22
1 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 “మానవపుత్రా, రక్తపాతం చేసే ఆ నగరానికి నీవు తీర్పు చెపుతావా? అలాగైతే అది✽ చేసే నీచ కార్యాలన్నీ దానికి ప్రకటించి ఇలా చెప్పు: 3 ✽యెహోవాప్రభువు చెప్పేది ఏమిటంటే, రక్తపాతం చేసే నగరమా! నీ కాలం వచ్చింది. నీవు విగ్రహాలు తయారు చేయడంవల్ల నిన్ను అశుద్ధం చేసుకొన్నావు. 4 ఆ రక్తపాతంచేత నీవు అపరాధివి అయ్యావు, నీవు చేసిన విగ్రహాల మూలంగా అశుద్ధమయ్యావు. నీకు నీవే శిక్ష తెప్పించుకొంటున్నావు. నీ దండన కాలం వచ్చింది. గనుక నేను నిన్ను ఇతర జనాల దృష్టిలో నిందకు గురి చేస్తున్నాను, అన్ని దేశాలవారికి నిన్ను నవ్వులపాలు చేస్తున్నాను. 5 కలహమయమై పేరు చెడిపోయిన నగరమా! దగ్గరగా ఉన్నవాళ్లూ దూరంగా ఉన్నవాళ్లూ నిన్ను ఎగతాళి✽ చేస్తారు.6 ✽“నీలో ఉన్న ప్రముఖులంతా రక్తపాతం చేయడానికి తమ శక్తి ప్రయోగిస్తూ ఉన్నారు. 7 నీలో ఉన్నవాళ్ళు తల్లిదండ్రులను అవమానిస్తూ ఉన్నారు. నీలో విదేశీయులను దౌర్జన్యం చేయడం, విధవరాండ్రనూ తండ్రిలేని పిల్లలనూ బాధించడం జరుగుతూ ఉంది. 8 నీవు నా పవిత్ర వస్తువులను తృణీకరించావు, నా విశ్రాంతి దినాలను అశుద్ధం చేశావు. 9 రక్తపాతం జరిగించడానికి నీలో కొంతమంది అపనిందలు చెపుతున్నారు. కొండలమీద✽ భోం చేసేవాళ్ళూ పోకిరీ పనులు చేసేవాళ్ళు నీలో ఉంటున్నారు. 10 తండ్రియొక్క భార్యతో శయనించేవాళ్ళూ రుతు కాలంవల్ల అశుద్ధంగా ఉన్న స్త్రీలను చెరపట్టేవాళ్ళూ నీలో ఉన్నారు. 11 నీలో ఒక వ్యక్తి తన పొరుగువాడి భార్యతో నీచ కార్యం జరిగిస్తాడు. మరొకడు సిగ్గుమాలి తన కోడలిని అశుద్ధం చేస్తాడు, మరొకడు తన సోదరిని – సొంత తండ్రి కూతురును – మానభంగం చేస్తాడు. 12 రక్తపాతం చేయడానికి లంచం తీసుకొనేవాళ్ళు నీలో ఉన్నారు. నీవు వడ్డీకీ అధిక లాభానికీ అప్పిస్తున్నావు. ఆదాయంకోసం నీ పొరుగువాడిపట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నావు. నీవు నన్ను మరచిపోయావు. ఇది యెహోవాప్రభు వాక్కు.
13 “నీవు కూర్చుకొన్న అన్యాయ లాభాన్ని, నీవు చేసిన రక్తపాతాన్ని చూచి నేను చేతులు చరచుకొంటాను✽. 14 ✝నేను నిన్ను దండించబోయే కాలంలో తట్టుకోవడానికి చాలేటంత ధైర్యం నీకు ఉంటుందా? నీ బలం సరిపోతుందా? నేను – యెహోవాను – చెప్పాను. నా మాటలప్రకారం చేస్తాను కూడా. 15 ✝నేను నిన్ను ఇతర జనాలమధ్య చెదరగొట్టివేస్తాను, వేరువేరు దేశాలకు వెళ్ళగొట్టివేస్తాను. నీలో అశుద్ధత అంతమయ్యేలా చేస్తాను. 16 ✽ఇతర జనాల ఎదుట నీవు పాడైపోయేటప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకొంటావు.”
17 ✽మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 18 “మానవపుత్రా, ఇస్రాయేల్ ప్రజ నా దృష్టికి కల్మషంలాంటి వాళ్ళయ్యారు. వారంతా కొలిమిలో మిగిలిన రాగి, తగరం, ఇనుము, సీసం అనే వెండి కల్మషంలాంటివాళ్ళు. 19 గనుక యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: మీరంతా కల్మషం లాంటివాళ్ళు కావడంచేత నేను మిమ్ములను జెరుసలంలో పోగు చేస్తాను. 20 మనుషులు వెండి, రాగి, ఇనుము, సీసం, తగరం పోగుచేసి కొలిమిలో వేసి దాని మీద నిప్పు ఊది కరిగించే విధంగా నా ఆగ్రహమూ కోపాగ్నీ అనుసరించి నేను మిమ్ములను పోగు చేసి నగరంలో మిమ్ములను కరిగిస్తాను. 21 మిమ్ములను పోగుచేసి నా కోపాగ్ని మీమీద ఊదుతాను. మీరు అక్కడ కరిగిపోతారు. 22 కొలిమిలో వెండి కరిగేప్రకారం మీరు నగరంలో కరిగిపోతారు. అప్పుడు నేను – యెహోవాను – నా కోపాగ్ని మీమీద కుమ్మరించిన సంగతి మీరు తెలుసుకొంటారు.”
23 ✽మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 24 “మానవపుత్రా, జెరుసలంకు ఇలా చెప్పు: ‘నీవు శుద్ధం కాని దేశానివి, ఆగ్రహ దినంలో నీకు వాన రాదు.’ 25 అక్కడి ప్రవక్తలు దురాలోచనలు చేస్తున్నారు. గర్జించే సింహం పట్టుకొన్నదానిని చీల్చే విధంగా వాళ్ళు మనుషులను దిగమ్రింగుతున్నారు. సొమ్మూ విలువైన వస్తువులూ పట్టుకొంటున్నారు. అక్కడ చాలామందిని విధవరాండ్రుగా చేస్తున్నారు.
26 “అక్కడి యాజులు నా ధర్మశాస్త్రాన్ని తారుమారు చేస్తున్నారు. నా పవిత్ర వస్తువులను అశుద్ధం చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో దేవునికి అర్పించినదానికీ సాధారణమైన దానికీ మధ్య తేడా ఏమీ లేదు. శుద్ధమైనదానికీ అశుద్ధమైనదానికీ ఉన్న భేదం వాళ్ళు ప్రజకు నేర్పడం లేదు. నా విశ్రాంతి దినాలను వాళ్ళు ఆచరించడం లేదు. ఈ విధంగా వాళ్ళమధ్య నేను దూషణకు గురి అవుతూ ఉన్నాను.
27 “అక్కడి అధిపతులు తోడేళ్ళలాంటివాళ్ళు. అవి పట్టుకొన్నదాన్ని చీల్చేవిధంగా వాళ్ళు అక్రమ లాభంకోసం రక్తపాతం చేస్తున్నారు, మనుషులను నాశనం చేస్తున్నారు.
28 “అక్కడి ప్రవక్తలు మాయా దర్శనాలచేతా✽ అబద్ధాలతో నిండిన సోదె చెప్పడంచేతా మట్టిగోడకు సున్నం వేసినట్టుగా✽ వాళ్ళ కార్యాలను కప్పివేస్తూ ఉన్నారు. యెహోవా ఏమీ పలకకుండా ఉన్నా ‘యెహోవాప్రభువు ఇలా పలుకుతున్నాడు’ అంటారు. 29 అక్కడి ప్రజలు దౌర్జన్యం, దొంగతనం చేస్తూ ఉండేవాళ్ళు. దీనావస్థలో అక్కరలో ఉన్నవారికి బాధించేవాళ్ళు. విదేశీయులను అన్యాయంగా హింసించేవాళ్ళు.
30 ✽ “నేను దేశాన్ని నాశనం చేయకుండేలా గోడ నిర్మిస్తూ దేశంపక్షాన బీటలో నిలుస్తూ ఉండగలిగేవాడికోసం నేను వెదికాను. అలాంటివాడెవ్వడూ కనబడలేదు. 31 ✽అందుచేత నేను నా ఆగ్రహం వాళ్ళమీద కుమ్మరిస్తాను, వాళ్ళ ప్రవర్తన ఫలితం వాళ్ళ నెత్తిమీదికి రప్పిస్తూ నా కోపాగ్నిచేత వాళ్ళను దహించివేస్తాను. ఇది యెహోవాప్రభు వాక్కు.”