40
1 మేము బందీలుగా వచ్చిన ఇరవై అయిదో సంవత్సరం మొదటి నెల పదో రోజున యెహోవా చెయ్యి నామీద ఉంది. అది నగరం నాశనమైన పద్నాలుగో సంవత్సరం. ఆ రోజునే యెహోవా నన్ను అక్కడికి తీసుకుపోయాడు. 2 దేవుడు కలిగించిన దర్శనాలలో ఆయన నన్ను ఇస్రాయేల్‌దేశానికి తీసుకుపోయి చాలా ఎత్తయిన పర్వతం మీద ఉంచాడు. దానిమీద దక్షిణ దిక్కున నగరంలాంటిది ఒకటి నాకు కనిపించింది. 3 ఆయన నన్ను అక్కడికి తీసుకుపోగా ఒక మనిషి నాకు కనిపించాడు. అతడు చూపుకు కంచులాగా ఉన్నాడు. దారం, కొలబద్ద చేతపట్టుకొని నగర ద్వారంలో నిలబడి ఉన్నాడు. 4 ఆ వ్యక్తి నాతో ఇలా అన్నాడు: “మానవపుత్రా, నేను నీకు చూపించేవాటన్నిటినీ కండ్లారా చూచి చెవులారా విని మనసులో ఉంచుకో. ఈ కారణంచేతే నీవు ఇక్కడికి తేబడ్డావు. నీవు చూచినదంతా ఇస్రాయేల్ ప్రజలకు తెలియజెయ్యి.”
5 దేవాలయం చుట్టు గోడ నాకు కనిపించింది. ఆ వ్యక్తి చేతిలో ఉన్న కొలబద్ద పొడవు ఆరు పెద్ద మూరలు (ఒక మూర, ఒక బెత్తెడు). ఆయన గోడ కొలత తీసుకొన్నాడు. దాని వెడల్పూ దాని ఎత్తూ ఆరు పెద్ద మూరలు (ఒక కొలబద్ద).
6 అప్పుడాయన తూర్పు దిక్కున ఉన్న ద్వారం దగ్గరికి వెళ్ళి దాని మెట్లెక్కి, దాని గడప కొలత తీసుకొన్నాడు. ఆ మొదటి గడప వెడల్పు ఒక కొలబద్దంత ఉంది. 7 కావలివారి గదులు పొడవూ వెడల్పూ కొలబద్దంత ఉన్నాయి. ఆ గదులకు మధ్య ఉన్న గోడ వెడల్పు అయిదు మూరలు. 8 అప్పుడాయన ద్వారం వసారా కొలత తీసుకొన్నాడు. 9 అది ఎనిమిది మూరలు. దాని స్తంభాల మందం రెండు మూరలు. ద్వారం వసారా దేవాలయానికి ఎదురుగా ఉంది.
10 తూర్పు దిక్కున ఉన్న ద్వారానికి కావలి గదులున్నాయి. అటు మూడు, ఇటు మూడు ఉన్నాయి. ఆ గదులన్నిటికీ కొలత ఒకటే. రెండు ప్రక్కల ఉన్న స్తంభాలకు కూడా కొలత ఒక్కటే. 11 ద్వార ప్రవేశం కొలత తీసుకొన్నాడు. దాని వెడల్పు పది మూరలు, దాని పొడవు పదమూడు మూరలు. 12 కావలి గదుల ముందర గోడ ఇరుప్రక్కల ఉంది. దాని ఎత్తు ఒక మూర. గదులు నలుచదరంగా ఉన్నాయి. వాటి పొడవూ వెడల్పూ ఆరు మూరలు. 13 అప్పుడాయన ఒక గది కప్పు వెనుకభాగం నుంచి ఎదురుగా ఉన్న దాని కప్పు వెనుకభాగం వరకు ద్వారం కొలత తీసుకొన్నాడు. అక్కడి తలుపునుంచి ఇక్కడి తలుపు వరకు ఉన్న దూరం ఇరవై అయిదు మూరలు. 14 ద్వార స్తంభాలనుంచి ద్వారం చుట్టు ఆవరణ స్తంభం వరకు ఉన్న దూరం కొలత తీసుకొన్నాడు – ఆరవై మూరలు. 15 ద్వారం బయటిభాగం నుంచి లోపలి ద్వారం వసారావరకు యాభై మూరలు. 16 కావలి గదులకూ ద్వారంలోపలి గోడకూ చుట్టూ కిటికీలున్నాయి. కిటికీలకు కమ్ములు ఉన్నాయి. లోపలి వసారాకు కూడా అలాంటి కిటికీలున్నాయి. స్తంభాల పైభాగాలమీద చెక్కిన ఖర్జూరం చెట్ల చెక్కడాలు ఉన్నాయి.
17 అప్పుడాయన నన్ను బయటి ఆవరణంలోకి తీసుకుపోయాడు. అక్కడ గదులు కనిపించాయి. ఆవరణంలో అంతటా రాళ్ళు పరచి ఉన్నాయి. పరచినరాళ్ళమీద ముప్ఫయి గదులున్నాయి. 18 ఈ రాళ్ళు పరచిన స్థలం క్రిందిది. అది ద్వారాల వరకు ఉంది. ద్వారాల పొడవు ఎంతో ఈ స్థలం వెడల్పు అంతే. 19 అప్పుడాయన క్రింది ద్వారంనుంచి లోపలి ఆవరణంవరకు కొలత తీసుకొన్నాడు. అది తూర్పు దిక్కున నూరు మూరలు. ఉత్తర దిక్కున కూడా అంతే.
20 అప్పుడాయన ఉత్తర దిక్కున బయటి ఆవరణానికి ఎదురుగా ఉన్న ద్వారం పొడవూ వెడల్పూ కొలత తీసుకొన్నాడు. 21 దాని ఇరుప్రక్కల మూడేసి కావలి గదులున్నాయి. అవి వాటి స్తంభాలు, వసారా కూడా కొలత తీసుకొన్నాడు. వీటి కొలత ఆ మొదటి ద్వారం కొలత ఒక్కటే – పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరులు. 22 వాటి కిటికీలనూ వసారానూ, ఖర్జూరం చెట్ల చెక్కడాలు చూస్తే వాటి కొలత తూర్పు ద్వారానికి ఉన్న వాటి కొలత ఒక్కటే. ద్వారందగ్గరికి ఎక్కడానికి ఏడు మెట్లున్నాయి. వాటికి ఎదురుగా దాని వసారా ఉంది. 23 తూర్పు ద్వారంలాగే ఉత్తర ద్వారానికి ఎదురుగా ఒక గుమ్మం ఉంది. అది లోపలి ఆవరణానికి పోయేది. ద్వారంనుంచి గుమ్మంవరకు కొలత తీసుకొన్నాడు – నూరు మూరలు.
24 అప్పుడాయన నన్ను దక్షిణ దిక్కుకు తీసుకుపోయాడు. అక్కడ దక్షిణదిక్కుగా ద్వారమొకటి కనిపించింది. ఆయన దాని స్తంభాలూ వసారా కొలత తీసుకొన్నాడు. ఆ ద్వారాలకున్నవీ ఇవీ ఒకటే. 25 వాటికి ఉన్నట్టుగానే దీనికీ దీని వసారాకూ చుట్టూ కిటికీలున్నాయి. ద్వారం పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు. 26 దానిదగ్గరికి ఎక్కిపోవడానికి ఏడు మెట్లున్నాయి. మెట్లకు ఎదురుగా వసారా ఉంది. ఇరుప్రక్కల స్తంభాల పైభాగాలకు ఖర్జూరం చెట్ల చెక్కడాలున్నాయి. 27 లోపలి ఆవరణానికి కూడా దక్షిణ దిక్కున గుమ్మమొకటి ఉంది. ఈ గుమ్మంనుంచి దక్షిణ ద్వారంవరకు కొలత తీసుకొన్నాడు. అది నూరు మూరలు.
28 అప్పుడాయన దక్షిణ ద్వారంగుండా లోపలి ఆవరణంలోకి నన్ను తీసుకుపోయాడు. దక్షిణ ద్వారం కొలత తీసుకొన్నాడు. దాని కొలత, ఆ ఇతర ద్వారాల కొలత ఒక్కటే. 29 దాని కావలి గదులూ స్తంభాలూ వసారా ఆ ద్వారాల వాటి కొలతతో సమానం. దానికీ దాని వసారాకూ చుట్టూ కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరులు. 30 దాని వసారా బయటి ఆవరణంవైపు ఉంది. దాని స్తంభాల పై భాగాలకు ఖర్జూరం చెట్ల చెక్కడాలున్నాయి. దానిదగ్గరికి ఎక్కిపోవడానికి ఎనిమిది మెట్లు ఉన్నాయి. 31 (లోపలి ఆవరణం చుట్టూ ఉన్న వసారాల పొడవు ఇరవై అయిదు మూరలు, వెడల్పు అయిదు మూరలు.)
32 అప్పుడాయన తూర్పు దిక్కున ఉన్న లోపలి ఆవరణం దగ్గరికి నన్ను వెంటబెట్టుకుపోయి దాని ద్వారం కొలత తీసుకొన్నాడు. దాని కొలత ఇతర ద్వారాల కొలత ఒక్కటే. 33 దాని కావలి గదులూ స్తంభాలూ వసారా ఇతర ద్వారాల కొలతతో సమానం. దానికీ దాని వసారాకూ చుట్టూ కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు. 34 దాని వసారా బయట ఆవరణంవైపు ఉంది. ఇరుప్రక్కల దాని స్తంభాల పైభాగాలకు ఖర్జూరంచెట్ల చెక్కడాలున్నాయి. దానిదగ్గరికి ఎక్కిపోవడానికి ఎనిమిది మెట్లున్నాయి.
35 అప్పుడాయన ఉత్తర ద్వారం దగ్గరికి నన్ను వెంటబెట్టుకుపోయి దాని కొలత తీసుకొన్నాడు. దాని కొలత ఇతర ద్వారాల కొలత ఒక్కటే. 36 దాని గదులూ స్తంభాలూ వసారా ఇతర ద్వారాల వాటి కొలతతో సమానం. దానిచుట్టూ కిటికీలున్నాయి, దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవైయైదు మూరలు. 37 దాని వసారా బయటి ఆవరణం వైపు ఉంది. ఇరుప్రక్కల దాని స్తంభాల పైభాగాలకు ఖర్జూరం చెట్ల చెక్కడపు అలంకారం ఉంది. దానిదగ్గరికి ఎక్కిపోవడానికి ఎనిమిది మెట్లున్నాయి.
38 ప్రతి ద్వారం వసారా దగ్గర వాకిలి గల గది ఉంది. ఆ గదులలో హోమ బలి పశువుల మాంసం కడుగుతారు. 39 ప్రతి ద్వారంయొక్క వసారాలో ఇరుప్రక్కల రెండేసి బల్లలున్నాయి. వాటిమీద హోమబలి పశువులనూ పాపాలకోసమైన బలిపశువులనూ అపరాధ బలి పశువులనూ వధిస్తారు. 40 వసారా బయట ఉత్తరదిక్కున ఉన్న ద్వారం మెట్ల దగ్గర, ఇరుప్రక్కల రెండేసి బల్లలున్నాయి. 41 మొత్తం ఎనిమిది బల్లలున్నాయి – ద్వారం రెండు ప్రక్కల నాలుగేసి బల్లలు. ఆ ఎనిమిది బల్లలమీద బలి పశువులను వధిస్తారు. 42 అంతేగాక, హోమబలి పశువులనూ ఇతర బలి పశువులనూ వధించడానికి వినియోగించే సామాను పెట్టడానికి మలచిన రాతితో తయారు చేసిన నాలుగు బల్లలున్నాయి. వాటి పొడవు మూరెడున్నర, వెడల్పు మూరెడున్నర, ఎత్తు ఒక మూర. 43 చుట్టు గోడకు బెత్తెడు పొడవు మేకులు నాటి ఉన్నాయి. బల్లలమీద అర్పణల మాంసం ఉంచుతారు.
44  లోపలి ద్వారం బయట, లోపలి ఆవరణంలో రెండు గదులున్నాయి. ఒకటి ఉత్తర ద్వారం దగ్గర ఉండి దక్షిణ దిక్కుకు చూచేది. ఒకటి దక్షిణ ద్వారం దగ్గర ఉండి ఉత్తర దిక్కుకు చూచేది. 45 ఆయన నాతో ఇలా అన్నాడు: “దక్షిణ దిక్కుకు చూచే గది దేవాలయంపై విచారణ చేసే యాజులది. 46 ఉత్తర దిక్కుకు చూచే గది బలిపీఠం పైవిచారణ చేసే యాజులది. వారు సాదోకు వంశంవారు, లేవీగోత్రికులలో యెహోవా సముఖంలో సేవ చేయడానికి సమీపించగలవారు.”
47 అప్పుడాయన ఆవరణం కొలత తీసుకొన్నాడు. అది నలుచదరంగా ఉంది. దాని పొడవు నూరు మూరలు, వెడల్పు నూరు మూరలు. బలిపీఠం దేవాలయానికి ఎదురుగా ఉంది.
48 అప్పుడాయన దేవాలయం వసారాలోకి నన్ను వెంటబెట్టుకుపోయి, దాని స్తంభాల కొలత తీసుకొన్నాడు. ఇరుప్రక్కల వాటి వెడల్పు అయిదు మూరలు. ఇరుప్రక్కల దాని ద్వారం వెడల్పు మూడు మూరలు. 49 వసారా పొడవు ఇరవై మూరలు, వెడల్పు పదకొండు మూరలు. దానిదగ్గరికి ఎక్కిపోవడానికి మెట్లున్నాయి. దాని స్తంభాల దగ్గర ఇరుప్రక్కల కంబాలున్నాయి.