32
1 పన్నెండో సంవత్సరం పన్నెండో నెల మొదటి రోజున యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 “మానవపుత్రా, ఈజిప్ట్ రాజైన ఫరో విషయం విలాపం చేస్తూ అతడికి ఇలా చెప్పు:
జనాలలో నీవు కొదమ సింహాన్ని పోలి ఉన్నావు,
నీళ్ళలో ఉన్న బ్రహ్మాండమైన మొసలిలాగా ఉన్నావు.
నీ కాలువలలో రేగుతూ, నీ కాళ్ళతో నీళ్ళు
కెలుకులు చేస్తూ, ప్రవాహాలను
మురికి చేస్తూ ఉన్నావు.
3 “యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు:
అనేక జనాలను సమకూర్చి
నా వలను నీమీద వేస్తాను.
నా వలలో చిక్కిన నిన్ను వారు
బయటికి లాగుతారు.
4 నేను నిన్ను నేల పడవేస్తాను,
బయటి పొలంలో పారవేస్తాను.
గాలిలో ఎగిరే అన్ని రకాల పక్షులు నీమీద వాలేట్టు,
భూమిమీద ఉన్న అన్ని రకాల మృగాలు
నీ కళేబరాన్ని కడుపునిండా తినేట్టు చేస్తాను.
5 కొండలమీద నీ మాంసాన్ని వేస్తాను.
మిగిలిన భాగాలతో లోయలన్నిటినీ నింపుతాను.
6 నీ రక్తధారలచేత దేశం కొండలవరకు
తడిసిపోయేలా చేస్తాను.
నీ విభాగాలతో కొండల సందులు నిండిపోతాయి.
7 “నేను నిన్ను ఆర్పివేసేటప్పుడు
ఆకాశ మండలాన్ని కప్పివేస్తాను,
నక్షత్రాలను చీకటి కమ్మేలా చేస్తాను.
సూర్యగోళాన్ని మబ్బుతో కప్పివేస్తాను.
చంద్రబింబం కాంతి ఇవ్వదు.
8 నీకు పైగా ప్రకాశమానమైన ఆకాశ జ్యోతులన్నిటినీ
చీకటి చేసి నీ దేశాన్ని అంధకారం కమ్మేలా చేస్తాను.
ఇది యెహోవాప్రభు వాక్కు.
9 నేను జనాలలో, నీకు తెలియని దేశాలలో
నిన్ను నాశనం చేసేటప్పుడు అనేక జనాలకు
కోపం పుట్టిస్తాను.
10 నా ఖడ్గం రాజుల ఎదుట ఆడించేటప్పుడు
నీ కారణంగా అనేకమంది జనులు నిర్ఘాంతపోతారు,
వాళ్ళ రాజులు భయంతో నిండిపోతారు.
నీవు పడిపోయే రోజున వాళ్ళంతా ఎడతెరిపి లేకుండా
ప్రాణ భయంతో వణకుతారు.
11 “యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు:
బబులోను రాజు ఖడ్గం నీ మీదికి వస్తుంది.
12 బలాఢ్యుల ఖడ్గాలచేత నీ సమూహాలను
కూలుస్తాను.
జనాలన్నిటికంటే ఆ జనం క్రూరమైనది.
వాళ్ళు ఈజిప్ట్ గర్వాన్ని అణచివేస్తారు.
ఈజిప్ట్ సమూహాలన్నీ నాశనమవుతాయి.
13 సమృద్ధి అయిన నీళ్ళ చెంత ఉన్న
దాని పశువులన్నిటినీ నేను నాశనానికి గురి చేస్తాను.
అప్పటినుంచి మనుషుల కాళ్ళు గానీ
పశువుల కాళ్ళు గానీ ఆ కాలువల నీళ్ళను
కదలించవు.
14 అప్పుడు వాటిలో బురద అడుగుకు దిగనిస్తాను,
వాళ్ళ కాలువలు నూనె పారే విధంగా
పారేలా చేస్తాను. ఇది యెహోవాప్రభు వాక్కు.
15 నేను ఈజిప్ట్‌దేశాన్ని పాడు చేసి అందులో
ఉన్నదంతా నాశనం చేసి దాని నివాసులందరినీ
హతమార్చేటప్పుడు
నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.
16 “ఈ విలాపం ఎత్తి ఇతర జనాల కూతుళ్ళు పాడుతారు, ఈజిప్ట్‌నూ దాని సమూహాలనూ ఉద్దేశించి ఈ విలాపం ఎత్తి పాడుతారు. ఇది యెహోవాప్రభు వాక్కు.”
17 పన్నెండో సంవత్సరం ఆ నెల పదిహేనో రోజున యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది. 18 “మానవపుత్రా, ఈజిప్ట్ సమూహాలను గురించి విలపించు. నాశనకరమైన అగాధంలోకి దిగిపోవలసిన వాళ్ళతోపాటు భూమిక్రిందికి వాటినీ, బలమైన జనాల కూతుళ్ళనూ అప్పగించు. 19 ఈజిప్ట్‌తో ఇలా అను: అందంలో నీవు ఎవరిని మించినదానివి? దిగి, సున్నతి లేని వాళ్ళదగ్గర పడి ఉండు. 20 కత్తిపాలయినవాళ్ళ మధ్య వాళ్ళు కూలుతారు. ఖడ్గం నియమించబడి ఉంది. దానినీ దాని సమూహాలనూ ఈడ్చుకుపోవాలి. 21 మృత్యులోకంలో ఉన్న బలాఢ్యులలో ముఖ్యులు ఈజిప్ట్‌ను గురించీ దాని సహాయులను గురించీ ఇలా అంటారు: ‘వీళ్ళు ఇక్కడికి దిగివచ్చారు. సున్నతి లేని వీళ్ళు కత్తిపాలయ్యారు. ఇక్కడ పడి ఉన్నారు.’
22 “అష్షూరు దాని సమూహాలన్నిటితోపాటు అక్కడ ఉంది. దానిచుట్టు దాని సమాధులున్నాయి. వాళ్ళంతా ఖడ్గహతులు. 23 దాని సమాధులు నాశనకరమైన అగాధంలో లోతైన స్థలాలలో ఉన్నాయి. దాని సమూహాలు దాని సమాధిచుట్టు ఉన్నాయి. సజీవుల లోకంలో భయం కలిగించిన వాళ్ళంతా ఖడ్గంచేత హతమై పడిపోయి అక్కడ ఉన్నారు.
24 “ఏలాం అక్కడ ఉంది. దాని సమాధిచుట్టు దాని సమూహాలున్నాయి. వాళ్ళంతా ఖడ్గంచేత హతమై పడిపోయినవాళ్ళు. సజీవుల లోకంలో భయం కలిగించిన వాళ్ళంతా సున్నతి లేని వాళ్ళుగా భూమిక్రిందికి పోయారు. నాశనకరమైన అగాధంలోకి దిగిపోయిన వాళ్ళతోకూడా వాళ్ళు సిగ్గుపాలయ్యారు. 25 హతమైనవాళ్ళ మధ్య ఏలాంకోసం స్థలం తయారైంది. దాని సమాధి చుట్టు దాని సమూహాలున్నాయి. వాళ్ళంతా సున్నతి లేని వాళ్ళుగా ఖడ్గంచేత హతమైనవాళ్ళు. సజీవుల లోకంలో వాళ్ళు భయం కలిగించినవాళ్ళు గనుక నాశనకరమైన అగాధంలోకి దిగిపోయిన వాళ్ళతోకూడా సిగ్గుపాలవుతారు. వాళ్ళు హతమైనవాళ్ళ మధ్య ఉంచబడ్డారు.
26 “మెషెకు, తుబాల్ అక్కడ ఉన్నాయి. వాటి సమాధుల చుట్టు వాటి సమూహాలున్నాయి. వాళ్ళంతా సున్నతి లేని వాళ్ళుగా సజీవులలోకంలో భయం కలిగించినవాళ్ళు గనుక ఖడ్గంచేత హతమయ్యారు. 27 సున్నతి లేని ఇతర జనాలలో కూలిన శూరులదగ్గర వీళ్ళు పడి ఉండడం లేదా? వాళ్ళు యుద్ధాయుధాలు చేతపట్టుకొని మృత్యులోకంలోకి దిగిపోయి తమ ఖడ్గాలు తమ తలలక్రింద ఉంచుకొని పడుకొన్నారు. వీళ్ళు సజీవుల లోకంలో భయం కలిగించినవాళ్ళు గనుక వాళ్ళ అపరాధానికి తగిన శిక్ష వాళ్ళ ఎముకలకు తగిలింది.
28 “ఫరో! నీవు కూడా నాశనమై సున్నతి లేని వాళ్ళుగా కత్తిపాలై పడినవాళ్ళ మధ్య పడుకోవలసివస్తుంది.
29 “ఎదోం, దాని రాజులూ అధిపతులూ అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళు బాలాఢ్యులైనా ఖడ్గంతో హతమైనవాళ్ళదగ్గర ఉంచబడ్డారు. సున్నతి లేని వాళ్ళుగా ఉండి నాశనకరమైన అగాధంలోకి దిగిపోయినవాళ్ళదగ్గర పడి ఉన్నారు.
30 “ఉత్తర దిక్కున ఉన్న నాయకులందరూ, సీదోనువాళ్ళందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళు బలాఢ్యులై భయం కలిగించినా సిగ్గుపాలయ్యారు, హతమైనవాళ్ళతోపాటు అక్కడికి దిగిపోయారు. సున్నతి లేని వాళ్ళుగా ఉండి ఖడ్గంతో హతమైనవాళ్ళమధ్య పడి ఉన్నారు. నాశనకరమైన అగాధంలోకి దిగిపోయినవాళ్ళతో కూడా వాళ్ళు అవమానం పొందారు.
31 “వాళ్ళను చూచి ఫరో, అతడి వాళ్ళంతా ఖడ్గంతో హతమైన తమ సమూహాలన్నిటి విషయం ఓదార్పు తెచ్చుకొంటారు. ఇది యెహోవాప్రభు వాక్కు. 32 సజీవుల లోకంలో అతడిచేత నేను భయం కలిగించాను గాని ఫరో, అతడి సమూహాలన్నీ ఖడ్గంతో హతమైన వాళ్ళదగ్గర, సున్నతి లేని వాళ్ళమధ్య పడుకోవలసివస్తుంది. ఇది యెహోవాప్రభు వాక్కు.”