28
1 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 “మానవపుత్రా, తూరు పరిపాలకుడికి ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే,
నీవు విర్రవీగి ‘నేనొక దేవుణ్ణి,
సముద్రం మధ్య ఒక దేవుడి సింహాసనంమీద
నేను కూర్చుని ఉన్నాను’
అనుకొంటున్నావు.
దేవునికి ఉన్నంత జ్ఞానం నీకున్నట్టు
నీవు అనుకొన్నా దేవుడివి కావు.
నీవు మనిషివే.
3 దానియేలుకంటే నీవు జ్ఞానివి,
నీకు గూఢమైనది అంటూ ఏదీ లేదు
అని నీ అభిప్రాయం.
4 “నీవు జ్ఞాన వివేకాల మూలంగా
ఐశ్వర్యం చేకూర్చుకొన్నావు.
నీ ధనాగారాలలో వెండిబంగారాలు పోగు చేశావు.
5 వర్తకంలో నీ గొప్ప ప్రవీణతద్వారా
నీ ధనాన్ని వృద్ధి చేశావు.
నీ ధనం కారణంగా నీవు గర్వించావు.
6 “అందుచేత యెహోవాప్రభువు
ఇలా అంటున్నాడు:
దేవునికున్నంత జ్ఞానం నీకున్నట్టు
నీవు అనుకొన్నావు గనుక
7 విదేశీయులు – జనాలలోకెల్లా క్రూరమైన జనం –
నీపైన పడేలా నేను చేయబోతున్నాను.
వాళ్ళు నీ జ్ఞానశోభకు వ్యతిరేకంగా తమ ఖడ్గాలు
ఒరనుంచి తీస్తారు.
నీ వైభవాన్ని ధ్వంసం చేస్తారు.
8 నిన్ను నాశనకరమైన అగాధంలోకి
పంపుతారు.
సముద్రంలో హతమైన వాళ్ళలాగే నీవు చస్తావు.
9 “నిన్ను చంపేవాళ్ళ ఎదుట
‘నేను ఒక దేవుణ్ణి’ అంటావా?
నిన్ను చంపేవాళ్ళ చేతిలో నీవు మనిషిగానే
ఉంటావు గాని దేవుడుగా కాదు.
10 విదేశీయుల చేతుల్లో నీ చావు సున్నతి
లేనివాళ్ళ చావులాగే ఉంటుంది.
నేనే ఈ మాట ఇచ్చాను.
ఇది యెహోవాప్రభు వాక్కు.”
11 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 12 “మానవపుత్రా, తూరు రాజును గురించి విలాపం ఎత్తి అతడికి ఇలా చెప్పు:
యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే,
ఒకప్పుడు నీవు లోపం లేని విధంగా ఉన్నావు
– నీ జ్ఞానం, నీ సౌందర్యం పరిపూర్ణమైనవి.
13 దేవుని తోట అయిన ఏదెనులో నీవు ఉన్నావు.
అన్ని రకాల ప్రశస్త రత్నాలూ
నీకు అలంకారంగా ఉన్నాయి –
మాణిక్యం, గోమేధికం, వజ్రం, కురువింద రత్నం,
మిశ్రమవర్ణ రత్నం, నీలం, పద్మరాగం, పచ్చ.
బంగారంలో అవి పొదిగినవి.
నిన్ను సృజించిన రోజే అవి నీకు
తయారయ్యాయి.
14 “నీవు కావలివాడుగా అభిషేకం పొందిన కెరూబువు.
నేనే నిన్ను నియమించాను.
నీవు దేవుని పవిత్ర పర్వతంమీద ఉండేవాడివి,
నిప్పు కణాల్లాంటి రాళ్ళమధ్య నడిచేవాడివి.
15 నిన్ను సృజించిన రోజునుంచి నీలో చెడుతనం
కనిపించేవరకు నీ ప్రవర్తన లోపం లేనిది.
16 అయితే నీ వ్యాపారం అధికం కావడం మూలాన
నీవు బలాత్కారంతో నిండిపోయావు.
నీవు పాపం చేశావు గనుక దేవుని పర్వతంమీద
ఉండకుండా నిన్ను అవమానానికి గురి చేశాను.
కావలివాడైన కెరూబూ, నిప్పు కణాల్లాంటి
రాళ్ళ మధ్యనుంచి నిన్ను వెళ్ళగొట్టాను.
17 “నీ సౌందర్యాన్ని చూచుకొని
నీకు అహంభావం కలిగింది.
నీ వైభవాన్ని చూచుకొని నీ జ్ఞానాన్ని
దుర్వినియోగం చేసుకొన్నావు.
అందుచేత నేను నిన్ను భూమిమీదికి పడవేశాను.
రాజులకు నిన్ను వింత దృశ్యంగా చేశాను.
18 నీ అనేక దోషాలచేత, నీ అన్యాయ వర్తకంచేత
నీ పవిత్ర స్థలాలు అపవిత్రం చేశావు.
అందుచేత నీలోనుంచి మంట వచ్చేలా చేశాను.
అది నిన్ను కాల్చివేసింది.
నిన్ను చూస్తున్నవాళ్ళందరి ఎదుటే
నిన్ను బూడిద చేశాను.
19 జనాలలో నిన్ను తెలుసుకొన్నవారంతా
నిన్ను గురించి నిర్ఘాంతపోయారు.
నీవు భయంకరమైన అంతానికి వచ్చావు.
నీవు ఇక ఉండవు.”
20 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 21 “మానవపుత్రా, నీ ముఖం సీదోను వైపు త్రిప్పుకొని దాన్ని గురించి దైవావేశ పూర్వకంగా ఇలా చెప్పు: 22 యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే,
సీదోనూ! నేను నీకు వ్యతిరేకిని.
నీ మధ్య నాకు ప్రఖ్యాతి కలుగుతుంది.
దానిలో నా తీర్పులు తీరుస్తూ,
నన్ను పవిత్రుడుగా కనుపరుస్తూ ఉన్నప్పుడు
నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.
23 దాని మధ్యకు ఘోరమైన అంటురోగం పంపిస్తాను.
దాని వీధుల్లో రక్తపాతం జరిగేలా చేస్తాను.
నలుదిక్కులా దానిమీదికి ఖడ్గం వస్తుంది,
హతమైనవాళ్ళు దానిలో కూలుతారు.
అప్పుడు నేనే యెహోవానని వాళ్ళు
తెలుసుకొంటారు.
24 “ఇస్రాయేల్ ప్రజల చుట్టు, గుచ్చుకొనే ముండ్ల కంపల లాగా, నొప్పి కలిగించే గచ్చతీగెలలాగా ఉండి, వారిని ద్వేషించిన జనాలు అప్పటినుంచి ఉండవు. అప్పుడు నేనే యెహోవాప్రభువునని వాళ్ళు తెలుసుకొంటారు.
25 “యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: జనాలలో చెదరిపోయిన ఇస్రాయేల్ ప్రజలను నేను సమకూర్చేటప్పుడు వారిమధ్య, జనాల కళ్ళెదుటే, నన్ను పవిత్రునిగా కనుపరచుకొంటాను. నా సేవకుడు యాకోబుకు నేనిచ్చిన తమ సొంత దేశంలో అప్పుడు వారు నివాసం చేస్తారు. 26 వారు దానిలో నిర్భయంగా ఉంటూ, ఇండ్లు కట్టుకొని ద్రాక్షతోటలు నాటుకొంటారు. వాటిచుట్టూ ఉండి వారిని ద్వేషించిన వాళ్ళందరిపట్లా నా తీర్పులప్రకారం జరిగించిన తరువాత వారు నిర్భయంగా నివాసముంటారు. అప్పుడు నేనే యెహోవానూ వారి దేవుణ్ణీ అని వారు తెలుసుకొంటారు.”