36
1 “మానవపుత్రా, ఇస్రాయేల్ పర్వతాలకు దైవావేశ పూర్వకంగా ఇలా పలుకు: ఇస్రాయేల్ పర్వతాల్లారా! యెహోవా వాక్కు వినండి. 2 యెహోవాప్రభువు చెప్పేదేమంటే, మిమ్ములను ఉద్దేశించి మీ శత్రువులు ‘ఆహాహా! అనాది కాలంనుంచి ఉన్న ఆ ఎత్తయిన స్థలాలు మా సొంతం అయ్యాయి’ అని చెప్పుకొన్నారు. 3 అందుచేత దైవావేశ పూర్వకంగా ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, నలుదిక్కులా మీ శత్రువులు మిమ్ములను పట్టుకోవాలని తహతహలాడుతూ మిమ్ములను పాడు చేశారు. మీరు ఇతర జనాల వశం అయ్యారు, ప్రజల పనిలేని మాటలకూ నిందలకూ గురి అయ్యారు.
4 “గనుక ఇస్రాయేల్ పర్వతాల్లారా, యెహోవాప్రభు వాక్కు వినండి. పర్వతాలతో, కొండలతో, వాగులతో, లోయలతో, పాడైపోయి నిర్జనమైన స్థలాలతో, విడవబడ్డ పట్టణాలతో యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: చుట్టూరా ఉన్న జనాలు మీ సొమ్ము దోచుకొన్నారు, మిమ్ములను ఎగతాళి చేశారు. 5 గనుక యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఎదోం దేశస్థులంతా, ఇతర జనాలూ ద్వేషభావం కలిగి, ఆనందంతో ఉప్పొంగిపోతూ, నా దేశాన్ని స్వాధీనం చేసుకొని దోచుకొన్నందుచేత నేను నా తీవ్ర రోషంతో వాళ్లకు ప్రతికూలమైన మాటలు పలికాను. 6 అందుచేత నీవు ఇస్రాయేల్‌దేశాన్ని ఉద్దేశించి దైవావేశపూర్వకంగా పలుకుతూ పర్వతాలతో, కొండలతో, వాగులతో, లోయలతో ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, మీరు ఇతర జనాల తిరస్కారానికి గురి అయ్యారు గనుక రోషంతో కోపంతో నేను చెపుతున్నాను – 7 యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, మీ చుట్టూరా ఉన్న జనాలు కూడా తిరస్కారానికి గురి అవుతారు. నేను చెయ్యి ఎత్తి ఈ మాట ఇస్తున్నాను.
8 “ఇస్రాయేల్ పర్వతాల్లారా! ఇంకా కొంత కాలానికి నా ఇస్రాయేల్‌ప్రజలు తిరిగి వస్తారు. మీరు వారికోసం చెట్లలాంటివారై పండ్లు ఇస్తారు. 9 నేను మీ కోసం ఉన్నాను, మీ వైపు దయతో తిరుగుతాను. మీమీద దున్నడం, విత్తనాలు వేయడం మళ్ళీ జరగబోతుంది. 10 మీమీద ఎంతోమంది – ఇస్రాయేల్ ప్రజలంతా – ఉండేలా చేస్తాను. అక్కడి పట్టణాలు నివాస స్థలాలవుతాయి. శిథిలాలను మళ్ళీ కట్టడం జరుగుతుంది. 11 మీమీద మనుషులూ పశువులూ విస్తారంగా ఉండేలా చేస్తాను. అవీ వారూ వర్ధిల్లుతూ సంఖ్యలో పెరుగుతారు. పూర్వమున్నట్టు మిమ్ములను నివాసస్థలంగా చేసి మునుపటికంటే మీకు ఎక్కువ అభివృద్ధి కలిగిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. 12 మీమీద మనుషులు, అంటే నా ఇస్రాయేల్‌ప్రజలు, అడుగు పెట్టేలా చేస్తాను. వారు మిమ్ములను స్వాధీనం చేసుకొంటారు. మీరు వారికి వారసత్వంగా ఉంటారు. అప్పటినుంచి మరెన్నడూ మీవల్ల వారు పుత్రహీనులు కాబోరు.
13 “యెహోవాప్రభువు చెప్పేదేమంటే, మిమ్ములను గురించి మనుషులు ఇలా అంటున్నారు గదా, ‘మీరు మనుషులను దిగమ్రింగివేస్తారు. మీ ప్రజలను పుత్రహీనులుగా చేస్తారు.’ 14 అయితే మీరు మరెన్నడూ మనుషులను దిగమ్రింగరు, మీ ప్రజలను పుత్రహీనులుగా చేయరు. ఇది యెహోవాప్రభు వాక్కు. 15 ఇతర జనాల తిట్లు మీకు మరెన్నడూ వినబడకుండా చేస్తాను. మీరు మరెన్నడూ వాళ్ళ తిరస్కారం సహించనవసరం ఉండదు. మీవల్ల మీ ప్రజలు మరెన్నడూ పతనం కాబోరు. ఇది యెహోవాప్రభు వాక్కు.”
16 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 17 “మానవపుత్రా, ఇస్రాయేల్‌ప్రజలు స్వదేశంలో కాపురమున్నప్పుడు వారి ప్రవర్తనచేతా క్రియలచేతా దానిని అశుద్ధం చేశారు. నా దృష్టిలో వారి ప్రవర్తన కడగా ఉన్న స్త్రీయొక్క అశుద్ధత లాంటిది. 18 వారు దేశంలో రక్తపాతం చేశారు. విగ్రహాలు పెట్టుకోవడంచేత దేశాన్ని అశుద్ధం చేశారు గనుక నేను వారిమీద నా కోపాగ్ని కుమ్మరించాను. 19 వారి ప్రవర్తనకూ క్రియలకూ తగినట్టు నేను వారిపట్ల వ్యవహరించి వారిని ఇతర జనాలలోకి వెళ్ళగొట్టాను. వారు దేశాలకు చెదరిపోయారు. 20 జనాలలో వెళ్ళిన ప్రతి స్థలంలో వారిమూలంగా నా పవిత్రమైన పేరు దూషణకు గురి అయింది. ఎలాగంటే అక్కడి జనులు ‘వీళ్ళు యెహోవా ప్రజలు గదా. అయినా వాళ్ళు ఆయన దేశాన్ని విడిచివచ్చారు’ అన్నారు. 21 జనాలలో ఇస్రాయేల్ ప్రజలు వెళ్ళిన స్థలాలలో నా పవిత్రమైన పేరు దూషణకు గురి అవుతూ ఉంటే నా పేరు విషయం నేను విచారపడ్డాను.
22 “అందుచేత ఇస్రాయేల్‌ప్రజలకు ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఇస్రాయేల్ ప్రజలారా, నేను చేయబోయేవి మీకోసం కాదు గాని మీరు వెళ్ళిన జనాల మధ్య మీమూలంగా దూషణకు గురి అయిన నా పవిత్రమైన పేరు కోసమే చేస్తాను. 23 మీ మూలంగా ఇతర జనాలలో దూషణకు గురి అయిన నా ఘనమైన పేరు ఎంత పవిత్రమో కనుపరుస్తాను. మీ మధ్య నన్ను నేను పవిత్రునిగా వెల్లడి చేసేటప్పుడు వాళ్ళు చూచి నేనే యెహోవానని తెలుసుకొంటారు. ఇది యెహోవాప్రభు వాక్కు.
24 “మిమ్ములను ఇతర జనాలలోనుంచి తెప్పిస్తాను, దేశాలన్నిటినుంచీ మిమ్ములను సమకూర్చి మీ స్వదేశానికి చేరుస్తాను. 25  మీమీద శుద్ధమైన నీళ్ళు చిలకరిస్తాను. మీరు శుద్ధులవుతారు. మీ కల్మషమంతటినుంచీ, మీ విగ్రహాలచేత మీకు కలిగిన అశుద్ధత అంతటినుంచీ శుద్ధి చేస్తాను. 26  క్రొత్త హృదయం మీకిస్తాను, క్రొత్త మనసు మీకు కలిగిస్తాను. మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసం గుండెను మీకిస్తాను. 27 నా ఆత్మను మీలో ఉంచి, మీరు నా చట్టాలను అనుసరించేలా, నా న్యాయనిర్ణయాలను పాటించేలా చేస్తాను. 28 నేను మీ పూర్వీకులకు ఇచ్చిన దేశంలో మీరు నివాసం చేస్తారు. మీరు నా ప్రజగా ఉంటారు. నేను మీకు దేవుడుగా ఉంటాను. 29 నేను మీ అశుద్ధతంతటినుంచీ మిమ్ములను విడిపిస్తాను. మీకు కరవు రానివ్వకుండా ధాన్యం సమృద్ధిగా ప్రసాదిస్తాను. 30 చెట్లు అధికంగా ఫలించేలా, భూమి ఎక్కువగా పంట ఇచ్చేలా చేస్తాను. అప్పటినుంచి కరవు విషయమైన నింద ఇతర జనాలలో మీకు కలగదు. 31 అప్పుడు మీరు మీ చెడ్డ ప్రవర్తననూ దుష్‌క్రియలనూ జ్ఞాపకం చేసుకొని మీ అపరాధాలను బట్టి, మీ అసహ్య కార్యాల కారణంగా మిమ్ములను మీరే అసహ్యించుకొంటారు. 32 నేను చేయబోయేది మీకోసం కాదని మీరు తెలుసుకోండి. ఇది యెహోవాప్రభు వాక్కు. ఇస్రాయేల్ ప్రజలారా, మీ ప్రవర్తన విషయం నొచ్చుకోండి, సిగ్గుపడండి.”
33 యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, “నేను మిమ్ములను ప్రతి పాపంనుంచీ శుద్ధి చేసేకాలంలో మీరు మీ పట్టణాలలో నివసించేలా చేస్తాను. పాడైపోయిన స్థలాలను మళ్ళీ కట్టడం జరుగుతుంది. 34 ఆ ప్రక్కగా పోయేవారి దృష్టిలో పాడుగా నిర్జనంగా కనిపించే భూమిని సేద్యం చేయడం మళ్ళీ జరుగుతుంది. 35 వాళ్ళు ఇలా అంటారు: ‘పాడైపోయిన ఈ దేశం ఏదెను తోటలాంటిదయింది. శిథిలంగా పాడుగా నిర్జీవంగా ఉన్న పట్టణాలకు గోడలు ఉన్నాయి. అవి ప్రజలతో నిండి ఉన్నాయి.” 36 అప్పుడు నేను – యెహోవాను – పాడైపోయిన స్థలాలను మళ్ళీ కట్టించి నాశనమైన స్థలాలలో చెట్లను నాటించానని మీ చుట్టు ఉన్న మిగతా జనాలు తెలుసుకొంటారు. నేను – యెహోవాను – ఈ మాట ఇచ్చాను. దీని ప్రకారం జరిగిస్తాను. 37 యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, తమకోసం ఇలా చేయమని ఇస్రాయేల్ ప్రజలు నన్ను అడిగేలా చేస్తాను. నేను వారిని సంఖ్యలో గొర్రె మందల్లాగా చేస్తాను. 38 నియామక కాలాలలో జెరుసలంలో అర్పణగా ఉన్న గొర్రెలంత విస్తారంగా వారిని చేస్తాను. మునుపు పాడైపోయిన వారి పట్టణాలు జనసమూహాలతో నిండి ఉంటాయి. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు.”