23
1 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 “మానవపుత్రా ఒక్క తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు ఉండేవాళ్ళు. 3 పడుచుతనంలోనే ఈజిప్ట్ దేశంలో ఉన్నప్పుడు ఇద్దరూ వ్యభిచారం చేయసాగారు. అక్కడ వాళ్ళ రొమ్మును అదిమి పట్టుకోవడమూ వాళ్ళు కన్యకాలం చనులను నొక్కడమూ జరిగింది. 4 పెద్దదాని పేరు ఓహోలా. దాని చెల్లిలి పేరు ఓహోలీబా. ఇద్దరూ నావారయ్యారు, కొడుకులనూ కూతుళ్ళనూ కన్నారు. ఓహోలా అంటే షోమ్రోను; ఓహోలీబా అంటే జెరుసలం.
5 ఓహోలా నాకు భార్యగా ఉంటూనే వేశ్యలాగా ప్రవర్తించింది. దాని ప్రేమికులను మోహించింది. 6 వాళ్ళెవరంటే, పొరుగున ఉన్న అష్షూరుదేశస్థులు – ఊదారంగు బట్టలు వేసుకొన్న సైన్యాధిపతులూ అధికారులూ అందమైన యువకులందరూ గుర్రపు రౌతులూ. 7 అష్షూరుదేశ ప్రముఖలందరికీ ఓహోలా తనను వేశ్యగా ఇచ్చుకొంది. తాను మోహించిన వాళ్ళందరూ పెట్టుకొన్న విగ్రహాల పూజమూలంగా తనను అశుద్ధం చేసుకొంది. 8 ఈజిప్ట్‌లో నేర్చుకొన్న పడుపు వృత్తి ఆమె మానలేదు. అక్కడ ఆమె పడుచుతనంలోనే పురుషులు ఆమెతో పోయారు, ఆమె కన్యకాలం చనులను నొక్కారు, కామాతురులై ఆమెతో అధికంగా వ్యభిచారం చేశారు. 9 అందుకని ఆమెను తాను మోహించిన విటులైన అష్షూరువాళ్ళ వశం చేశాను. 10 వాళ్ళు ఆమెను దిగంబరం చేసి ఆమె కొడుకులనూ కూతుళ్ళనూ పట్టుకొని ఆమెను కత్తితో చంపారు. ఈ విధంగా ఆమె న్యాయసమ్మతమైన దండనకు గురి అయి స్త్రీలలో అపకీర్తికెక్కింది.
11 “ఆమె చెల్లెలు ఓహోలీబా ఇదంతా చూచినా మోహంలో అక్కకంటే ఎక్కువగా చెడిపోయింది. అక్కకంటే ఆమె పడుపు పనులు అధికమయ్యాయి. 12 ఓహోలీబా కూడా పొరుగున ఉన్న అష్షూరువాళ్ళను – శ్రేష్ఠమైన బట్టలు వేసుకొన్న సైన్యాధిపతులనూ అధికారులనూ గుర్రపు రౌతులనూ అందమైన యువకులందరినీ చూచి మోహించింది. 13 ఆమె కూడా తనను అశుద్ధం చేసుకోవడమూ ఇద్దరూ ఒకేలాగా మసులుకోవడమూ నేను చూశాను.
14 “అయితే తన పడుపు పనులను ఆమె ఇంకా అధికతరం చేసింది. ఒకప్పుడు ఒక గోడమీద ఎర్రనిరంగుతో చిత్రించబడ్డ కల్దీయదేశస్థుల పటాలు ఆమెకు కనబడ్డాయి. 15 వాళ్ళ మొలలకు నడికట్లున్నాయి. తలలమీద విచిత్రమైన పాగాలున్నాయి. వాళ్ళంతా కల్దీయదేశంలో ఉన్న బబులోను రథాధిపతులలాంటివాళ్ళు. 16 ఆ చిత్తరువులను చూడగానే ఆమె వారిని మోహించింది. వెంటనే వాళ్ళను పిలిపించు కోవడానికి ఆమె మనుషులను పంపింది. 17 ఆ బబులోనువాళ్ళు ఆమెతో శయనించి వ్యభిచరించి ఆమెను అశుద్ధం చేశారు. వాళ్ళచేత ఆమె అశుద్ధమైన తరువాత వాళ్ళ విషయం ఆమెకు మనసు విరిగిపోయింది.
18 తరువాత ఆమె బహిరంగంగానే తన పడుపు పనులను జరిగిస్తూ తన దిగంబరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటే, ఆమె అక్క విషయంలోలాగే ఆమె విషయం నాకు మనసు విరిగిపోయింది. 19 అప్పుడామె ఈజిప్ట్‌దేశంలో వేశ్యగా తిరిగిన తన పడుచుతనాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని వేశ్య పనులను మరీ ఎక్కువగా పెంచింది. 20 అక్కడ ఉన్న ఆమె విటుల జననేంద్రియాలు గాడిదలాంటివి. వాళ్ళది గుర్రాల వీర్యస్ఖలనంలాంటిది. ఆమె వాళ్ళను మోహించింది. 21 ఈజిప్ట్‌వాళ్ళు నీ చనులను నలిపిన ఆనాటి సంగతి జ్ఞప్తికి తెచ్చుకొని నీ పడుచుతనంలో నీవు చేసిన పోకిరీ పనులప్రకారం మళ్ళీ చేయాలని ఆశించావు.
22 “అందుచేత, ఓహోలీబా, యెహోవాప్రభువు ఇలా చెపుతున్నాడు: ఎవరి విషయం నీకు మనసు విరిగిపోయిందో ఆ నీ విటులను నీకు వ్యతిరేకంగా పురికొలిపి నలుదిక్కులనుంచి రప్పిస్తాను. 23 ఆ బబులోనువాళ్ళనూ కల్దీయవాళ్ళనూ పికోద్, శోయ, కోయ ప్రాంతాల వాళ్ళనూ అష్షూరువాళ్ళనూ – ఆ అందమైన యువకులనూ అధికారులనూ ప్రముఖులనూ రథాధిపతులనూ గొప్పవాళ్ళనూ ఆ గుర్రపు రౌతులందరినీ రప్పిస్తాను. 24 వాళ్ళు ఆయుధాలు చేతపట్టుకొని గొప్ప సైన్యంలాగా రథాలలోనూ వేరువేరు వాహనాలలోనూ నీకు వ్యతిరేకంగా వస్తారు. పెద్ద డాళ్ళూ చిన్న డాళ్ళూ చేతపట్టుకొని తలకు ఇనుప శిరస్త్రాణాలు ధరించి అన్ని వైపులనుంచీ నీమీదికి వస్తారు. వాళ్ళు నీకు శిక్ష విధించేలా నిన్ను వాళ్ళ వశం చేస్తాను. తమ ఆచారాలనుబట్టి వాళ్ళు నీకు శిక్ష విధిస్తారు.
25 “నేను రోషంతో నీపట్ల వ్యవహరిస్తాను గనుక వాళ్ళు కోపాగ్నితో నిన్ను దండిస్తారు. నీ చెవులనూ ముక్కునూ కోసివేస్తారు. నీలో మిగతావాళ్ళను కత్తిపాలు చేస్తారు. నీ కొడుకులనూ కూతుళ్ళనూ పట్టుకుపోతారు. మిగిలినవాళ్ళు మంటలచేత కాలిపోతారు. 26 వారు నీ బట్టలు లాగివేసి నీ అందమైన నగలను కాజేస్తారు. 27 ఈజిప్ట్‌దేశంలో నీవు మొదలుపెట్టిన వ్యభిచార కార్యాలూ పోకిరీ పనులూ అంతమయ్యేలా నేను చేస్తాను. అప్పటినుంచి నీవు వాటిని ఆశించవు. ఈజిప్ట్‌ను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవు.
28 “యెహోవాప్రభువు చెపుతున్నాడు: ఎవరి విషయం నీకు మనసు విరిగిపోయిందో, ద్వేషభావం కలిగిందో నిన్ను వాళ్ళకు అప్పగించబోతున్నాను. 29 వాళ్ళు నీ పట్ల ద్వేషంతో వ్యవహరించి నీ కష్టార్జితమంతా పట్టుకొంటారు. నీ బట్టలన్నీ లాగివేసి నిన్ను దిగంబరంగా విడుస్తారు. నీ వేశ్య క్రియలూ పోకిరీ పనులూ వ్యభిచార కార్యాలూ వెల్లడి అవుతాయి. 30 నీవు ఇతర జనాలతో వేశ్యగా ప్రవర్తించావు, వాళ్ళు పెట్టుకొన్న విగ్రహాల పూజ మూలంగా నిన్ను అశుద్ధం చేసుకొన్నావు గనుకనే ఇదంతా నీకు జరుగుతుంది.
31 నీ అక్క నడిచిన త్రోవనే నడిచావు. అందుచేత ఆమె పాత్ర నీ చేతికి అందిస్తాను.
32 “యెహోవాప్రభువు చెపుతున్నాడు:
నీ అక్క గిన్నెలోది నీవు త్రాగాలి.
ఆ గిన్నె లోతైనది, వెడల్పయినది.
ఆ గిన్నెలో చాలా ఉంది. నీవు త్రాగి
ఎగతాళికీ తిరస్కారానికీ గురి అవుతావు.
33 నీవు మత్తుతో దుఃఖంతో నిండిపోతావు.
షోమ్రోను నీ అక్క. దాని గిన్నె నాశనంతో
విపత్తుతో నిండిన గిన్నె.
34 నీవు దానిలోది అంతా త్రాగి
దానిని విసరివేసి ముక్కలు చేసి
నీ రొమ్మును గాయపరచుకొంటావు.
నేను – యెహోవాను – ఈ సంగతి చెపుతున్నాను.
35 యెహోవాప్రభువు అంటున్నాడు: నీవు నన్ను మరిచిపోయి విసరిగొట్టావు గనుక నీ పోకిరీ పనులకూ వేశ్య క్రియలకూ తగిన శిక్ష నీవు అనుభవిస్తావు.”
36 యెహోవా నాతో ఇలా అన్నాడు: “మానవపుత్రా, ఓహోలాకూ ఓహోలీబాకూ తీర్పు చెపుతావా? అలాగైతే వాళ్ళ నీచమైన కార్యాలను వాళ్ళకు ప్రకటించు. 37 వాళ్ళు వ్యభిచారం చేశారు, రక్తపాతం చేశారు. తాము పెట్టుకొన్న విగ్రహాలను పూజించడం మూలాన వ్యభిచారిణిలాగా ప్రవర్తించారు. వారు నాకు కన్న సంతానాన్ని ఆహారంగా విగ్రహాలకు అర్పించారు. 38  అంతేగాక, నా విషయం వాళ్ళు ఈ విధంగా చేశారు: ఆ కాలంలోనే నా పవిత్రాలయాన్నీ విశ్రాంతి దినాలనూ అశుద్ధం చేశారు. 39 తాము పెట్టుకొన్న విగ్రహాలకు తమ సంతానాన్ని బలి చేసిన రోజునే వాళ్ళు నా పవిత్రాలయంలో చొచ్చి దాన్ని అశుద్ధం చేశారు. నా ఆలయంలో వాళ్ళు అలా చేశారు.
40 “అంతేగాక, దూరాన ఉన్న వాళ్ళను పిలవడానికి వాళ్ళు మనుషులను పంపారు. వాళ్ళు వచ్చినప్పుడు నీవు వాళ్ళకోసం స్నానం చేసి కండ్లకు కాటుక పెట్టుకొని ఆభరణాలతో శృంగారించుకొన్నావు. 41 నా పరిమళ ధూపద్రవ్యం, నా తైలం బల్లమీద ఉంచి దాన్ని అందమైన మంచందగ్గర పెట్టి మంచంమీద కూర్చున్నావు.
42 “ఆమెతో సుఖంగా అజాగ్రత్తగా ఉన్న గుంపు కలకలం వినబడుతూ ఉంది. ఎడారినుంచి త్రాగుబోతులు ఆ గుంపుకు చేరుకొన్నారు. వాళ్ళు ఈ వేశ్యల చేతులకు కడియాలు తొడిగారు, వాళ్ళ తలలమీద అందమైన కిరీటాలు పెట్టారు. 43 వ్యభిచారం మూలాన నీరసించిన ఆమె విషయం నేనిలా అన్నాను: ‘ఇప్పుడు ఆమె వాళ్ళతో కూడా వ్యభిచారం చేయకమానదు.’ 44 అలాగే జరిగింది. వేశ్యతో శయనించినట్టు వాళ్ళు కామాతురం గల ఓహోలాతోనూ ఓహోలిబాతోనూ శయనించారు. 45 ఆ స్త్రీలు వ్యభిచారిణీలు, రక్తపాతం జరిగించేవారు, గనుక వ్యభిచారమూ రక్తపాతమూ చేసిన స్త్రీలకు తగిన శిక్షను వీళ్ళకు న్యాయవంతులు విధిస్తారు. 46 ఇందుకు యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: వీళ్ళమీదికి మూక వచ్చి వీళ్ళను బాధిస్తారు. దోచుకొంటారు. 47 ఆ మూక రాళ్ళు రువ్వి వాళ్ళను చంపుతారు. కత్తిపాలు చేస్తారు. వాళ్ళ కొడుకులనూ కూతుళ్ళనూ చంపి వాళ్ళ ఇండ్లను కాల్చివేస్తారు.
48 “స్త్రీలందరూ హెచ్చరిక పొంది మీలాగా సిగ్గుమాలిన విధంగా ప్రవర్తించకుండేలా పోకిరీతనాన్ని దేశంలో లేకుండా నేను నిర్మూలిస్తాను. 49 మీ సిగ్గుమాలిన ప్రవర్తనా ఫలితం మీరు అనుభవిస్తారు, విగ్రహపూజ అనే మీ పాపానికి రావలసిన శిక్షకు గురి అవుతారు. అప్పుడు నేనే యెహోవాప్రభువునని మీరు తెలుసుకొంటారు.”