19
1 “నీవు ఇస్రాయేల్ ప్రజల నాయకుల విషయం ఈ విలాపమెత్తి ప్రకటించు:
2 మీ తల్లి ఎలాంటిది? సింహాలలో
ఆడ సింహంలాంటిది.
అది కొదమ సింహాలమధ్య పడుకొంది,
తన పిల్లలను పెంచింది.
3 అది పెంచిన పిల్లల్లో ఒకటి బలంగల
సింహం అయింది.
అది వేటాడడం నేర్చుకొంది.
మనుషులను దిగమ్రింగింది.
4 దాని గురించి జనాలకు వినబడింది.
దాన్ని తాము త్రవ్వించిన గోతిలో
పట్టుకొన్నారు.
గాలాలు తగిలించి దాన్ని ఈజిప్ట్‌కు
తీసుకుపోయారు.
5 “తల్లికి దాని గురించిన ఆశ అంతా పోయింది.
అది గ్రహించి తన పిల్లల్లో మరో పిల్లను తీసుకొంది,
పెంచింది, బలంగల సింహంగా చేసింది.
6 అది బలమైన సింహం కావడంచేత
సింహాల మధ్య తిరుగులాడింది.
అది వేటాడడం నేర్చుకొంది.
మనుషులను దిగమ్రింగింది.
7 అది వాళ్ళ నగరులను పడగొట్టింది.
వాళ్ళ పట్టణాలను పాడు చేసింది.
దాని గర్జన ధ్వనికి దేశమూ అందులో
ఉన్నవాళ్ళంతా భయకంపితులయ్యారు.
8 చుట్టూరా ఉన్న జనాలన్నీ దానికి
వ్యతిరేకంగా వచ్చాయి.
దానిమీద తమ వల వేశాయి.
తాము త్రవ్వించిన గోతిలో దాన్ని పట్టుకొన్నారు.
9 వాళ్ళు దానికి గాలాలు తగిలించి
బోనులోకి లాగారు.
బబులోనురాజు దగ్గరికి తెచ్చారు.
ఇస్రాయేల్ కొండలమీద దాని గర్జన
ఇక వినబడకుండా దాన్ని అక్కడ
భద్రంగా ఉంచారు.
10 “ప్రాణాధారమైన ద్రాక్ష చెట్టులాంటిది మీ తల్లి.
కాలువ దగ్గరే నాటబడింది.
నీళ్ళ సమృద్ధిచేత తీగెలతో నిండింది.
చాలా ఫలభరితమైంది.
11 దాని కొమ్మలు గట్టివి.
అవి రాజదండాలకు తగినవి.
ఆ చెట్టు మేఘాలవరకు పెరిగింది.
దాని ఎత్తు, అనేక కొమ్మల కారణంగా
అది సుస్పష్టంగా కనిపించేది.
12 అయితే అది ఆగ్రహానికి గురి అయింది.
దానిని పెరికివేసి నేలకు పడవేయడం జరిగింది.
దాని పండ్లన్నీ తూర్పుగాలికి ఎండాయి.
దాని గట్టి కొమ్మలు తెగి ఎండి పోయాయి.
మంటలు వాటిని కాల్చివేశాయి.
13 ఇప్పుడది ఎడారిలో, చాలా ఎండిన
నిర్జల ప్రదేశంలో నాటి ఉంది.
14 దాని కొమ్మలలో ఒకదానినుంచి మంట వచ్చి
దాని పండ్లను కాల్చింది.
రాజదండానికి తగిన గట్టి కొమ్మ
ఒక్కటి కూడా మిగలలేదు.
“ఇది విలాపం. విలాపంగా వాడుకలో రావాలి.”