38
1 ✽మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 “మానవపుత్రా, మాగోగు✽ దేశం వైపు, రోషు✽కూ మెషెకుకూ తుబాలు✽కూ అధిపతి అయిన గోగు✽వైపు నీ ముఖం త్రిప్పు. గోగును గురించి దైవావేశపూర్వకంగా ఇలా పలుకు: 3 గోగూ! రోషుకూ మెషెకుకూ తుబాలుకూ అధిపతీ! యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: నేను నీకు వ్యతిరేకిని✽. 4 నేను నిన్ను వెనక్కు త్రిప్పి నీ దవడలకు గాలాలు✽ తగిలించి నిన్నూ నీ సైన్యమంతటినీ బయటికి రప్పిస్తాను. నీతోకూడా నీ గుర్రాలూ వేరువేరు రకాల ఆయుధాలు ధరించిన నీ రౌతులూ కవచం, డాలు ధరించి ఖడ్గం చేతపట్టుకొన్న వాళ్ళూ మహా గొప్ప సైన్యంగా వస్తారు. 5 ✽అనేక జనాలు నీతో కలిసి వస్తాయి. పారసీకులలో, కూషు, పూత్‌వాళ్ళలో డాలు, శిరస్త్రాణం ధరించిన వాళ్ళంతా వస్తారు. 6 గోమెరు✽ దేశం సైన్యాలన్నీ, ఉత్తర దిక్కున దూరంగా✽ ఉన్న తోగర్మా✽ జాతి సైన్యాలన్నీ నీతో వస్తాయి.7 ✽“సిద్ధంగా ఉండు. నీవూ నీదగ్గర గుంపులు గుంపులుగా పోగయిన వాళ్ళంతా సిద్ధపడి ఉండండి. నీవు వాళ్ళకు అధికారిగా ఉండు. 8 అనేక రోజుల తరువాత✽ నీవు పిలవబడుతావు. అంత్య సంవత్సరాలలో నీవు ఖడ్గంనుంచి తప్పించుకొన్న దేశంమీదికి వస్తావు. చాలా కాలం పాడుగా ఉన్న ఇస్రాయేల్ కొండలకు అనేక జనాలలో నుంచి సమకూర్చబడ్డ ప్రజలమీదికి వస్తావు. జనాలలో నుంచి తేబడి వారందరూ నిర్భయంగా నివాసం చేస్తూ ఉంటారు. 9 అయితే నీవు, నీ సైన్యం, నీతో కలిసిన అనేక దేశాలవాళ్ళు తుఫాను వచ్చేలాగా ఈ దేశంమీదికి వస్తారు, దేశాన్ని కమ్మిన మేఘంలాగా మీరు ఉంటారు.”
10 యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, “ఆ కాలంలో నీ మనసు✽లోకి ఒక తలంపు చొరపబడుతుంది. నీవు చెడ్డ పన్నాగం పన్నుతావు. 11 ✽నీవిలా అనుకొంటావు: ‘గోడలు లేని గ్రామాలున్న ఆ దేశంమీదికి నేను పోతాను. ప్రశాంతంగా, నిర్భయంగా కాపురమున్న ఆ దేశస్థులమీదికి పోతాను. వాళ్ళంతా గోడలూ ద్వారం తలుపులూ గడియలూ లేకుండా కాపురముంటున్నారు. 12 ✽ఇతర జనాలలోనుంచి వచ్చి, మునుపు పాడైన స్థలాలలో మళ్ళీ నివాసం చేస్తున్న వాళ్ళకు పశువులూ సరుకులూ కలిగాయి. భూమి నట్టనడుమ నివాసం చేస్తున్న ఆ జనంమీదికి వెళ్ళి వారిని దోచుకొంటాను, కొల్లసొమ్ము పట్టుకొంటాను.’
13 ✽“షేబా, దదానువాళ్ళూ తర్షీషు✽ వర్తకులూ దానికి చెందిన కొదమ సింహాలూ నిన్ను చూచి ‘సొమ్ము దోచుకోవడానికి వచ్చావా? వెండి బంగారాలు కొల్లగొట్టడానికీ పశువులూ సరుకులూ తీసుకుపోవడానికీ చాలా దోపిడీ పట్టుకోవడానికీ సైన్యాలను సమకూర్చి వచ్చావా?’ అని నిన్ను అడుగుతారు.
14 “అందుచేత, మానవపుత్రా, గోగుతో దైవావేశ పూర్వకంగా ఇలా పలుకు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఆ కాలంలో నా ఇస్రాయేల్‌ప్రజలు నిర్భయంగా నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ సంగతి నీవు గమనిస్తావు✽ గదా. 15 ఉత్తర దిక్కున చాలా దూరంగా ఉన్న నీ స్థలంనుంచి నీవు వస్తావు. నీతోకూడా అనేక జనాలు గుర్రాలెక్కి మహా గొప్ప సైన్యంగా సమకూడి వస్తారు. 16 ✽దేశాన్ని కమ్మే మేఘంలాగా మీరంతా నా ఇస్రాయేల్ ప్రజల మీదికి వస్తారు. గోగూ! చివరి రోజుల్లో నేను నా దేశంమీదికి నిన్ను రప్పిస్తాను. లోక జనాలు నన్ను తెలుసుకోవాలని నేను పవిత్రుణ్ణని వారి కళ్ళెదుట నీద్వారా వెల్లడి చేస్తాను.
17 ✽“యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, పూర్వకాలంలో నా సేవకులైన ఇస్రాయేల్ ప్రవక్తలచేత పలికించిన మాట నీ విషయమే గదా. నేను నిన్ను వారిమీదికి రప్పిస్తానని వారు అనేక సంవత్సరాలుగా దైవావేశపూర్వకంగా పలుకుతూ వచ్చారు. 18 ఆ రోజున గోగు ఇస్రాయేల్‌దేశం మీదికి దండెత్తి వచ్చేటప్పుడు నా కోపాగ్ని✽ తీవ్రంగా రగులుకొంటుంది. ఇది యెహోవాప్రభు వాక్కు. 19 ✽నా రోషం, కోపోద్రేకాలతో ఈ మాట ఇస్తున్నాను – ఆ కాలంలో ఇస్రాయేల్‌దేశంలో మహా భూకంపం జరుగుతుంది. 20 అప్పుడు సముద్రం చేపలూ గాలిలో ఎగిరే పక్షులూ భూజంతువులూ నేలమీద ప్రాకే ప్రాణులన్నీ భూతలంమీద ఉన్న మనుషులంతా నా ఎదుట వణకడం జరుగుతుంది. పర్వతాలు కూలుతాయి. నిటారుగా ఉన్న కొండలు పడుతాయి. గోడలన్నీ నేలమట్టమవుతాయి. 21 నా పర్వతాలన్నిటిమీదా గోగుమీదికి ఖడ్గం రప్పిస్తాను. ప్రతివాడి ఖడ్గం సాటివాడిమీద పడుతుంది. ఇది యెహోవాప్రభు వాక్కు. 22 గోగును ఘోర రోగానికీ రక్తపాతానికీ గురిచేసి నేను తీర్చిన తీర్పు నెరవేరుస్తాను. వాడిమీద, వాడి సైన్యాలమీద, వాడితోకూడా ఉన్న ఆ అనేక జనాలమీద ప్రళయంలాగా వాన కురిపిస్తాను, వడగండ్లూ అగ్నిగంధకాలూ పంపిస్తాను. 23 ✽నేను నా గొప్పతనాన్ని పవిత్రతనూ చూపిస్తాను. అనేక జనాల కళ్ళెదుట నన్ను తెలియపరచుకొంటాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు.