34
1 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 “మానవపుత్రా, ఇస్రాయేల్‌ప్రజల కాపరులకు ప్రతికూలంగా దైవావేశపూర్వకంగా పలుకుతూ వాళ్ళతో ఇలా అను: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, కాపరులు మందను మేపాలి గదా. ఇస్రాయేల్ ప్రజల కాపరులు కడుపు నింపుకుంటున్నారు. వారికి శిక్ష తప్పదు. 3 మీరు వాటి మీగడ తింటారు, వాటి బొచ్చు తొడుక్కొంటారు. గొర్రెలలో క్రొవ్వినవాటిని వధించి తింటారు, గాని మందను మాత్రం మేపరు. 4 మీరు బలం లేనివాటికి బలం వచ్చేలా చేయలేదు, రోగంతో ఉన్నవాటిని బాగు చేయలేదు, గాయపడ్డ వాటికి కట్టు కట్టలేదు, తోలివేసినవాటిని తిరిగి తోలుకురాలేదు, తప్పిపోయిన వాటిని వెదకలేదు. అంతేగాక కఠినంగా క్రూరంగా వాటిమీద పెత్తనం చేశారు. 5 అందుచేత కాపరి లేక అవి చెదరిపోయాయి. చెదరిపోయి అన్ని రకాల అడవి మృగాలకు ఆహారమయ్యాయి. 6 నా గొర్రెలు తప్పిపోయి ప్రతి పర్వతంమీదా ఎత్తయిన కొండమీదా తిరుగులాడాయి, భూతలమంతటా చెదరిపోయాయి. అయితే వాటి విషయం విచారించినవాడు గానీ వెదకినవాడు గానీ ఒక్కడూ లేడు.
7 “అందుచేత, కాపరుల్లారా, యెహోవా వాక్కు వినండి – 8 యెహోవా ఇలా అంటున్నాడు: నా జీవంతోడని శపథం చేసి చెపుతున్నాను, కాపరులు లేకుండా నా మంద దోపిడీకి గురి అయింది. అన్ని రకాల అడవి మృగాలకు ఆహారం అయింది. నా కాపరులు నా మందను వెదకలేదు, మందను ఏమీ మేపకుండా వాళ్ళు తమ కడుపు నింపుకొనేవాళ్ళు. 9 అందుచేత, కాపరుల్లారా, యెహోవా వాక్కు వినండి. 10 యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఈ కాపరులకు వ్యతిరేకిని. వాళ్ళు నా మంద విషయం లెక్క అప్పగించాలని నేను అడుగుతాను. ఆ కాపరులు తమ కడుపు నింపుకోకుండేలా మందను వాళ్ళ చేతిలోనుంచి తీసివేస్తాను. వాళ్ళకు తిండి కాకుండేలా వాళ్ళ నోటనుంచి నా మందను తప్పిస్తాను.
11 “యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: నేను స్వయంగా నా గొర్రెలను వెదకి కనుగొంటాను. 12 చెదరిన గొర్రెలను కాపరులు వెదకే విధంగా నేను నా గొర్రెలను వెదకుతాను. మబ్బులు కమ్మి చీకటయిన రోజున ఎక్కడెక్కడ అవి చెదరిపోయాయో ఆ చోట్లన్నిటి నుంచీ నేను వాటిని విడిపిస్తాను. 13  ఇతర జనాల మధ్యనుంచి, వేరువేరు దేశాల నుంచి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోకి తీసుకువస్తాను. ఇస్రాయేల్ కొండలమీద వాగులమధ్య, దేశంలో నివాసాలు ఏర్పడ్డ ప్రతి స్థలంలో వాటిని మేపుతాను. 14 మంచి మేత ఉన్న చోట వాటిని మేపుతాను. ఇస్రాయేల్ ఎత్తయిన కొండలు వాటికి మేత స్థలంగా ఉంటాయి. అక్కడ అవి మంచి మేత ఉన్న చోట పడుకొంటాయి. ఇస్రాయేల్ కొండలమీద శ్రేష్ఠమైన పచ్చిక మైదానాలలో మేస్తాయి. 15 నేనే నా గొర్రెలను మేపుతూ, పడుకోబెట్టుతూ ఉంటాను. ఇది యెహోవాప్రభు వాక్కు. 16 తప్పిపోయినవాటిని వెదకుతాను, తోలివేయబడ్డ వాటిని తిరిగి తీసుకువస్తాను, గాయపడ్డవాటికి కట్టు కడతాను, బలం లేనివాటికి బలం కలిగిస్తాను. అయితే క్రొవ్వినవాటినీ బలం ఉన్నవాటినీ నాశనం చేస్తాను. మందను న్యాయంతో కాస్తాను.
17 “నా మందా, మీ విషయం యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: గొర్రెకూ గొర్రెకూ మధ్య, పొట్టేళ్ళకూ మేకపోతులకూ మధ్య భేదం చూచి నేను తీర్పు తీరుస్తాను. 18 పచ్చిక మైదానాలలో మంచి మేత మేయడం మీకు చాలదా? మిగిలినదానిని కాళ్ళతో త్రొక్కాలా? స్వచ్ఛమైన నీళ్ళు త్రాగడం మీకు చాలదా? మిగతా నీళ్ళు కాళ్ళతో కెలికి మురికిచేయాలా? 19 మీరు కాళ్ళతో త్రొక్కినదానిని నా గొర్రెలు మేయాలా? మీరు కలక చేసిన నీళ్ళు అవి త్రాగాలా? 20 గనుక యెహోవాప్రభువు చెప్పేదేమంటే, నేను స్వయంగా క్రొవ్విన గొర్రెలకూ చిక్కిపోయిన గొర్రెలకూ మధ్య భేదం చూచి తీర్పు తీరుస్తాను. 21 మీరు భుజంతో ప్రక్కతో త్రోస్తూ, నీరసించిపోయిన వాటన్నిటినీ కొమ్ములతో పొడుస్తూ, వాటిని చెదరగొట్టి వేస్తున్నారు. 22 అందుచేత ఇకనుంచి నా మంద దోపిడీ కాకుండా నేను వాటిని కాపాడుతాను. గొర్రెకూ గొర్రెకూ మధ్య తీర్పు తీరుస్తాను. 23 నా మందను పోషించడానికి నేను వాటిమీద నా సేవకుడైన దావీదును కాపరిగా నియమిస్తాను. అతడు కాపరిగా ఉండి వాటిని పోషిస్తాడు. 24 నేను – యెహోవాను – వాటికి దేవుడుగా ఉంటాను, వాటిమధ్య నా సేవకుడు దావీదు అధిపతిగా ఉంటాడు. నేను యెహోవాను. నేనే ఈ మాట ఇచ్చాను.
25 “అవి అరణ్యంలో నిర్భయంగా నివసించేలా, అడవిలో సురక్షితంగా నిద్రపోయేలా నేను వాటితో శాంతి ఒడంబడిక చేస్తాను, దేశంలో దుష్టమృగాలు లేకుండా చేస్తాను. 26 నేను నా పర్వతం చుట్టున్న స్థలాలమీద వాటిని దీవిస్తాను. సరియైన సమయాలలో వానలు కురిపిస్తాను. దీవెనల వర్షాలు ఉంటాయి. 27 చెట్లు పండ్లు ఇస్తాయి. భూమి పంట పండుతుంది. నా ప్రజ స్వదేశంలో నిర్భయంగా నివాసం చేస్తారు. నేను వారి కాడికట్లు విప్పి వారిని బానిసలుగా చేసినవాళ్ళ వశంలోనుంచి వారిని విడిపించేటప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు. 28 అప్పటినుంచి వారు ఇతర జనాలకు దోపిడీగా ఉండరు. దుష్ట మృగాలు వారిని మ్రింగివేయవు. వారు సురక్షితంగా నివాసం చేస్తారు. వారిని ఎవ్వరూ భయపెట్టరు.
29 “పంటల విషయం పేరు పొందిన ప్రదేశం నేను వారికి ప్రసాదిస్తాను. అప్పటినుంచి దేశంలో వారు కరవుకు గురి కాబోరు, ఇతర జనాలు వారిని అవమానించరు. 30 అప్పుడు నేను – వారి దేవుడు యెహోవాను – వారికి తోడుగా ఉన్నాననీ, వారు – ఇస్రాయేల్ వంశంవారు – నా ప్రజ అనీ వారు తెలుసుకొంటారు. ఇది యెహోవాప్రభు వాక్కు. 31 మీరు నా గొర్రెలు, నేను పోషించే గొర్రెలు. మీరు మనుషులు, నేనే మీ దేవుణ్ణి. ఇది యెహోవాప్రభు వాక్కు.”