33
1 ✽మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 “మానవపుత్రా, నీ దేశస్థులకు ప్రకటిస్తూ ఇలా చెప్పు: నేను ఏదైనా ఒక దేశం మీదికి ఖడ్గం రప్పిస్తే, ఆ దేశప్రజలు తమలో ఒక వ్యక్తిని ఎన్నుకొని అతణ్ణి కావలివాడుగా నియమిస్తారనుకోండి. 3 అతడు దేశంమీదికి ఖడ్గం రావడం చూచి, బూర ఊది ప్రజలను హెచ్చరిక చేస్తాడనుకోండి. 4 అలాంటప్పుడు ఎవడైనా బూర చప్పుడు విని హెచ్చరిక అలక్ష్యం చేస్తే, ఖడ్గం వచ్చి అతడి ప్రాణం తీస్తే, అతడి మృతికి అతడే బాధ్యుడు. 5 బూర చప్పుడు విని హెచ్చరిక అలక్ష్యం చేసినందుచేత అతడి మృతికి అతడే బాధ్యుడు. హెచ్చరికను స్వీకరిస్తే తన ప్రాణాన్ని రక్షించుకొనేవాడే గదా. 6 అయితే కావలివాడు ఖడ్గం రావడం చూచినా బూర ఊదకుండా, ప్రజలను హెచ్చరిక చేయకుండా ఉంటాడనుకోండి. అలాంటప్పుడు ఖడ్గం వచ్చి వాళ్ళలో ఎవరినైనా ప్రాణం తీస్తే ఆ వ్యక్తి అతడి అపరాధం కారణంగా చస్తాడు గాని అతడి మృతికి కావలివాడే బాధ్యుడని ఎంచుతాను.7 “మానవపుత్రా, నేను నిన్ను ఇస్రాయేల్ ప్రజలకు కావలివాడు✽గా నియమించాను. నేను చెప్పేది విని నీవు నా పక్షంగా వారిని హెచ్చరించాలి. 8 నేను దుర్మార్గుడితో ‘దుర్మార్గుడా! నీవు తప్పక చావాలి!’ అని చెప్పేటప్పుడు అతడు తన దుర్మార్గం విడిచిపెట్టేలా నీవు వాణ్ణి హెచ్చరించకపోతే ఆ దుర్మార్గుడు అతడి అపరాధం కారణంగా చస్తాడు. అయితే అతడి మృతికి నిన్ను బాధ్యుడుగా ఎంచుతాను. 9 అయితే ఆ దుర్మార్గుడు అతడి దుర్మార్గం విడవాలని నీవు వాణ్ణి హెచ్చరిస్తే, ఆ తరువాత అతడు తన దుర్మార్గం విడిచిపెట్టకపోతే అతడు అతడి అపరాధం కారణంగా చస్తాడు గాని నీవు నీ ప్రాణం దక్కించుకొంటావు.
10 ✽“మానవపుత్రా, ఇస్రాయేల్ ప్రజలకు ఇలా చెప్పు: మీరు చెప్పేదేమిటంటే, ‘మా అపరాధాలూ పాపాలూ మా మీద భారంగా ఉన్నాయి. వాటిచేత మేము నీరసించిపోతున్నాం. మేమెలా బతుకుతాం?’ 11 నీవు వాళ్ళతో ఇలా అను: నా జీవం✽మీద ఆనబెట్టి చెప్తున్నాను, దుర్మార్గుడు చస్తే నాకేమి సంతోషం కలగదు. వారి విధానాలు వదలివేసి బ్రతికితేనే నాకు సంతోషం. ఇస్రాయేల్ ప్రజలారా! నావైపు తిరగండి✽! మీ దుర్మార్గాలను వదలివేసి తిరగండి! మీరెందుకు చనిపోవాలి?
12 ✝“అందుచేత, మానవపుత్రా, నీ దేశస్థులకు ఇలా చెప్పు: న్యాయవంతుడు తిరుగుబాటు చేస్తే అదివరకు అతడు అనుసరించిన న్యాయవర్తన ఆ రోజున అతణ్ణి శిక్ష నుంచి తప్పించదు. దుర్మార్గుడు దుర్మార్గం విడిచి నావైపు తిరిగితే అదివరకు అనుసరించిన దుర్మార్గంవల్ల ఆ రోజున పడిపోడు. న్యాయవంతుడు అపరాధం చేస్తే అదివరకు అనుసరించిన న్యాయవర్తనచేత అతడు బ్రతకడు. 13 న్యాయవంతుడు తప్పక బ్రతుకుతాడని నేను చెప్పినందుచేత అతడు తన న్యాయప్రవర్తన నమ్ముకొని చెడుగు చేస్తే, మునుపు అతడు చేసిన మంచి క్రియలలో ఏదీ జ్ఞప్తికి తేబడదు. చెడుగు చేసినందుకు అతడు చస్తాడు. 14 నీవు తప్పక చావాలి అని నేను దుర్మార్గుడికి చెప్పిన తరువాత అతడు తన అపరాధం వదలిపెట్టి నీతిన్యాయాలను అనుసరించసాగితే – 15 ✽తన దగ్గర అప్పు తీసుకొన్నవాడికి తాకట్టు మళ్ళీ అప్పగించి, దొంగిలించినదాన్ని మళ్ళీ ఇచ్చివేసి, చెడుగు చేయకుండా ఉండి జీవాధారమైన చట్టాలను అనుసరిస్తే అతడు చావడు. తప్పకుండా బ్రతుకుతాడు. 16 అతడు చేసిన పాపాలలో ఏదీ అతడి విషయం జ్ఞప్తికి తేబడదు. అతడు నీతిన్యాయాలను అనుసరిస్తున్నాడు గనుక తప్పనిసరిగా బ్రతుకుతాడు.
17 “అయినా, నీ దేశస్థులు ‘యెహోవా విధానం న్యాయమైనది కాదు’ అంటారు. అక్రమ విధానం వాళ్ళదే. 18 న్యాయవంతుడు తన న్యాయప్రవర్తన వదలివేసి చెడుగు చేస్తే దానికారణంగా అతడు చస్తాడు. 19 దుర్మార్గుడు తన దుర్మార్గం వదలివేసి నీతిన్యాయాలను అనుసరిస్తే దానికారణంగా అతడు బ్రతుకుతాడు. 20 ఇస్రాయేల్ ప్రజలారా, మీరు ‘యెహోవా విధానం న్యాయమైనది కాదు’ అంటారు. అయితే మీలో ప్రతివాడికీ అతడి ప్రవర్తన ప్రకారమే తీర్పు తీరుస్తాను.”
21 మేము బందీలుగా వచ్చిన పన్నెండో సంవత్సరం పదో నెల అయిదో రోజు✽న జెరుసలంనుంచి ఒక మనిషి నాదగ్గరికి వచ్చాడు. అతడు దానిలోనుంచి తప్పించుకొన్నవాడు. అతడు “నగరం పట్టబడింది” అని నాతో చెప్పాడు. 22 ✝అతడు రాకముందు రోజూ సాయంకాలాన యెహోవా చెయ్యి నామీద ఉంది. ప్రొద్దున అతడు నాదగ్గరికి వచ్చేముందే యెహోవా నా నోరు తెరచాడు. మాట్లాడే శక్తి నాకు కలిగింది. అప్పటినుంచి నేను మౌనంగా లేను.
23 అప్పుడు యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 24 ✽“మానవపుత్రా, ఇస్రాయేల్‌దేశంలో ఉన్న శిథిలాలలో ఉంటున్నవారు ఏమి చెప్పుకొంటున్నారంటే, ‘అబ్రాహాము ఒక్కడు గానే ఈ దేశాన్ని సొత్తుగా పొందాడు. మనం అనేకులం. తప్పనిసరిగా ఈ దేశం సొత్తుగా మనకు ఇవ్వబడింది.’ 25 అందుచేత నీవు వారికిలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, మాంసంలో రక్తం✽ ఇంకా ఉండగానే మీరు దాన్ని తింటారు, మీ విగ్రహాలవైపు✽ చూస్తూవుంటారు, రక్తపాతం చేస్తారు. ఈ దేశం మీ స్వాధీనంలో ఉండాలా? 26 ✽మీరు మీ కత్తిని నమ్ముకొంటారు, నీచ కార్యాలు చేస్తారు, ప్రతివాడూ పొరుగువాడి భార్యను అశుద్ధపరుస్తాడు. ఈ దేశం మీ స్వాధీనంలో ఉండాలా?”
27 ✽“నీవు ఇలా వారికి చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, నా జీవంతోడని శపథం చేసి చెపుతున్నాను, శిథిలాలలో ఉంటున్నవాళ్ళు కత్తిపాలవుతారు. బయట, పొలాలలో ఉంటున్న వాళ్ళను మృగాలు తినేలా చేస్తాను. కోటలలో, గుహలలో ఉంటున్నవాళ్ళు ఘోర రోగంచేత చస్తారు. 28 దేశాన్ని నిర్జనంగా పాడుగా చేస్తాను. దాని బల గర్వం అంతం అవుతుంది. ఇస్రాయేల్ కొండలు నిర్జనంగా ఉంటాయి. వాటిమీదుగా ఎవరూ వెళ్ళరు. 29 వాళ్ళు చేసిన నీచ కార్యాలకారణంగా దేశాన్ని నిర్జనంగా పాడుగా నేను చేసేటప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.
30 ✽“మానవపుత్రా, నీ దేశస్థులు గోడలదగ్గర, ఇంటి గుమ్మాలలో నిలుచుండి నిన్నుగురించి మాట్లాడుతూ, ఇప్పుడు యెహోవానుంచి వచ్చిన మాట ఏమిటో చూద్దాం, రండి అని ఒకరితో ఒకరు అంటున్నారు. 31 ✽అందరిలాగే నా ప్రజలు కూడా నీ దగ్గరికి వస్తారు. నీవు చెప్పేదేమిటో వినడానికి నా ప్రజలు నీ ఎదుట కూర్చుంటారు. అయితే వాళ్ళు దానిప్రకారం ప్రవర్తించరు. వాళ్ళ నోటినుంచి భక్తి మాటలు వెలువడుతాయి గాని వాళ్ళ హృదయాలు అక్రమ లాభంకోసం తహతహలాడుతూ ఉంటాయి. 32 వాళ్ళ దృష్టికి నీవు వాయిద్యం బాగా వాయిస్తూ, మంచి స్వరంతో భక్తి గీతాలు పాడేవాడిలాగా ఉన్నావు అంతే. నీవు చెప్పేది వాళ్ళు వింటారు గాని దానిప్రకారం చేయరు.
33 “ఇదంతా నెరవేరితీరుతుంది. అది నెరవేరేటప్పుడు వాళ్ళమధ్య ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకొంటారు.”