35
1 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 “మానవపుత్రా, శేయీరు పర్వతం వైపు నీ ముఖం త్రిప్పుకొని దైవావేశపూర్వకంగా దానిగురించి ఇలా చెప్పు: 3 యెహోవాప్రభువు చెప్పేదేమంటే, శేయీరుపర్వతమా! నేను నీకు వ్యతిరేకిని. నా చెయ్యి నీ మీద చాపి నిన్ను పాడుగా నిర్జనంగా చేస్తాను. 4 నీ పట్టణాలను నాశనం చేస్తాను. నీవు నిర్జనంగా ఉంటావు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకొంటావు.
5 “ఇస్రాయేల్ ప్రజలపట్ల నీ పగ చాలా కాలంగా ఉంది. వారి విపత్తు కాలంలో – వారి దోష శిక్ష ముగింపు కాలంలో – వారు కత్తిపాలయ్యేలా నీవు చేశావు. 6  అందుచేత, నా జీవం తోడని శపథం చేసి చెపుతున్నాను, నేను నిన్ను రక్తపాతానికి గురి చేస్తాను. రక్తపాతం నిన్ను వెంటాడుతుంది. రక్తపాతాన్ని నీవు ఏవగించుకోలేదు గనుక రక్తపాతమే నిన్ను వెంటాడుతుంది. ఇది యెహోవాప్రభు వాక్కు. 7 నేను శేయీరుపర్వతం పాడుగా నిర్జనంగా చేస్తాను. వెళ్ళేవాళ్లూ వచ్చేవాళ్ళూ అక్కడ లేకుండా చేస్తాను. 8 నీ కొండలను హతమైనవాళ్ళతో నింపివేస్తాను. కత్తిపాలయినవారు నీ కొండలలో, లోయలలో, వాగులలో కూలుతారు. 9 నీవు ఎప్పటికీ పాడుగా ఉంటావు. నీ పట్టణాలను మళ్ళీ కట్టడం జరగదు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకొంటావు.
10 “నీవు అన్నావు గదా, ‘యెహోవా అక్కడ ఉన్నా, ఆ రెండు జనాలూ ఆ రెండు దేశాలూ మనవే. మనం వాటిని స్వాధీనం చేసుకొందాం రండి.’ 11 అందుచేత నీవు పగపట్టి వారిపట్ల చూపిన అసూయకూ కోపానికీ తగిన విధంగా నేను నీపట్ల వ్యవహరిస్తానని నా జీవం తోడని శపథం చేసి చెపుతున్నాను. ఇది యెహోవాప్రభు వాక్కు. నేను నిన్ను దండించేటప్పుడు వారు నన్ను తెలుసుకొనేలా చేస్తాను.
12 “నీవు ఇస్రాయేల్ కొండల విషయం చెప్పిన దూషణ మాటలన్నీ నేను – యెహోవాను – విన్నానని మీరు తెలుసుకొంటారు. నీవు అన్నావు గదా – ‘అవి పాడైపొయ్యాయి. మనం వాటిని దిగమింగేలా మన వశం అయ్యాయి’. 13 నోరు పెద్దగా చేసి నీవు నాకు విరోధంగా ఎన్నో సంగతులు చెప్పావు. ఆ మాటలు నేను విన్నాను. 14 యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: లోకమంతా సంతోషిస్తూ ఉన్నప్పుడు నేను నిన్ను నాశనం చేస్తాను. 15 ఇస్రాయేల్‌ప్రజ వారసత్వం పాడైపోయినప్పుడు అది చూచి నీవు సంతోషించావు, గదా. నీకూ అలాగే జరిగిస్తాను. శేయీరు పర్వతమా! నీవు పాడైపోతావు. ఎదోం దేశమంతా పాడైపోతుంది. అప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.