29
1 ✽పదో సంవత్సరం పదో నెల పన్నెండో రోజున యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 ✽“మానవపుత్రా, ఈజిప్ట్ రాజు ఫరో వైపు నీ ముఖం త్రిప్పుకొని అతడి విషయం, ఈజిప్ట్ అంతటి విషయం దైవావేశపూర్వకంగా ఇలా చెప్పు: 3 యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే,ఈజిప్ట్ రాజు ఫరో! నీ నదుల మధ్య
పడుకొని ఉన్న బ్రహ్మాండమైన మొసలీ✽!
నేను నీకు వ్యతిరేకిని. నీవంటావు✽ గదా,
‘నైలు నది నాది, దాన్ని నేనే చేశాను.’
4 “అయితే నేను నీ దవడలకు గాలాలు✽
తగిలిస్తాను, నీ నదులలో ఉన్న చేపలను
నీ పొలుసులకు అంటుకొనేలా చేస్తాను,
నీ పొలుసులకు చేపలన్నీ అంటుకొని ఉండగానే
నిన్ను నదులలో నుంచి బయటికి లాగివేస్తాను.
5 నీ నదుల చేపలన్నిటితోపాటు
నిన్ను ఎడారిలో పడవేస్తాను.
నీవు బయటి నేలను కూలుతావు.
నిన్ను ఎవరూ ఎత్తరు, అవతలకు తీసుకుపోరు.
క్రూర మృగాలకూ గాలిలో ఎగిరే పక్షులకూ
నిన్ను ఆహారంగా ఇస్తాను.
6 అప్పుడు నేనే యెహోవానని ఈజిప్ట్ నివాసులందరూ తెలుసుకొంటారు.
“ఈజిప్ట్ ఇస్రాయేల్ ప్రజలకు రెల్లు✽లాంటి చేతికర్రగా ఉంది. 7 వారు నిన్ను చేతపట్టుకొన్నప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకుపోయావు. నీమీద ఆనుకొంటే నీవు విరిగి వారి నడుములను బెణికేలా చేశావు. 8 గనుక యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: నేను నీమీదికి ఖడ్గం✽ రప్పిస్తాను, నీ మనుషులనూ పశువులనూ చంపుతాను. 9 ✽ఈజిప్ట్‌దేశం పాడైపోయి ఎడారిలాగా అవుతుంది. అప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.
“నీవు ఇలా అన్నావు గదా ‘నైలునది నాది. నేనే దాన్ని చేశాను’. 10 అందుచేత నేను నీకూ నీ నదులకూ వ్యతిరేకిని. ఈజిప్ట్‌దేశాన్ని మిగ్‌దోల్‌నుంచి సెవేనే వరకూ✽ కూషు సరిహద్దువరకూ పూర్తిగా పాడు చేసి ఎడారిగా చేస్తాను. 11 ఆ ప్రదేశం మీదుగా ఎవరూ వెళ్ళరు. దానిలో పశువులు తిరగవు. నలభై సంవత్సరాలు అది నిర్జనంగా ఉంటుంది. 12 పాడైపోయిన దేశాలలో ఈజిప్ట్ దేశాన్ని ఒకటిగా చేస్తాను. పాడైపోయిన పట్టణాలలో దాని పట్టణాలు నలభై సంవత్సరాలు పాడుగా ఉంటాయి. నేను ఈజిప్ట్‌వాళ్ళను ఇతర జనాలమధ్యకు చెదరిగొట్టివేస్తాను, ఇతర దేశాలకు పారదోలుతాను.
13 “యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: నలభై సంవత్సరాలు గడిచినతరువాత ఆ జనాలలో చెదరిపోయిన ఈజిప్ట్‌వాళ్ళను నేను సమకూరుస్తాను. 14 వారిని చెరలోనుంచి పత్రోసుకు – వారి స్వదేశానికి – తిరిగి వచ్చేలా చేస్తాను. అక్కడ వారు అల్పమైన రాజ్యంగా ఉంటారు. 15 ✽అక్కడ రాజ్యాలలో అది అల్పమైనదిగా ఉంటుంది. అప్పటినుంచి అది మరెన్నడూ తనను ఇతర జనాలమీద గొప్ప చేసుకోదు. వాళ్ళు ఇతర జనాలమీద ప్రభుత్వం చేయకుండేలా నేను వాళ్ళను తగ్గిస్తాను. 16 అప్పటినుంచి ఇస్రాయేల్ ప్రజలకు ఈజిప్ట్ మీద నమ్మకం కుదరదు. వారు సహాయం కోసం ఈజిప్ట్‌వైపు తిరగడమే దోష✽మని ఈజిప్ట్ పరిస్థితులే వారికి జ్ఞాపకార్థంగా ఉంటాయి. నేనే ప్రభువైన యెహోవానని అప్పుడు వారు తెలుసుకొంటారు.”
17 ఇరవై ఏడో సంవత్సరం మొదటి నెల మొదటి రోజున యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 18 ✽“మానవపుత్రా, తూరుమీద యుద్ధం చేస్తూ, బబులోనురాజు నెబుకద్‌నెజరు తన సైన్యంచేత చాలా కష్టమైన పని చేయించాడు. సిపాయిలు అందరికీ తల వెంట్రుకలు ఊడిపోయాయి. అందరి భుజాల రాపిడికి చర్మం ఊడిపోయింది. అయినా తూరుమీద యుద్ధంలో అతడు పడిన కష్టానికి తనకూ తన సైన్యానికీ కూలి కూడా చేకూరలేదు.
19 ✽“అందుకోసం యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: నేను బబులోను రాజు నెబుకద్‌నెజరుకు ఈజిప్ట్‌ను ఇవ్వబోతున్నాను. అతడు దాని ధనం పట్టుకుపోతాడు, దాని సొమ్ము దోచుకొంటాడు, దాని ఆస్తి కొల్ల పెట్టుకుపోతాడు. అదంతా అతడి సైన్యానికి జీతం అవుతుంది. 20 అతడు నాకోసమే✽ తూరు నగరం విషయం కష్టించి పని చేశాడు. అందుకు నేను ఈజిప్ట్‌ను బహుమతిగా అతడికిస్తాను. ఇది యెహోవాప్రభు వాక్కు. 21 ✽ఆ రోజున ఇస్రాయేల్ ప్రజల కొమ్ము పైకి వచ్చేలా చేస్తాను. వారిమధ్య నీవు నోరు తెరచి మాట్లాడడానికి అవకాశమిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు.”