27
1 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 “మానవపుత్రా, తూరు విషయం విలాపం✽ ఎత్తి, దానికి ఇలా చెప్పు: 3 ✽ సముద్రం రేవుల మధ్య ఉన్న నివాసీ! అనేక తీరాల ప్రజలకు వర్తక జనమా! యెహోవాప్రభువు ఈ విధంగా అంటున్నాడు:తూరు! ‘వంకలేని అందం నాది’
అంటున్నావు నీవు.
4 నీ సరిహద్ధులు సముద్రంలో ఉన్నాయి.
నీ నిర్మాతలు నీ అందాన్ని లోపం లేనిదిగా చేశారు.
5 ✽వాళ్ళు శెనీర్ ప్రదేశంనుంచి వచ్చిన
సరళవృక్షం మ్రానుతో నీ పలకలు చేశారు.
నీ ఓడ స్తంభాలను చేయడానికి
లెబానోనునుంచి దేవదారు మ్రాను తెప్పించారు.
6 బాషాను✽నుంచి వచ్చిన సిందూర మ్రానుతో
నీ తెడ్లు తయారు చేశారు.
కిత్తీం ద్వీపంనుంచి వచ్చిన మ్రానుతో
నీ ఓడ పైభాగం చేసి దానికి దంతం పొదిగారు.
7 ఈజిప్ట్‌లో తయారై బుట్టాలు వేసిన శ్రేష్ఠమైన
నార బట్టతో నీ తెరచాప వేశారు.
అది నీ జెండా కూడా. ఎలీషా✽ ద్వీపంనుంచి
ఊదారంగు, నీలిరంగు బట్ట తెప్పించి
నీకు చాందిని చేశారు.
8 సీదోను✽ పట్టణస్థులూ అర్వదు✽ నివాసులూ
నీ తెడ్లు నడిపేవాళ్ళు.
తూరు! నీ పౌరులలో ఆరితేరినవాళ్ళు
నీకు ఓడ నాయకులుగా ఉండేవాళ్ళు.
9 గెబల్✽ పట్టణంవాళ్ళలో దీర్ఘానుభవం
గల పనివాళ్ళు నీ ఓడను బాగు చేసేవాళ్ళు.
నీ సరుకులు కొనడానికి సముద్రంలో
ఉన్న ఓడలన్నీ నావికులంతా✽
నీదగ్గరికి వచ్చేవారు.
10 ✽“పారసీక, లూదు, పూత్ దేశాల వాళ్ళు
సిపాయిలుగా నీ సైన్యంలో చేరారు.
వాళ్ళు డాళ్ళనూ ఇనుప శిరస్త్రాణాలనూ
నీలో వ్రేలాడదీశారు.
వాళ్ళు నీకు వైభవం చేకూర్చారు.
11 అర్వదువాళ్ళు నీ సైన్యంలో చేరి
అన్ని వైపులా నీ గోడలమీద,
నీ బురుజులలో కావలివాళ్ళుగా ఉండేవాళ్ళు.
నీ గోడలన్నిటికీ డాళ్ళు తగిలించారు.
నీ అందాన్ని లోపం లేనిదిగా వాళ్ళు చేశారు.
12 ✽“నీలో అనేక రకాల సరుకులు సమృద్ధిగా ఉండడంచేత తర్షీషు✽ దేశస్థులు నీతో వ్యాపారం చేశారు. వెండి, ఇనుము, తగరం, సీసం ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
13 “గ్రీసు, తుబాల్, మెషెకు✽ దేశాల వాళ్ళు నీతో వ్యాపారం చేశారు. బానిసలనూ కంచు వస్తువులనూ ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
14 “తోగర్మా✽ దేశస్థులు గుర్రాలనూ యుద్ధాశ్వాలనూ కంచర గాడిదలనూ ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
15 “దదాను✽వాళ్ళు నీతో వ్యాపారం చేశారు. అనేక సముద్రతీరాల నివాసులు నీ సరుకులు కొన్నారు. వాళ్ళు దంతం, కోవిదారు మ్రాను తెచ్చి ఇచ్చారు.
16 “నీలో అనేక రకాల వస్తువులు ఉండడంబట్టి సిరియా దేశస్థులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు పచ్చ రాళ్ళు, ఊదారంగు బట్ట, బుట్టాలు వేసిన బట్ట, సున్నితమైన నారబట్ట, పగడం, మాణిక్యాలు ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
17 “యూదావారూ ఇస్రాయేల్‌వారూ నీతో వ్యాపారం చేశారు. నీ సరుకులకోసం మిన్నీత్✽నుంచి గోధుమలు, మిఠాయిలు, తేనె, నూనె, గుగ్గిలం తెచ్చి ఇచ్చారు.
18 “నీ అధిక వస్తు సంపత్తు కారణంగా దమస్కు✽ నగరవాసులు హెల్బోను✽నుంచి ద్రాక్షరసం, తెల్ల గొర్రెబొచ్చు తెచ్చి నీతో వ్యాపారం చేశారు.
19 “ఉజాల్‌లో కాపురమున్న దానీయులు✽, గ్రీసువాళ్ళు నీ సరుకులకు ఇనుప పనిముట్లు, కసింద, చెరకు బదులిచ్చారు.
20 ✽“దదానువాళ్ళు గుర్రపు జీనులకోసమైన బట్టలు తెచ్చి వ్యాపారం చేశారు.
21 “అరబీవాళ్ళు, కేదారు నాయకులంతా నీతో వర్తకం చేశారు. వాళ్ళు గొర్రెపిల్లలనూ పొట్టేళ్ళనూ మేకలనూ ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
22 “షేబ, రమా వర్తకులు నీతో వ్యాపారం చేశారు. వాళ్ళు మసాలా వస్తువులన్నిట్లో మంచివాటినీ వేరువేరు విలువైన రత్నాలనూ బంగారాన్నీ ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
23 ✽“హారాను పట్టణస్థులూ కన్నే, ఎదెను వాళ్ళూ, షేబ, అష్షూరు, కిలమాదులో ఉన్న వర్తకులూ నీతో వ్యాపారం చేశారు. 24 నీ బజార్లలో వాళ్ళు అందమైన దుస్తులు, నీలిరంగు బట్ట, బుట్టాలు వేసిన బట్ట, అనేక రంగులు గల తివాసీలు, గట్టిగా అల్లిన త్రాళ్ళు ఇచ్చి నీ సరుకులు కొన్నారు.
25 “తర్షీషు ఓడలు నీ సరుకులు వేరువేరు
స్థలాలకు తీసుకుపోయేవి.
నీవు సమృద్ధి గల దానివై ఘనంగా
సముద్రంలో కూర్చుని ఉన్నావు.
26 ✽తెడ్లతో ఓడ నడిపేవాళ్ళు నిన్ను
మహా సముద్రంలోకి తీసుకుపోయారు.
అయితే తూర్పు గాలి సముద్ర మధ్యలో
నిన్ను బ్రద్దలు చేస్తుంది.
27 నీవు ధ్వంసమయ్యే రోజున నీ ధనం,
సరుకులు, వర్తక వస్తువులు, నావికులు,
ఓడ నాయకులు, ఓడ బాగు చేసేవాళ్ళు,
వర్తకులు, సిపాయిలందరూ నీలో ఉన్నవాళ్ళంతా
సముద్రమధ్యలో మునిగిపోతారు.
28 నీ ఓడ నాయకులు కేకలు పెట్టేటప్పుడు
నీ ప్రాంతం భూములు కంపిస్తాయి.
29 ✽తెడ్లు చేతపట్టుకొనే వాళ్ళంతా
తమ ఓడలు వదలివేస్తారు.
నావికులూ ఓడ నాయకులూ
ఒడ్డున నిలబడి ఉంటారు.
30 నీ గురించి కంఠమెత్తి వెక్కి వెక్కి ఏడుస్తారు.
తమ తలలమీద మట్టి పోసుకొని
బూడిదలో పొర్లుతారు.
31 నీకోసం తలలు బోడి చేసుకొని మొలలకు
గోనెపట్ట కట్టుకొని మనోవేదనతో నీ విషయం
దుఃఖాక్రాంతులై విలపిస్తారు.
32 వాళ్ళు శోకిస్తూ నిన్ను గురించి
ఇలా విలాపం చేస్తారు: తూరులాంటి నగరమేది?
ఇప్పుడు సముద్రంలో మునిగి నిశ్శబ్దంగా ఉన్న
తూరులాంటి నగరమేది?
33 సముద్రంమీద నీ సరుకులు పోతూ ఉంటే,
అనేక దేశాలవాళ్ళకు తృప్తి కలిగింది.
నీ గొప్ప ఐశ్వర్యం, వర్తకం మూలంగా
భూరాజులు ధనికులయ్యారు.
34 ఇప్పుడు నీవు అగాధ జలాలలో మునిగి
సముద్ర బలంచేత బ్రద్దలయ్యావు.
నీ సరుకులూ నీ జనసమూహమంతా
నీతో కూడా మునిగాయి.
35 సముద్రతీరాల వాసులు నీ కారణంగా
నిర్ఘాంతపోయారు.
వాళ్ళ రాజులు భయాక్రాంతులై వణకుతున్నారు.
వాళ్ళ ముఖాకృతి వికారమైపోయింది.
36 జనాలలో వర్తకులు ఆశ్చర్యంతో ఈల వేస్తారు.
నీవు భయంకరమైన అంతానికి వచ్చావు.
నీవు ఇక ఉండవు.”