20
1 ✽ఏడో సంవత్సరం అయిదో నెల పదో రోజున ఇస్రాయేల్‌ప్రజల పెద్దలలో కొందరు యెహోవాదగ్గర విచారణ చేయడానికి నా దగ్గరికి వచ్చి నా ఎదుట కూర్చున్నారు. 2 ✝అప్పుడు యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 3 “మానవపుత్రా, నీవు ఇస్రాయేల్ ప్రజల పెద్దలతో ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, నాదగ్గర విచారణ చేయడానికి మీరు వస్తున్నారేం. నా జీవంతోడు నా దగ్గర మీకు సలహా ఏమీ దొరకదు. ఇది ప్రభువైన యెహోవా వాక్కు.4 ✽“వాళ్ళకు తీర్పు చెపుతావా! మానవపుత్రా, వాళ్ళకు తీర్పు చెపుతావా? వాళ్ళ పూర్వీకుల అసహ్య కార్యాలను వాళ్ళకు చెపుతూ ఇలా అను: 5 ✽ యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నేను ఇస్రాయేల్‌ప్రజను ఎన్నుకొన్నప్పుడు, యాకోబు వంశంవారికి ఒక ప్రమాణం చేసి చెప్పాను. వారు ఈజిప్ట్‌లో ఉన్నప్పుడు వారు నన్ను తెలుసుకొనేలా చేశాను. నేను యెహోవాను మీ దేవుణ్ణి అంటూ ప్రమాణం చేశాను. 6 వారిని ఈజిప్ట్ నుంచి వారికోసం నేను చూచిన దేశానికి తీసుకుపోతానని ఆ రోజున ప్రమాణం చేశాను. ఆ దేశం పాలు తేనెలు నదులై పారుతున్న దేశమనీ దేశాలన్నిట్లో ఆభరణంలాంటి దేశమనీ చెప్పాను. 7 ✽నేను వారితో ఇలా అన్నాను: నేను యెహోవాను, మీ దేవుణ్ణి. మీలో ప్రతి ఒక్కరూ తనకిష్టమైన నీచ కార్యాలను విసర్జించాలి. ఈజిప్ట్‌వాళ్ళ విగ్రహాల పూజమూలంగా మిమ్ములను అశుద్ధం చేసుకోకూడదు.
8 “అయితే నా మాట వినడం వారికి ఇష్టం లేకపోయింది. తమకిష్టమైన నీచ కార్యాలను విసర్జించకుండా, ఈజిప్ట్‌వాళ్ళ విగ్రహాలను వదలి పెట్టకుండా నాపై తిరగబడి ఉన్నారు. అందుచేత ఈజిప్ట్‌లోనే వారిమీద నా కోపాగ్ని కుమ్మరించి నా ఆగ్రహం వారిమీద తీర్చుకోవాలనుకొన్నాను. 9 గానీ నా పేరుప్రతిష్ఠలకోసం పని చేశాను – వారు నివసించిన జనాలమధ్య నా పేరు✽ దూషణకు గురి కాకుండేలా, ఆ జనాల ఎదుట వారికి ప్రత్యక్షమై వారిని ఈజిప్ట్‌నుంచి బయటికి తీసుకువచ్చాను. 10 ✝కాబట్టి, వారిని ఈజిప్ట్‌నుంచి ఎడారిలోకి తీసుకువచ్చాను. 11 ✝వారికి నా చట్టాలు ఇచ్చాను, నా న్యాయ నిర్ణయాలు తెలియజేశాను. (వాటిని అనుసరించేవారు వాటి మూలంగా బ్రతుకుతారు.) 12 నేను – యెహోవాను – వారిని ప్రత్యేకించుకొన్నానని వారు తెలుసుకోవాలని నాకూ వారికీ మధ్య సూచనగా నా విశ్రాంతి దినాలు నియమించాను.
13 ✝“అయితే ఎడారిలో కూడా ఇస్రాయేల్ ప్రజ నామీద తిరగబడ్డారు. నా చట్టాలను అనుసరించక నా న్యాయనిర్ణయాలను త్రోసిపుచ్చారు (వాటిని అనుసరించేవారు వాటిమూలంగా బ్రతుకుతారు). నా విశ్రాంతి దినాలను అపవిత్రపరచారు. అందుచేత ఎడారిలోనే నా కోపాగ్ని కుమ్మరించి వారిని నాశనం చేయాలనుకొన్నాను. 14 ✽గాని నేను వారిని బయటికి తీసుకువచ్చినప్పుడు అది చూచిన జనాలమధ్య నా పేరు దూషణకు గురి కాకుండా చేశాను. 15 ✝అయినా, దేశాలన్నిట్లో ఆభరణమై పాలుతేనెలు నదులై పారే దేశంలో, నేను వారికిచ్చిన ఆ దేశంలో, వారిని ప్రవేశపెట్టనని ఎడారిలో వారికి నేను శపథం చేసి చెప్పాను. 16 ✽ఎందుకంటే, వాళ్ళు పూజించే విగ్రహాలంటే వాళ్ళకు చాలా ప్రీతి కావడంచేత వాళ్ళు నా న్యాయ నిర్ణయాలను త్రోసిపుచ్చారు. నా చట్టాల ప్రకారం ప్రవర్తించలేదు, నా విశ్రాంతి దినాలను అపవిత్రపరచారు. 17 ✝అయినా, నేను వాళ్ళను నాశనం చేయలేదు. వారిని జాలితో చూశాను. వారిని ఎడారిలో కూడా నిర్మూలించలేదు.
18 ✽“ఎడారిలో వాళ్ళ సంతానంతో నేనిలా అన్నాను: మీరు మీ తండ్రుల ఆచారాలను అనుసరించకండి, వాళ్ళ నియమాలను పాటించకండి. వాళ్ళు పెట్టుకొన్న విగ్రహాల పూజ మూలంగా మిమ్ములను అశుద్ధం చేసుకోకండి. 19 నేను యెహోవాను, మీ దేవుణ్ణి. నా చట్టాలను అనుసరిస్తూ, నా న్యాయనిర్ణయాలను జాగ్రత్తగా పాటిస్తూ ఉండండి. 20 నా విశ్రాంతి దినాలను పవిత్ర దినాలుగా ఆచరించండి. అప్పుడు అవి నాకూ మీకూ మధ్య సూచనగా ఉంటాయి, నేను దేవుణ్ణని మీరు తెలుసుకొంటారు.
21 “అయితే వాళ్ళ సంతానం కూడా నాకు ఎదురు తిరిగారు. నా చట్టాలప్రకారం నడుచుకోలేదు. నా న్యాయనిర్ణయాలను జాగ్రత్తగా పాటించలేదు (వాటిని అనుసరించేవారు వాటిమూలంగా బ్రతుకుతారు), నా విశ్రాంతి దినాలను అపవిత్రపరచారు. అందుచేత ఎడారిలో నా కోపాగ్ని వాళ్ళమీద కుమ్మరించి నా ఆగ్రహం తీర్చుకోవాలనుకొన్నాను. 22 ✽కానీ నా చెయ్యి వెనక్కు తీశాను. నేను వాళ్ళను బయటికి తీసుకువచ్చినప్పుడు అది చూచిన జనాలమధ్య నా పేరు దూషణకు గురి కాకుండా చేశాను. 23 ✝కానీ ఇతర జనాలమధ్యకు వాళ్ళను చెదరగొట్టి వేరువేరు దేశాలలోకి వెళ్ళగొట్టివేస్తానని ఎడారిలో నేను వారికి శపథం చేసి చెప్పాను. 24 ఎందుకంటే వాళ్ళు నా న్యాయ నిర్ణయాలను అనుసరించకుండా, నా చట్టాలను అలక్ష్యం చేస్తూ, నా విశ్రాంతి దినాలను అపవిత్రపరస్తూ ఉండేవాళ్ళు. అంతేగాక, వాళ్ళ తండ్రులు పూజించిన విగ్రహాలమీద ఆశ పెట్టుకొన్నారు. 25 ✽గనుక మేలు కలిగించని చట్టాలనూ జీవం కలిగించని నియమాలనూ వాళ్ళకిచ్చాను. 26 ✽ మొదట పుట్టిన పిల్లలను మంటలద్వారా దాటించి బలులుగా అర్పించడంలో తమను అశుద్ధం చేసుకోనిచ్చాను. ఆ విధంగా వాళ్ళు నిర్ఘాంతపోయి, నేనే యెహోవానని తెలుసుకోవాలని నేనలా జరగనిచ్చాను.
27 ✽“అందుచేత, మానవపుత్రా, ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడు, వారికి ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, మీ పూర్వీకులు నాపట్ల ద్రోహం చేయడంద్వారా నన్ను దూషణకు గురి చేశారు. 28 ఇస్తానని నేను వారికి ప్రమాణం చేసి చెప్పిన దేశంలోకి నేను వారిని తీసుకు వచ్చినతరువాత, వారికి ఎత్తయిన కొండ గానీ దట్టమైన ఆకులున్న చెట్టు గానీ కనిపిస్తే అక్కడే బలులు సమర్పించేవారు, నాకు కోపం రేపే నైవేద్యాలు ఇచ్చేవారు, పరిమళ ధూపం అర్పించేవారు, పానార్పణలు చేసేవారు. 29 ‘మీరు వెళ్ళే ఎత్తయిన స్థలాలేమిటి?’ అని నేను వాళ్ళను అడిగాను (నేటివరకూ ‘ఎత్తయిన స్థలం’ అనే పేరు వాడుకలో ఉంది). 30 ✽గనుక, ఇస్రాయేల్ ప్రజలతో ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, మీ పూర్వీకులలాగే మిమ్ములను అశుద్ధం చేసుకోవడం లేదా? వాళ్ళు పెట్టుకొన్న నీచమైన విగ్రహాల విషయం మీరు వేశ్యలాగా ప్రవర్తించడం లేదా? 31 నేటివరకు మీ కొడుకులను మంటలద్వారా దాటించి బలులుగా అర్పిస్తున్నారు. మీ విగ్రహాల పూజచేత మిమ్ములను అశుద్ధం చేసుకొంటున్నారు. ఇస్రాయేల్ ప్రజలారా! నాదగ్గర మీరు విచారణ చేస్తారా? నా జీవంతోడని ఆనబెట్టి చెపుతున్నాను – నా దగ్గర మీకు ఏ సలహా దొరకదు. ఇది యెహోవాప్రభు వాక్కు. 32 ✽మీరు ఇలా చెప్పుకొంటున్నారు: ‘మేము ఇతర జనాలలాగా, లోకంలో ఉన్న ఇతర జాతులలాగా ఉండి కొయ్యలనూ రాళ్ళనూ పూజిస్తాం’. మీ హృదయంలో ఉన్న ఆశ ఎన్నటికీ నెరవేరదు.
33 ✽✝“నా జీవంతోడని ఆనబెట్టి, నేను – యెహోవాప్రభువును – చెప్పేదేమిటంటే, నా చెయ్యి చాచి నా కోపాగ్ని కుమ్మరిస్తూ, నా బలమైన హస్తంతో మీపై ప్రభుత్వం చేస్తాను. 34 మీరు చెదరిపోయిన జనాలమధ్యనుంచీ దేశాలనుంచీ మిమ్ములను సమకూరుస్తాను. నా చెయ్యి చాచి నా కోపాగ్ని కుమ్మరిస్తూ, నా బలమైన హస్తంతో అలా చేస్తాను. 35 మిమ్ములను ‘జనాల ఎడారి✽’లోకి రప్పించి అక్కడ ముఖాముఖిగా నేను మీకు తీర్పు చెపుతాను. 36 ✽ఈజిప్ట్ దేశానికి చెందిన ఎడారిలో నేను మీ పూర్వీకులకు తీర్పు చెప్పిన విధంగా మీకు తీర్పు చెపుతాను. ఇది యెహోవా వాక్కు. 37 ✽ నా చేతికర్రక్రింద మిమ్ములను దాటించి ఒడంబడిక✽కు లోపరచుకొంటాను. 38 నామీద తిరగబడ్డ ద్రోహులను మీలో లేకుండా చేస్తాను. వాళ్ళు ఉండే దేశంలో నుంచి వాళ్ళను రప్పిస్తాను గాని వాళ్ళు ఇస్రాయేల్‌దేశంలో అడుగు పెట్టరు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు.
39 ✽“ఇశ్రాయేల్ ప్రజలారా! యెహోవాప్రభువు చెప్పేది ఏమిటంటే, నా మాట వినకపోతే మీరు వెళ్ళి మీ విగ్రహాలను పూజించండి. మీ ఇష్టం. తరువాత మీరు నా మాట వినితీరుతారు. అప్పటినుంచి మీ నైవేద్యాలచేతా మీ విగ్రహాలచేతా మీరు నా పవిత్రమైన పేరును అపవిత్రం చేయరు. 40 ✽అప్పుడు ఇస్రాయేల్ ప్రజలంతా వారి దేశంలోనే నా పవిత్ర పర్వతంమీద – ఇస్రాయేల్ ఎత్తయిన పర్వతం మీద – నాకు సేవ చేస్తారు. ఇది యెహోవాప్రభు వాక్కు. అక్కడ నేను వారిని స్వీకరిస్తాను. అక్కడ మీ అర్పణలనూ మీ ప్రథమ ఫల నైవేద్యాలనూ పవిత్ర కానుకలనూ లక్ష్యం చేస్తాను. 41 మీరు చెదరిపోయిన దేశాలనుంచీ జనాల మధ్యనుంచీ నేను మిమ్ములను తీసుకువచ్చి సమకూర్చేటప్పుడు, పరిమళ ధూపంగా మిమ్ములను స్వీకరిస్తాను. ఇతర జనాల ఎదుట, మీమధ్య నన్ను పవిత్రునిగా కనుపరచుకొంటాను.
42 “ఇస్తానని నేను మీ పూర్వీకులకు ప్రమాణం చేసిన దేశానికి – ఇస్రాయేల్ దేశానికి – నేను మిమ్ములను తెచ్చినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. 43 ✽అక్కడ మీ ప్రవర్తననూ మిమ్ములను అశుద్ధం చేసిన మీ కార్యాలన్నిటినీ తలచుకొంటారు. మీరు చేసిన చెడుగు అంతటి కారణంగా మిమ్ములను మీరే అసహ్యించుకొంటారు. 44 ఇస్రాయేల్ ప్రజలారా! మీ పాపిష్టి ప్రవర్తన ప్రకారం మీ చెడ్డ అలవాట్ల ప్రకారం కాదు గాని నా పేరుప్రతిష్ఠలకోసమే నేను మీ పట్ల వ్యవహరిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. ఇది యెహోవాప్రభు వాక్కు.”
45 ✽మరోసారి యెహోవా నుంచి వాక్కు నాకు వచ్చింది: 46 “మానవపుత్రా, నీ ముఖం దక్షిణ దిక్కుకు త్రిప్పు. దక్షిణ ప్రదేశాన్ని గురించి ప్రకటన చెయ్యి. దక్షిణ ప్రదేశంలో ఉన్న అడవి ప్రాంతం విషయం దైవావేశపూర్వకంగా ఇలా చెప్పు: 47 దక్షిణ ప్రాంతం అడవి! యెహోవా వాక్కు విను! యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, నేను నీలో జ్వాల✽ రాజబెట్టి నీలో ఉన్న చెట్లన్నిటినీ – ఎండిన వాటితో పాటు పచ్చనివాటిని – కాల్చివేస్తాను. ఆ మంటలు ఆరవు. దక్షిణ దిక్కునుంచి ఉత్తర దిక్కువరకు అందరి ముఖాలు వాటిచేత మాడిపోతాయి. 48 ఆ జ్వాల రాజబెట్టినది నేను – యెహోవాను – అని అందరూ తెలుసుకొంటారు. అది ఆరదు.”
49 ✽అందుకు నేను “అయ్యో, ప్రభూ! యెహోవా! నా గురించి వాళ్ళు అంటున్నారు గదా – ‘వీడు ఎల్లప్పుడూ గూఢంగా మాట్లాడుతాడు” అన్నాను.