21
1 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 “మానవపుత్రా, జెరుసలంవైపు నీ ముఖం త్రిప్పి పవిత్రాలయం✽ గురించి ప్రకటన చెయ్యి. ఇస్రాయేల్ దేశం గురించి దైవావేశపూర్వకంగా ఇలా చెప్పు: 3 యెహోవా చెప్పేదేమిటంటే, నేను నీకు వ్యతిరేకినయ్యాను. నా ఖడ్గం✽ ఒర దూసి నీలో ఉన్న సన్మార్గులనూ✽ దుర్మార్గులనూ హతమారుస్తాను. 4 సన్మార్గులూ దుర్మార్గులూ నీలో ఉండకుండేలా దక్షిణ దిక్కునుంచి ఉత్తర దిక్కువరకు అందరినీ హతం చేయడానికి నా ఖడ్గం ఒర దూయబడుతుంది. 5 ✽నేను – యెహోవాను – నా ఖడ్గం ఒర దూసినట్టు అందరూ తెలుసుకొంటారు. అది మళ్ళీ ఒరలోకి రాదు.6 ✽“గనుక, మానవపుత్రా, వాళ్ళ కళ్ళెదుటే, పగిలిన గుండెతో మనోదుఃఖంతో నిట్టూర్చు! 7 ✝‘నీవు ఎందుకు నిట్టూరుస్తున్నావు?’ అని వాళ్ళు నిన్ను అడిగేటప్పుడు నీవిలా అను: ‘నాకు వచ్చిన సమాచారం కారణంగా నిట్టూరుస్తున్నాను. ప్రతి గుండె కరుగుతుంది. అందరి చేతులకూ బలం లేకుండా పోతుంది, అందరి మనసులకూ అధైర్యం కలుగుతుంది, అందరి మోకాళ్ళూ నీళ్ళలాగా అవుతాయి. ఇంత కీడు వస్తూ ఉంది. అది తప్పక వస్తుంది. ఇది యెహోవాప్రభు వాక్కు.”
యెహోవా చెప్పేదేమిటంటే,
ఖడ్గం కనిపిస్తూ ఉంది.
పదునూ మెరుగూ పెట్టిన ఖడ్గం కనిపిస్తూ ఉంది.
10 గొప్ప వధకు అది పదును పెట్టి ఉంది.
మెరుగు పెట్టి ఉండి, మెరుపులాగా
తళతళ లాడుతూ ఉంది.
అందుకు సంతోషించాలా?
నా కుమారా, నీవు దండాన్నీ ప్రతి విధమైన
సలహానూ తృణీకరించావు.
11 “చేతపట్టుకోవడానికి ఖడ్గం మెరుగు పెట్టే
వాడిదగ్గర ఉంది.
అది పదును పెట్టబడింది, మెరుగు పెట్టబడింది.
సంహారకుడు పట్టుకోవడానికి అది సిద్ధంగా ఉంది.
12 మానవపుత్రా, పెడబొబ్బలు పెట్టు!
గోల పెట్టు! ఖడ్గం నా ప్రజలమీదికి ఇస్రాయేల్ ప్రజల
నాయకులందరిమీదికీ వస్తూ ఉంది.
వారు నా ప్రజతోపాటు కత్తిపాలవుతున్నారు.
గనుక నీ గుండెలు బాదుకో.
13 “విషమ పరీక్ష తప్పక వస్తుంది.
తృణీకారానికి గురి అయిన దండం
రాకుండా ఉంటుందా?
ఇది యెహోవా వాక్కు.
14 గనుక, మానవపుత్రా, చేతులు చరుస్తూ
నా మాటగా ప్రకటన చెయ్యి.
ఖడ్గం రెండు సార్లు, మూడు సార్లు
పని చేస్తుంది.
ఆ ఖడ్గం సంహారానికి తయారైంది.
నలుదిక్కుల జరగబోయే గొప్ప సంహారానికి
సిద్ధంగా ఉంది.
15 గుండెలు కరిగిపోవాలనీ అనేకులు
పడిపోవాలనీ నేను వారి ద్వారాలన్నిటి
దగ్గర ఖడ్గాన్ని ఉంచాను.
అయ్యయ్యో! అది మెరుపులాగా
తళుక్కుమంటూ ఉన్నది.
సంహారానికి అది దూసి ఉంది.
16 ఖడ్గమా! పని చెయ్యి! కుడివైపు పో,
ఎడమవైపు పో – నీ అంచు ఏ వైపుకు ఉందో
ఆ వైపు హతం చెయ్యి.
17 నేను కూడా నా చేతులు చరచుకొని
నా కోపాగ్ని తీర్చుకొంటాను.
నేను – యెహోవాను – చెప్పాను.”
18 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 19 “మానవపుత్రా, బబులోను రాజు ఖడ్గం రావడానికి రెండు త్రోవలను నీవు ఏర్పరచు. రెండూ ఒకే దేశంనుంచి రావాలి. నగరానికి పోయే ముఖ్యమైన త్రోవదగ్గర గుర్తు స్తంభం తయారు చేసి ఉంచు. 20 ఖడ్గంకోసం అమ్మోనువాళ్ళ రబ్బా ఒక త్రోవను, యూదాదేశానికీ అందులో ప్రాకారాలు గల జెరుసలంకూ ఒక త్రోవను ఏర్పరచు. 21 ✽మార్గం రెండు పాయలయ్యే చోట – ఆ రెండు త్రోవలు కలిసే చోట – శకునం తెలుసుకొందామని బబులోను రాజు నిలుస్తాడు. బాణాలను అటూ ఇటూ ఆడిస్తాడు, తన విగ్రహాల దగ్గర విచారణ చేస్తాడు, కారిజం✽ చూస్తాడు. 22 అతడికి కుడివైపున శకునం కనిపిస్తుంది – జెరుసలందగ్గర అతడు తలుపులను పడగొట్టే యంత్రాలను ఉంచి మట్టిదిబ్బలు వేయాలి, ముట్టడి గోడ కట్టాలన్న మాట. 23 అతనికి శపథం✽ చేసినవాళ్లకు ఆ శకునం వట్టిదిగా కనిపిస్తుంది. అయితే అతడు వాళ్ళ అపరాధాల విషయం జ్ఞప్తికి తెచ్చి వాళ్ళను పట్టుకొంటాడు.
24 “అందుచేత యెహోవా ప్రభువు ఇలా అంటున్నాడు: మీరు బట్టబయలుగా ద్రోహం చేయడంవల్ల, మీరు చేసేదంతట్లో మీ పాపాలు ప్రదర్శించడంవల్ల మీ అపరాధం మనసుకు వచ్చేలా చేశారు, గనుక వాళ్ళ చేతిలో చిక్కుపడుతారు. 25 ✽భ్రష్టుడూ దుర్మార్గుడూ అయిన ఇస్రాయేల్ ప్రజల నాయకుడా, చివరికి నీ పాపం పండే కాలం వచ్చింది. 26 ✝యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు – పాగా తీసివెయ్యి, కిరీటం తీసివెయ్యి. ముందున్నట్టు ఇక ఉండదు. అల్పులు ఘనులవుతారు, ఘనులు అల్పులవుతారు. 27 ✽ విపత్తు వెంట విపత్తు రప్పిస్తాను. దానికి హక్కుదారుడు వచ్చేవరకు అది రాజ్యంగా ఉండదు. అప్పుడు నేను దాన్ని ఆయనకిస్తాను.
28 ✽ “మానవపుత్రా, నీవు దైవావేశపూర్వకంగా ఇలా పలుకు:
‘అమ్మోనువాళ్ళను గురించి,
వాళ్ళు చేసిన నిందగురించి యెహోవాప్రభువు
చెప్పేదేమిటంటే ఖడ్గం దూసి ఉంది,
ఖడ్గం సంహారానికి దూసి ఉంది.
అది మెరుపులాగా తళతళలాడాలనీ
హతం చేయాలనీ మెరుగు పెట్టి ఉంది.
29 శకునగాండ్రు నీ గురించి మాయా దర్శనాలు
చూచి మోసకరమైనవాటిని చెప్పినా, ఖడ్గమా,
వధకు గురి కాబోయే దుర్మార్గుల మెడలమీద
నీవు ఉంచబడతావు. వాళ్ళ రోజు వచ్చింది,
వాళ్ళ పాపం పండే కాలం వచ్చింది.
30 ఖడ్గాన్ని మళ్ళీ ఒరలో పెట్టు.
నీవు ఉనికిలోకి వచ్చిన స్థలంలోనే,
నీవు పుట్టిన దేశంలోనే నేను నీకు
తీర్పు తీరుస్తాను.
31 ✽అక్కడే నా ఆగ్రహాన్ని నీమీద కుమ్మరించి
నా కోపాగ్ని నీమీద రగలబెట్టి నాశనం చేయడంలో
నేర్పు గల క్రూరుల వశం చేస్తాను.
32 నీవు మంటకు కట్టెల్లాగా ఉంటావు.
నీ దేశంలో నీ రక్తం కారుతుంది.
అప్పటినుంచి నీవు మరెన్నటికీ జ్ఞప్తికి రావు.
నేను – యెహోవాను – ఈ మాట చెప్పాను.”