26
1 పదకొండో సంవత్సరం, నెల మొదటి రోజున యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 “మానవపుత్రా, తూరు✽ నగరవాసులు జెరుసలం విషయం ‘ఆహాహా✽, జనాలకు ముఖద్వారం✽గా ఉన్న నగరం బ్రద్దలైపోయింది. దాని తలుపులు మాకు తెరచి ఉన్నాయి. అది పాడైపోయినందుచేత మేము వర్ధిల్లుతాం’ అన్నారు. 3 గనుక యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: తూరు! నేను నీకు వ్యతిరేకినయ్యాను. సముద్రం తన అలలను పైకి తెచ్చేవిధంగా అనేక జనాలను నీమీదికి రప్పిస్తాను. 4 వాళ్ళు తూరు గోడలను నాశనం చేసి దాని బురుజులను పడగొట్టేస్తారు. నేను దాని శిథిలాలను తుడిచివేస్తాను, వట్టి బండ మాత్రమే మిగిలిపోయేలా చేస్తాను. 5 ✽సముద్రం దాన్ని ఆవరిస్తుంది. వలలు ఆరబెట్టే స్థలం అవుతుంది అది. నేనే ఈ మాట ఇచ్చాను. ఇది యెహోవాప్రభు వాక్కు. తూరు ఇతర జనాలకు దోపిడీ అవుతుంది. 6 దాని పరిసరాల్లో ఉన్న దాని కూతుళ్ళు కత్తిపాలవుతారు. అప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.7 “యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: రారాజైన బబులోను రాజు నెబుకద్‌నెజరును ఉత్తర దిక్కు✽నుంచి తూరుమీదికి రప్పిస్తాను. అతడు గుర్రాలతో రథాలతో రౌతులతో మహా సైన్యంతో వస్తాడు. 8 ✽దాని పరిసరాల్లో ఉన్న నీ కూతుళ్లను కత్తి పాలు చేస్తాడు. నీకెదురుగా ముట్టడి గోడలను కట్టించి మట్టి దిబ్బలను వేయించి నీ కెదురుగా డాళ్ళను ఎత్తిస్తారు. 9 నీ గోడలను పడగొట్టే యంత్రాలను ప్రయోగిస్తాడు, తన ఆయుధాలతో నీ బురుజులను కూలుస్తాడు.
10 ✽“అతడికి ఉన్న అనేక గుర్రాలు రేపిన దుమ్ము నిన్ను కప్పివేస్తుంది. బీటలున్న గోడలు గల నగరంలోకి సైనికులు చొరబడే విధంగా అతడు నీ ద్వారాలగుండా ప్రవేశించేటప్పుడు, అతడి రౌతులూ వాహనాలూ రథాలూ చేసే చప్పుడుకు నీ గోడలు కంపిస్తాయి. 11 అతడి గుర్రాల డెక్కలు నీ వీధులన్నీ అణగద్రొక్కుతాయి. అతడు నీ నివాసులను ఖడ్గానికి గురి చేస్తాడు. నీ బలమైన స్తంభాలు నేల కూలుతాయి. 12 వాళ్ళు నీ ధనం దోచుకొంటారు, నీ వర్తకం సరుకులు కొల్లగొట్టుకుపోతారు. నీ గోడలు కూలుస్తారు, నీ మంచి మంచి ఇండ్లు పాడు చేస్తారు. నీ రాళ్ళనూ కలపనూ మట్టినీ సముద్రంలో పడవేస్తారు. 13 ✽నీ సంగీతనాదం నేను మాన్పుతాను. అప్పటినుంచి నీ తంతివాద్యాల నాదం వినబడదు. 14 నిన్ను వట్టి బండగా చేస్తాను. వలలు ఆరబెట్టే స్థలమవుతావు. ఆ తరువాత నిన్ను మళ్ళీ కట్టడం ఎన్నటికీ జరగదు. నేనే ఈ మాట ఇచ్చాను. ఇది యెహోవాప్రభు వాక్కు.
15 ✽“యెహోవాప్రభువు తూరుతో ఇలా అంటున్నాడు: నీలో సంహారం జరుగుతూ, గాయపడ్డవాళ్ళు మూలుగుతూ ఉన్నప్పుడు, నీవు పడిపోయేటప్పుడు ఆ శబ్దానికి సముద్రతీరాన ఉన్న ప్రదేశాలు కంపిస్తాయి. 16 సముద్ర ప్రదేశాల రాజులందరూ తమ సింహాసనాలు దిగి తమ రాజ వస్త్రాలూ, బుట్టాలు వేసిన బట్టలూ తీసివేస్తారు. నిన్ను చూచి నిర్ఘాంతపోయి భయాందోళనతో నిండిపోయి గడగడ వణకుతూ చతికిలపడతారు. 17 వాళ్ళు నీ విషయం విలాపం ఎత్తి నీకిలా చెప్తారు:
‘పేరు పొందిన నగరమా!
నువ్వు నాశనమయ్యావేమిటి?
నీ నివాసులు సముద్రం మనుషులు.
నువ్వూ నీ పురవాసులూ సముద్రంలో
బలవంతులు.
నీవంటే సముద్ర నివాసులందరికీ భయం.
18 నువ్వు కూలిన ఈ రోజున తీరభూములు
వణకుతూ ఉన్నాయి.
నీవు పోవడం చూచి సముద్ర ద్వీపాలు
భయకంపితులవుతూ ఉన్నాయి.’
19 ✽“యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: నేను నిన్ను పాడు చేస్తాను. నిర్జనమైన పట్టణంగా నిన్ను చేస్తాను. మహా సముద్రం నిన్ను ముంచివేసేలా నీమీదికి అగాధ జలాలను రప్పిస్తాను. 20 అప్పుడు నేను నిన్ను నాశనకరమైన అగాధంలోకి దిగిపోయిన వాళ్ళతోపాటు పూర్వీకులదగ్గరికి చేరుస్తాను. పూర్వకాలంలో పాడైపోయిన స్థలాలలో భూమిక్రింది భాగాల్లో నాశనకరమైన అగాధంలోకి దిగిపోయిన వాళ్ళతోపాటు నీవు ఉండేలా చేస్తాను. నీవు అక్కడనుంచి తిరిగి రావు. నేను సజీవుల లోకంలో మహిమ కలిగిస్తాను గాని 21 నిన్ను భయంకరమైన అంతానికి తెస్తాను. నీవు లేకుండా పోతావు. ఎంత వెదకినా నీవెన్నటికీ కనిపించవు. ఇది యెహోవా వాక్కు.”