25
1 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 ✽“మానవపుత్రా, అమ్మోనుదేశస్థులవైపు ముఖం త్రిప్పుకొని, వాళ్ళను గురించి నా మాటగా ఇలా పలుకు: 3 ✽అమ్మోనువాళ్ళారా! యెహోవాప్రభు వాక్కు వినండి. యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: నా పవిత్రాలయాన్ని అపవిత్రపరచడం జరిగినప్పుడు, ఇస్రాయేల్ దేశం పాడైపోయి నప్పుడు, యూదావారు బందీలుగా దేశాంతరం పోయినప్పుడు మీరు ‘ఆహాహా’ అంటూ గేలి చేశారు. 4 అందుచేత నేను మిమ్ములను తూర్పుజనానికి సొత్తుగా ఇస్తాను. వాళ్ళు మీ దేశంలో తమ డేరాలను వేసి మీమధ్య కాపురమేర్పరచు కొంటారు. వాళ్ళు మీ దేశం పండ్లు తింటారు, పాలు త్రాగుతారు. 5 రబ్బా✽ను ఒంటెలకు పచ్చిక మైదానంగా, అమ్మోనువాళ్ళ దేశాన్ని గొర్రెలదొడ్డిగా చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు.6 “యెహోవాప్రభువు అంటున్నాడు, మీరు ఇస్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా చేతులు చరచుకొన్నారు, నేల తన్నారు, మనసారా కసితో ఆనందించారు. 7 అందుచేత నేను మీకు వ్యతిరేకంగా నా చెయ్యి చాచి మిమ్ములను దోపిడీగా ఇతర ప్రజలకిస్తాను. మిమ్ములను ఆ ప్రజలలో లేకుండా చేస్తాను. ఇతర దేశాలలో మిమ్ములను నిర్మూలిస్తాను, మిమ్ములను నాశనం చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు.
8 “యెహోవాప్రభువు అంటున్నాడు, మోయాబు✽వాళ్ళూ శేయీరువాళ్ళూ ఈ విధంగా చెపుతున్నారు గదా – ‘యూదాప్రజకూ ఇతర ప్రజలకూ ఏమీ భేదం లేదు.’ 9 అందుచేత నేను తూర్పుజనాన్ని మోయాబుదేశంలోకి రప్పిస్తాను. భూషణంలాగా ఉన్న బేత్‌యేషీమోను, బేల్‌మెయోను, కిర్యాతాయిమ్ అనే సరిహద్దు పట్టణాలను వాళ్ళు పట్టుకొంటారు. 10 అమ్మోను ప్రజతోపాటు మోయాబుజనాన్ని వాళ్ళకు సొత్తుగా ఇస్తాను. ఆ తరువాత అమ్మోను ప్రజలు జాతులలో జ్ఞాపకానికి రారు. 11 మోయాబు వాళ్ళను శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.
12 “యెహోవాప్రభువు అంటున్నాడు, ఎదోం✽దేశస్థులు యూదాప్రజల మీద పగతీర్చుకొని ఘోరమైన అపరాధులయ్యారు. 13 అందుచేత యెహోవాప్రభువు అంటున్నాడు, నేను ఎదోమ్కు వ్యతిరేకంగా నా చెయ్యి చాచి దాని మనుషులనూ పశువులనూ లేకుండా చేస్తాను. ఆ దేశాన్ని పాడు చేస్తాను. తేమానునుంచి దదానువరకు అందరూ కత్తిపాలవుతారు. 14 నా ప్రజ ఇస్రాయేల్‌చేత ఎదోమ్వాళ్ళపై ప్రతీకారం చేయిస్తాను. నా ఆగ్రహానికీ కోపాగ్నికీ అనుగుణంగా వారు ఎదోమ్వాళ్లపట్ల వ్యవహరిస్తారు. నేను జరిగించే ప్రతీకారం వాళ్ళు అనుభవిస్తారు. ఇది యెహోవాప్రభు వాక్కు.
15 “యెహోవాప్రభువు అంటున్నాడు, ఫిలిష్తీయ దేశస్థులు✽ నా ప్రజమీద పగపట్టారు, కసి తీర్చుకొన్నారు, తీరని ద్వేషభావం కలిగి వారిని నాశనం చేయడానికి ప్రయత్నించారు, 16 గనుక యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: నేను ఫిలిష్తీయవాళ్ళకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపబోతున్నాను. కెరీతివాళ్ళను లేకుండా చేస్తాను. సముద్రతీరాన ఉంటున్న మిగతావాళ్ళను నాశనం చేస్తాను. 17 తీవ్ర కోపంతో వాళ్ళను దండిస్తాను, భయంకరమైన ప్రతిక్రియలు జరిగిస్తాను. నేను ప్రతీకారం చేసేటప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.”