31
1 పదకొండో సంవత్సరం మూడో నెల మొదటి రోజున యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 “మానవపుత్రా, నీవు ఈజిప్ట్ రాజైన ఫరోతో, అతడి సమూహాలతో ఇలా చెప్పు:
ఘనత విషయంలో నీవు ఎవడిలాగా
ఉన్నావో తెలుసా?
3 ఒకప్పుడు అష్షూరు రాజ్యం లెబానోను
దేవదారు వృక్షంలాంటిది.
దాని కొమ్మలు అందమైనవి,
దాని గుబురు విశాలం,
దాని కొన చాలా ఎత్తయినది –
అది మేఘాలవరకు ఉండేది.
4 నీళ్ళు సమృద్ధిగా ఉండడంవల్ల అది
గొప్పది అయింది.
లోతైన నది ఉండడంవల్ల అది ఎత్తుగా పెరిగింది.
అది నాటి ఉన్న తావు అంతటా
ఆ నది కాలువలు పారాయి.
మైదానంలో ఉన్న చెట్లన్నిటికీ ప్రవహించాయి.
5 “అది మైదానంలో ఉన్న చెట్లన్నిటికంటే
ఎత్తుగా ఎదిగింది, దాని కొమ్మలు అనేకం.
అవి పొడుగుగా పెరిగాయి.
నీళ్ళ సమృద్ధివల్ల దాని కొమ్మలు
అధికంగా వ్యాపించాయి.
6 “గాలిలో ఎగిరే అన్ని రకాల పక్షులూ
దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకొన్నాయి.
అన్ని రకాల అడవి మృగాలూ
దాని కొమ్మలక్రింద పిల్లలు పెట్టాయి.
దాని నీడలో గొప్ప జనాలన్నీ నివసించాయి.
7 నీళ్ళు సమృద్ధిగా ఉన్న చోట దాని వేళ్ళు పారాయి
గనుక అది పొడుగైన కొమ్మలు కలిగి అందంగా,
ఘనంగా ఉండేది.
8 దేవుని తోటలో ఉన్న దేవదారుచెట్టు
దానికి సాటి కావు.
దాని కొమ్మల్లాంటి కొమ్మలు సరళ వృక్షాలకు లేవు.
మేడిచెట్ల కొమ్మలు దీని కొమ్మలకు సాటి రావు.
దీని అందం దేవుని తోటలోని చెట్లలో దేనికీ లేదు.
9 నేను దట్టమైన కొమ్మలిచ్చి దాన్ని
అందంగా చేశాను.
దేవుని తోట ఏదెనులోని చెట్లన్నిటికీ
అది అసూయకారణంగా ఉండేది.
10 “అందుచేత యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: అది తన ఎత్తునుబట్టి విర్రవీగి మేఘాలవరకు తనను హెచ్చించుకొని తన ఎత్తునుబట్టి గర్వించినందుకు 11 నేను దాన్ని జనాల పరిపాలకుడి వశం చేశాను. అతడు దాని చెడుతనానికి తగిన విధంగా దానిపట్ల వ్యవహరించాడు. నేను దాన్ని త్రోసిపుచ్చాను. 12 ఇతర జనాలలో అతి క్రూర జనం దాన్ని నరికివేసి అలాగే దాన్ని విడిచిపెట్టారు. దాని కొమ్మలు కొండలలో, లోయలన్నిటిలో పడ్డాయి. ఆ ప్రాంతంలో ఉన్న వాగులన్నిట్లో పడి విరిగిపోయాయి. భూమిమీద జనాలన్నీ దాని నీడనుంచి వెళ్ళి దాన్ని అలాగే వదలివేశాయి. 13 గాలిలో ఎగిరే అన్ని రకాల పక్షులు పడిపోయినదానిమీద వాలాయి. దాని కొమ్మలలో అన్ని రకాల అడవి మృగాలు ఉన్నాయి. 14 గనుక ఇప్పటినుంచి నీళ్ళదగ్గర ఉన్న ఏ చెట్టూ అతిశయంతో మేఘాలవరకూ తను హెచ్చించుకోకూడదు, జలసమృద్ధి కలిగి తన ఎత్తునుబట్టి గర్వించకూడదు. అవన్నీ సామాన్య మనుషులలాగే భూమిక్రిందికి నాశనకరమైన అగాధంలోకి దిగిపోయేవాళ్ళతోపాటు మృతిపాలవుతాయి.
15 “యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: అది మృత్యులోకానికి పోయిన రోజున నేను విలాపం కలిగించాను. అగాధ జలాలు దాన్ని కప్పేలా చేశాను. దాని కాలువలను అడ్డగించాను, సమృద్ధిగా ఉన్న దాని నీళ్ళను పారకుండా చేశాను. దానికోసం లెబానోనును చీకటిమయంగా చేశాను. దాని కారణంగా మైదానంలో ఉన్న చెట్లన్నీ ఎండిపోయాయి. 16 నాశనకరమైన అగాధంలోకి దిగిపోవలసిన వాళ్ళతో అది మృత్యులోకానికి పోయేలా నేను చేసినప్పుడు, దాని పతనంచేత కలిగే చప్పుడు విని జనాలు వణకిపోయేలా చేశాను. అప్పుడు లెబానోనులో నీళ్ళ సమృద్ధి దొరికిన మంచి మంచి చెట్లన్నీ, ఏదెను చెట్లన్నీ భూమిక్రింద ఓదార్పు పొందాయి. 17 జనాలలో దానికి సహాయం చేస్తూ, దాని నీడను నివసిస్తూ ఉండేవాళ్ళు దానితోకూడా మృత్యులోకంలోకి పోయి కత్తిపాలయినవాళ్ళ దగ్గర చేరారు.
18 “ఘనత, ఆధిక్యం దృష్యా ఏదెను చెట్లలో నీకు సాటి ఏది? అయినా నీవు ఏదెను చెట్లతోపాటు భూమిక్రిందికి దిగిపోవలసి వస్తుంది. ఖడ్గంచేత కూలిన సున్నతి లేనివాళ్ళ మధ్య నీవు పడుకోవలసి వస్తుంది. ఫరో, అతడి సర్వసమూహం ఆ చెట్టులాంటివాళ్ళు. ఇది యెహోవాప్రభు వాక్కు.”