24
1 ✽తొమ్మిదో సంవత్సరం పదో నెల పదో రోజున యెహోవానుంచి వాక్కు మరోసారి నాకు వచ్చింది: 2 “మానవపుత్రా, ఈ తేది వ్రాసిపెట్టు. ఈ రోజే వ్రాసిపెట్టు. ఈ రోజునే బబులోను రాజు జెరుసలంను ముట్టడించడం ఆరంభిస్తున్నాడు. 3 ✽తిరుగుబాటు చేసిన ప్రజను గురించి ఉదాహరణ చెప్పి ఇలా ప్రకటించు: యెహోవాప్రభువు ఈ విధంగా అంటున్నాడు,పొయ్యిమీద కుండ పెట్టు.
దానిలో నీళ్ళు పోసి పొయ్యిమీద పెట్టు.
4 ✽మాంసం ముక్కలు దానిలో వెయ్యి.
తొడ, జబ్బ, మొదలైన మంచి మంచి ముక్కలన్నీ
దానిలో వెయ్యి. మంచి ఎముకలతో దాన్ని నింపు.
5 గొర్రెలన్నిట్లో మంచిదాన్ని ఎన్నుకో.
ఎముకలు ఉడికేలా కుండ క్రింద కట్టెలు
పోగు చెయ్యి.
కుండలోది బాగా ఉడకనియ్యి.
ఎముకలను ఉడికించు.
6 “దీనిగురించి యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు:
రక్త✽పాతంతో నిండి ఉన్న ఆ నగరానికి –
మడ్డి✽ గల ఆ కుండకు – బాధ తప్పదు!
దానిలో నుంచి మడ్డి పోవడం లేదు.
దానిలో ఉన్న ముక్కలకోసం చీట్లు వేయకుండా
ముక్క వెంట ముక్క దానిలోనుంచి తీసివెయ్యి.
7 ఆ నగరం ఒలికించిన రక్తం
దానిలో కనిపిస్తూ ఉంది.
అది రక్తాన్ని బండలమీద పోసింది,
ధూళి దాన్ని కప్పివేసేలా✽ నేలమీద పోయలేదు.
8 ✽దాని విషయం కోపాగ్ని రేకెత్తించి
పగతీర్చుకోవాలని అది ఒలికించిన రక్తం
కప్పబడకుండానే ఆ బండలమీద ఉండనిచ్చాను.
9 “యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు:
రక్తపాతంతో నిండిన ఆ నగరానికి బాధ తప్పదు!
నేను కూడా చాలా కట్టెలు పోగు చేస్తాను.
10 అనేక కట్టెలు పేర్చు. నిప్పు రాజెయ్యి.
మాంసం బాగా ఉడకబెట్టు.
మసాలాపొడి కలుపు. ఎముకలు
మాడిపోయేవరకు వాటిని వండు.
11 ✽తరువాత కుండను ఖాళీ చేసి పొయ్యిమీద
మళ్ళీ పెట్టు. అది వేడి అయి మెరుగు పట్టేవరకు
నిప్పుమీద ఉంచు.
దానికి తగిలిన కల్మషం కరిగిపోవాలి.
దాని మడ్డి దహించుకుపోవాలి.
12 ✽ఇదివరకు ఎంత కష్టపడి ప్రయత్నించినా
దాని విస్తారమైన మడ్డి పోలేదు.
ఇప్పుడు అది దాని మడ్డితో కూడా
మంటల్లో ఉండాలి.
13 “నీకు తగిలిన కల్మషం పోకిరీతనమే. నిన్ను శుద్ధి చేయాలని✽ నాకు ఉన్నా, నీవు నన్ను శుద్ధి చేయనివ్వలేదు. అందుచేత నీమీద ఉన్న నా తీవ్ర కోపం తీరిపోయేవరకు నీవు నీ కల్మషంనుంచి శుద్ధి కాబోవు. 14 ✝నేను – యెహోవాను – ఈ మాట ఇచ్చాను. జరుగుతుంది. నేనే దాన్ని నెరవేరుస్తాను. నేను వెనక్కు తీయను, జాలి చూపను, పశ్చాత్తాపపడను. నీ ప్రవర్తనకూ నీ క్రియలకూ అనుగుణంగా తీర్పు తీరుస్తాను. ఇది యెహోవా వాక్కు.”
15 ✽మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 16 “మానవపుత్రా, నీకు ప్రియమైనదానిని నీ దగ్గరనుంచి తీసివేయబోతున్నాను. అయినా నీవు విలపించకు, ఏడ్వకు, కన్నీళ్ళు విడవకు. 17 మెల్లగా మూలగవచ్చు గాని చనిపోయినదాని గురించి విలాపం చేయకు. నీ తలమీద పాగా పెట్టి, పాదరక్షలు తొడుగుకో. నీ మూతి కప్పుకోకు. అలాంటి సమయాలలో మనుషులు తినే ఆహారం తినకు.”
18 ఆ ప్రొద్దున నేను ప్రజలతో మాట్లాడాను. ఆ సాయంకాలం నా భార్య చనిపోయింది. యెహోవా నాకు ఆజ్ఞాపించిన ప్రకారం మరుసటి ఉదయాన నేను చేశాను. 19 ప్రజలు నన్ను చూచి “నీవు చేసినవాటితో మాకు సంబంధమేమిటి? మాకు చెప్పవా?” అని అడిగారు.
20 నేను వాళ్ళతో చెప్పాను, “యెహోవానుంచి వాక్కు ఇలా వచ్చింది: 21 ‘నీవు ఇస్రాయేల్ ప్రజలకు ఈ విధంగా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, నా పవిత్రాలయం మీ బలాతిశయానికి కారణం, మీ దృష్టికి ప్రియం, మీ మనసుకు చాలా ఇష్టం. నేను దాన్ని పాడు చేయబోతున్నాను. మీరు జెరుసలంలో విడిచిన మీ కొడుకులూ కూతుళ్ళూ కత్తిపాలవుతారు. 22 అలా జరిగేటప్పుడు నేను చేసినట్టే మీరు చేయాలి. మీ ముఖం క్రింది భాగాన్ని కప్పుకోకూడదు, అలాంటి సమయాలలో మనుషులు తినే ఆహారం తినకూడదు. 23 మీ తలలమీదనుంచి పాగాలనూ, మీ పాదాలనుంచి చెప్పులనూ తీయకూడదు. మీరు విలపించకూడదు, ఏడ్వకూడదు. ఒకరినొకరు చూచి మూలుగుతూ, మీ అపరాధాల కారణంగా నీరసించిపోతారు. 24 యెహెజ్కేలు మీకు సూచనగా ఉన్నాడు. అతడు చేసినప్రకారమే మీరు చేస్తారు. ఇలా జరిగేటప్పుడు నేనే యెహోవాప్రభువునని మీరు తెలుసుకొంటారు.’
25 “మానవపుత్రా, నేను వాళ్ళ బలాతిశయాన్నీ సంతోషకారణాన్నీ వైభవాన్నీ వాళ్ళ కండ్లు కోరినదాన్నీ వాళ్ళ హృదయాభిలాషనూ వాళ్ళ కొడుకులనూ కూతుళ్ళనూ తీసివేస్తాను. 26 ఆ రోజున తప్పించుకొన్న మనిషి కబురు చెప్పడానికి నీదగ్గరికి వస్తాడు. 27 ✽ఆ రోజునే నీ నోరు తెరవబడుతుంది. నీవు ఆ మనిషితో మాట్లాడుతావు. అప్పటినుంచి నీవు మౌనంగా ఉండవు. ఈ విధంగా నీవు వాళ్ళకు సూచనగా ఉంటావు. నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.”