆ ప్రక్కల గదుల గుమ్మాలు ఖాళీగా ఉన్న స్థలంవైపు ఉన్నాయి. ఒక గుమ్మం ఉత్తరదిక్కున, మరో గుమ్మం దక్షిణ దిక్కున ఉన్నాయి. ఖాళీ స్థలం వైపు అయిదు మూరల వెడల్పుగల ఆ గోడ చుట్టుగా ఉంది.
12 పడమటి దిక్కున ఆ ఖాళీ స్థలానికి ఎదురుగా కట్టడం ఒకటి ఉంది. దాని వెడల్పు డెబ్భై మూరలు, దాని గోడ వెడల్పు అయిదు మూరలు. దాని పొడవు తొంభై మూరలు.
13 అప్పుడాయన దేవాలయం కొలత తీసుకొన్నాడు. దాని పొడవు నూరు మూరలు. ఆ ఖాళీ స్థలం దానికి ఎదురుగా ఉన్న కట్టడం, దాని గోడలు కొలిచి చూస్తే ఆ కొలత నూరు మూరలు. 14 దేవాలయం ముందు భాగం, తూర్పు దిక్కున ఉన్న ఖాళీ స్థలం కొలిచి చూస్తే ఆ కొలత నూరు మూరలు.
15 ఆలయం వెనుక ఖాళీ స్థలానికి ఎదురుగా కట్టడం ఒకటి ఉంది. దానికి ఇరుప్రక్కల వసారాలున్నాయి. వసారాలతోకూడా దాని కొలత నూరు మూరలు.
16 ఆలయం ఆవరణానికి ఎదురుగా ఉన్న మంటపాలు, గడపలు, కమ్ములున్న కిటికీలు, మూడు అంతస్తుల చుట్టున్న వసారాలు, గడప వెనుక ఉన్నదంతా చెక్క పలకలతో కప్పబడి ఉన్నాయి. నేలనుంచి కిటికీలవరకు ఉన్న గోడలు, కిటికీలు కూడా కప్పబడి ఉన్నాయి. 17 గర్భాలయం వాకిలికి పైనున్న గోడమీద, వెలుపలి గోడలమీద, లోపలి గోడలమీద చుట్టు కెరూబులూ ఖర్జూరం చెట్లూ చెక్కబడి ఉన్నాయి. 18 రెండు కెరూబుల మధ్య ఒక ఖర్జూరం చెట్టు ఉంది. ప్రతి కెరూబుకు రెండు ముఖాలున్నాయి. 19 ఒక ప్రక్క ఖర్జూరం చెట్టువైపు మనిషి ముఖం, రెండో ప్రక్క ఖర్జూరం చెట్టువైపు సింహం ముఖం ఉన్నాయి. ఆలయం చుట్టు అంతటా అవి ఉన్నాయి. 20 ఆలయం మొదటి భాగం గోడలమీద, నేలనుంచి వాకిలిపైవరకు కెరూబులూ ఖర్జూరం చెట్లూ చెక్కబడి ఉన్నాయి.
21 ఆలయ ద్వారబంధం నలుచదరంగా ఉంది. అతి పవిత్రస్థలం. ద్వారబంధం కూడా అలాంటిదే. 22 అక్కడి వేదిక కర్రతో చేసినది. దాని ఎత్తు మూడు మూరలు, పొడవు రెండు మూరలు. దాని అడుగుభాగం, మూలలు, ప్రక్కలు కర్రతో చేయబడినవి. ఆ వ్యక్తి నాతో “ఇది యెహోవా ఎదుట ఉన్న బల్ల” అన్నాడు. 23 ఆలయంలో మొదటి భాగం వాకిలికీ అతి పవిత్ర స్థలం వాకిలికీ జంట తలుపులున్నాయి. 24 ప్రతి తలుపుకూ రెండు మడత రెక్కలున్నాయి. 25 గోడలమీద ఉన్నట్టుగా ఆలయం తలుపులమీద చెక్కిన కెరూబులూ ఖర్జూరం చెట్లూ ఉన్నాయి. వెలుపలి వసారాకు కర్రతో చేసిన చూరు ఉంది. 26 వసారాకు ఇరుప్రక్కల గోడలకు కమ్ములు వేసిన కిటికీలున్నాయి. కిటికీలకు ఇరుప్రక్కల చెక్కిన ఖర్జూరం చెట్లున్నాయి. ఆలయానికి ఇరుప్రక్కల ఉన్న గదులకు కూడా చూరులున్నాయి.