39
1 “మానవపుత్రా, గోగు గురించి దైవావేశపూర్వకంగా ఇలా పలుకు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, గోగూ! రోషుకూ మెషెకుకూ తుబాలుకూ అధిపతీ! నేను నీకు వ్యతిరేకిని. 2 నేను నిన్ను వెనక్కు త్రిప్పి తోలుకొంటూ ఉత్తరదిక్కున చాలా దూరంగా ఉన్న స్థలంనుంచి ఇస్రాయేల్ పర్వతాలమీదికి రప్పిస్తాను. 3 అప్పుడు నీ ఎడమచేతిలో ఉన్న నీ వింటిని క్రింద పడగొట్టివేస్తాను, నీ కుడిచేతిలో ఉన్న బాణాలు క్రింద పడవేస్తాను. 4 నీవు, నీ సైన్యాలన్నీ, నీతోకూడా ఉండే జనాలన్నీ ఇస్రాయేల్ పర్వతాలమీద కూలుతారు. కుళ్ళిన మాంసం తినే అన్ని రకాల పక్షులకూ అడవి మృగాలకూ నేను నిన్ను తిండిగా ఇస్తాను. 5 నీవు మైదాన భూమిలో కూలుతావు. నేనే ఈ మాట ఇచ్చాను. ఇది యెహోవాప్రభు వాక్కు. 6 నేను మాగోగుమీదికీ, సముద్ర తీరాల ప్రాంతాలలో అశ్రద్ధగా నివాసమున్నవాళ్ళ మీదికీ మంటలు పంపిస్తాను. నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.
7 “నేను నా పవిత్రమైన పేరును నా ఇస్రాయేల్ ప్రజలమధ్య వెల్లడిస్తాను. అప్పటినుంచి నా పవిత్రమైన పేరు దూషణకు గురి కాకుండా చేస్తాను. అప్పుడు నేనే యెహోవాననీ ఇస్రాయేల్‌లో పవిత్రుణ్ణనీ ఇతర జనాలకు తెలియవస్తుంది. 8 ఆ కాలం నేను మునుపు తెలియజెప్పిన కాలం. అది వస్తుంది. ఈ విధంగా జరగబోతుంది. ఇది యెహోవాప్రభు వాక్కు. 9 అప్పుడు ఇస్రాయేల్ పట్టణాలలో నివాసం చేసేవారు బయటికి వెళ్ళి, ఆ కవచాలనూ పెద్ద డాళ్ళనూ చిన్న డాళ్ళనూ విండ్లనూ గదలనూ ఈటెలనూ తీసుకొని పొయ్యిలో కాలుస్తారు. ఏడు సంవత్సరాలు వాటిని వంటచెరకుగా వినియోగిస్తారు. 10 వారికి పొలంలో కట్టెలు ఏరుకోవడం, అడవిలో చెట్లు నరకడం అవసరంగా ఉండదు. ఎందుకంటే వారు ఆ ఆయుధాలను పొయ్యిలో కాలుస్తారు. వారిని దోచుకొన్నవాళ్ళను వారే దోచుకొంటారు. వారి సొమ్ము కొల్ల పెట్టినవాళ్ళ సొమ్ము వారే కొల్లపెడతారు. ఇది యెహోవాప్రభు వాక్కు.
11 “ఆ కాలంలో నేను ఇస్రాయేల్‌లో గోగుకు స్మశాన భూమి ఇస్తాను. ఆ స్థలం తూర్పుగా సరస్సు దగ్గర ఉన్న ‘ప్రయాణికుల లోయ.’ అక్కడ గోగునూ వాడి సైన్యాలన్నిటినీ పాతిపెట్టడం జరుగుతుంది. ఆ లోయ ద్వారా వెళ్ళడానికి ప్రయాణికులకు వీలుండదు. అప్పటినుంచి ఆ లోయను ‘హమోను–గోగు’ అంటారు. 12 దేశాన్ని శుద్ధం చేయడానికి ఇస్రాయేల్ ప్రజలకు వాళ్ళను పాతిపెట్టడంలో ఏడు నెలలు పడుతుంది. 13 దేశంలో ఉన్న జనులంతా వాళ్ళను పాతిపెడతారు. నాకు ప్రఖ్యాతి కలిగిన ఆ రోజు వారు పేరు పొందుతారు. ఇది యెహోవాప్రభు వాక్కు. 14 దేశాన్ని శుద్ధం చేయడానికి మనుషులను నియమిస్తారు. వారిలో కొందరు దేశసంచారం చేస్తారు, కొందరు నేలమీద ఉన్న శవాలను పాతిపెడతారు. ఆ ఏడు నెలలైన తరువాత దేశంలో ఇలా తనిఖీ చేయడం ఆరంభిస్తారు. 15 దేశసంచారం చేసేవారికి ఎవరికైనా మనిషి ఎముక కనబడితే అతడు దానిదగ్గర ఏదైనా గుర్తు ఉంచుతాడు. పాతిపెట్టేవారు వచ్చి ఆ ఎముకను ‘హమోను–గోగు’లో పాతిపెట్టేవరకు ఆ గుర్తు దానిదగ్గర ఉంటుంది. 16 హమోనా అనే పేరు గల పట్టణం ఉంటుంది. ఈ విధంగా వారు దేశాన్ని శుద్ధం చేస్తారు.
17 “మానవపుత్రా, యెహోవాప్రభువు చెప్పేదేమంటే, అన్ని రకాల పక్షులకూ అడవి మృగాలకూ ఈ విధంగా చెప్పు: నేను ఇస్రాయేల్ కొండలమీద మీకోసం వధించే గొప్ప బలిదగ్గరికి నలుదిక్కులనుంచి సమకూడి రండి. అక్కడ మీరు మాంసం తింటారు, రక్తం త్రాగుతారు. 18 బలాఢ్యుల శరీరాలు తింటారు. భూనాయకుల రక్తం త్రాగుతారు. వాళ్ళు బాషానులో క్రొవ్విన పొట్టేళ్ళూ గొర్రెపిల్లలూ మేకలూ ఎద్దులూ అయినట్టు మీరు తిని త్రాగుతారు. 19 నేను మీకోసం వధించే ఆ బలిదగ్గర మీరు కడుపార క్రొవ్వు తింటారు, మీకు మత్తు కలిగేవరకు రక్తం త్రాగుతారు. 20 నేను ఏర్పరచిన పంక్తిని కూర్చుని గుర్రాలనూ రౌతులనూ బలాఢ్యులనూ సైనికులనూ కడుపార తింటారు. ఇది యెహోవాప్రభు వాక్కు.
21 “నేను నా మహిమ ఇతర ప్రజలమధ్య కనుపరచుకొంటాను. నేను వాళ్ళమీద పెట్టిన శిక్షనూ నేను తీర్చిన తీర్పుల నెరవేర్పునూ అన్ని దేశాలవాళ్ళు చూస్తారు. 22 ఆ రోజునుంచి నేనే యెహోవాననీ తమ దేవుణ్ణనీ ఇస్రాయేల్‌ప్రజలు తెలుసుకొంటారు. 23 నాపట్ల ద్రోహులై చేసిన అపరాధాల కారణంగా ఇస్రాయేల్‌ప్రజ బందీలుగా వెళ్ళారని ఇతర ప్రజలు తెలుసుకొంటారు. ఇస్రాయేల్‌వారికి నా ముఖం కనబడకుండా చేసి వారిని వారి శత్రువుల వశం చేశాను. వారంతా కత్తిపాలయ్యారు. 24 వారి అశుద్ధతకూ అక్రమకార్యాలకూ తగిన విధంగా వారిపట్ల వ్యవహరించి నా ముఖం వారికి కనబడకుండా చేశాను.
25 “అందుచేత యెహోవాప్రభువు చెప్పేదేమంటే, నా పవిత్రమైన పేరు విషయం అత్యాసక్తి కలిగి, యాకోబు సంతతివారిని చెరలోనుంచి రప్పిస్తాను, ఇస్రాయేల్ ప్రజలందరినీ కనికరిస్తాను. 26 వారు ఎవరి భయం లేకుండా సురక్షితంగా స్వదేశంలో నివాసం చేసినప్పుడు తాము నాపట్ల చూపిన ద్రోహాన్నీ తమ అవమానాన్నీ వారు మరచిపోతారు. 27  ఇతర జనాలలోనుంచి, వారి శత్రువుల దేశాలనుంచి నేను వారిని సమకూర్చి స్వదేశానికి రప్పించిన తరువాత, వారిద్వారా అనేక జనాల కళ్ళెదుట నన్ను నేను పవిత్రుణ్ణిగా కనుపరచు కొంటాను. 28 నేను ఇతర జనాలలోకి వారిని బందీలుగా పంపించినా, అక్కడ ఎవరినీ విడవక అందరినీ స్వదేశానికి సమకూరుస్తాను గనుక నేనే యెహోవాననీ తమ దేవుణ్ణనీ వారు తెలుసుకొంటారు. 29 అప్పటినుంచి నా ముఖం వారికి కనబడకుండా చేయను. ఇస్రాయేల్ ప్రజలమీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇది యెహోవాప్రభు వాక్కు.”