37
1  యెహోవా తన చెయ్యి నామీద ఉంచాడు. ఆయన యెహోవా ఆత్మచేత నన్ను తీసుకుపోయి ఒక లోయలో దించాడు. ఆ లోయ ఎముకలతో నిండి ఉంది. 2 ఆయన నన్ను వాటి మధ్య అటు ఇటు నడిపించాడు. లోయలో చాలా ఎముకలు కనిపించాయి. అవి బాగా ఎండిపోయినవి. 3 ఆయన నన్ను చూచి “మానవపుత్రా, ఈ ఎముకలు బ్రతకగలవా?” అని అడిగాడు.
అందుకు నేను “యెహోవాప్రభూ! అది నీకే తెలుసు” అన్నాను.
4 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు: “నీవు దైవావేశపూర్వకంగా ఈ ఎముకలతో ఈ విధంగా చెప్పాలి: ఎండిన ఎముకల్లారా! యెహోవా వాక్కు వినండి! 5 ఈ ఎముకలకు యెహోవాప్రభువు చెప్పేదేమంటే, మీలోకి ఊపిరి వచ్చేలా చేస్తాను. మీరు బ్రతుకుతారు. 6 నేను మీకు నరాలూ మాంసమూ ఇస్తాను. మీమీద చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పోస్తాను. మీరు బ్రతుకుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు.”
7 ఆ ఆజ్ఞప్రకారమే నేను దైవావేశపూర్వకంగా పలికాను. పలుకుతూ ఉండగానే గలగల ధ్వని పుట్టింది. ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొన్నాయి. 8 నేను ఇంకా చూస్తూ ఉంటే ఎముకల మీదికి నరాలు, మాంసం వచ్చాయి; వాటిమీద చర్మం కప్పుకొంది. అయితే వాటిలో ఊపిరి లేదు.
9 అప్పుడాయన నాతో “నీవు ఊపిరిని ఉద్దేశించి దైవావేశపూర్వకంగా పలుకు. మానవపుత్రా, దానితో ఇలా పలుకు: యెహోవాప్రభువు చెప్పేదేమంటే, ఊపిరీ! నలుదిక్కుల నుంచి వచ్చి హతమైన వీరు బ్రతికేలా వీరిమీదికి రా!” అన్నాడు.
10 ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారమే దైవావేశపూర్వకంగా పలికాను. వెంటనే ఊపిరి వారిలోకి వచ్చింది. వారు సజీవులై గొప్ప సైన్యంగా నిలబడ్డారు.
11 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు: “మానవపుత్రా, ఈ ఎముకలు ఇశ్రాయేల్ ప్రజలంతటినీ సూచిస్తున్నాయి. మన ఎముకలు ఎండిపొయ్యాయి. ఆశాభావం అంటూ మనకు లేదు. మనం నాశనమయ్యాం” అని వారు చెప్పుకొంటున్నారు. 12 అందుచేత దైవావేశ పూర్వకంగా వారితో ఇలా పలుకు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, నా ప్రజలారా! మీ సమాధులను నేను తెరుస్తాను, వాటిలోనుంచి మిమ్ములను బయటికి రప్పిస్తాను, ఇస్రాయేల్‌దేశానికి మళ్ళీ తీసుకువస్తాను. 13 నా ప్రజలారా! నేను మీ సమాధులను తెరచి వాటిలోనుంచి మిమ్ములను బయటికి రప్పించేటప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. 14  నా ఆత్మను మీలో ఉంచుతాను. మీరు సజీవులవుతారు. మీరు మీ స్వదేశంలో నివసించేలా చేస్తాను. అప్పుడు నేనే యెహోవాననీ నేనే మాట ఇచ్చి దాన్ని నెరవేర్చాననీ మీరు తెలుసుకొంటారు. ఇది యెహోవా వాక్కు.”
15 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 16 “మానవపుత్రా, నీవు ఒక కర్ర తీసుకొని దానిమీద ఈ మాటలు వ్రాయి – ‘యూదావారిదీ ఇస్రాయేల్‌వారిలో యూదాకు చెందినవారిదీ. మరో కర్ర తీసుకొని దానిమీద ఈ మాటలు వ్రాయి – ‘ఎఫ్రాయిం కర్ర; యోసేపుదీ, ఇస్రాయేల్ వారిలో యోసేపుకు చెందినవారిదీ’. 17 అప్పుడు ఆ రెండు కర్రలు నీ చేతిలో ఒకటి అయ్యేలా ఒకదానితో ఒకటి జోడించు. 18 ‘దీని భావమేమిటి? మాకు చెప్పవా?’ అంటూ నీ దేశస్థులు నిన్ను అడిగితే వారికిలా చెప్పు: 19 యెహోవాప్రభువు చెప్పేదేమంటే, ఎఫ్రాయిం చేతిలో ఉన్న యోసేపుదీ యోసేపుకు చెందిన ఇస్రాయేల్ గోత్రాలదీ అయిన కర్రను నేను తీసుకొని యూదావారి కర్రతో జోడిస్తాను. రెండు కర్రలు నా చేతిలో ఒకటిగా చేస్తాను. 20 గనుక నీవు వ్రాసిన కర్రలు వాళ్ళ కళ్ళెదుట చేతపట్టుకొని వారితో ఇలా చెప్పు: 21 యెహోవాప్రభువు చెప్పేదేమంటే, వారు వెళ్ళిన జనాలలోనుంచి నేను ఇస్రాయేల్ ప్రజలను విడిపిస్తాను. నలుదిక్కులనుంచి వారిని సమకూర్చి వారి స్వదేశానికి తీసుకువస్తాను. 22 వారి దేశంలో, ఇస్రాయేల్ కొండలమీద, వారిని ఒకే జనంగా చేస్తాను. వారందరినీ ఒకే రాజు పరిపాలిస్తాడు. అప్పటినుంచి వారు మరెన్నటికీ రెండు జనాలుగా, రెండు రాజ్యాలుగా ఉండరు, 23 విగ్రహాల మూలంగా, అసహ్యమైన ప్రతిమల మూలంగా, అక్రమ కార్యాల మూలంగా తమను అశుద్ధం చేసుకోరు. వారు పాపాలు చేస్తూ వచ్చిన ప్రతి స్థలంనుంచీ నేను వారిని విడిపించి శుద్ధి చేస్తాను. అప్పుడు వారు నాకు ప్రజగా ఉంటారు, నేను వారికి దేవుడుగా ఉంటాను.
24 “నా సేవకుడు దావీదు వారికి రాజుగా ఉంటాడు. వారందరికీ ఒకే ఒక కాపరి ఉంటాడు. వారు నా న్యాయనిర్ణయాల ప్రకారం ప్రవర్తిస్తారు, నా చట్టాలు పాటిస్తారు. 25 నేను నా సేవకుడైన యాకోబుకు ఇచ్చిన దేశంలో, మీ పూర్వీకులు నివాసం చేసిన ఆ దేశంలో, వారు నివాసం ఉంటారు, వారూ వారి పిల్లలూ వారి పిల్లల పిల్లలూ అక్కడ సదాకాలం నివాసం చేస్తారు. నా సేవకుడైన దావీదు సదాకాలం వారికి నాయకుడుగా ఉంటాడు. 26 నేను వారితో శాంతి ఒడంబడిక చేస్తాను. వారి సంఖ్య పెరిగేలా చేస్తాను, వారి మధ్య నా పవిత్రస్థానం సదాకాలం ఉంచుతాను. 27 నా నివాసం వారిదగ్గర ఉంటుంది. నేను వారికి దేవుడుగా ఉంటాను, వారు నాకు ప్రజగా ఉంటారు. 28 వారి మధ్య నా పవిత్రస్థానం సదాకాలం ఉండేటప్పుడు ఇస్రాయేల్ ప్రజను పవిత్రంగా చేసేవాణ్ణి నేనే – యెహోవాను – అని ఇతర జనాలు తెలుసుకొంటాయి.”