18
1 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 ✽ “మీరు ఇలా అంటారు గదా, ‘తండ్రులు పుల్లని ద్రాక్షకాయలు తిన్నారు, పిల్లల పళ్ళు పులిశాయి’ అని. ఆ సామెత ఇస్రాయేల్ దేశాన్ని గురించి చెపుతున్నారేమిటి? 3 మీరు ఇకనుంచి ఇస్రాయేల్‌లో ఆ సామెత చెప్పరని నా జీవంతోడు నేనే – యెహోవాప్రభువును – పలుకుతున్నాను. 4 ✽అందరూ నా స్వాధీనంలో ఉన్నారు. తండ్రులూ కొడుకులూ అందరూ నా స్వాధీనంలో ఉన్నారు. ఎవడైతే అపరాధం చేస్తాడో వాడే చస్తాడు.5 ✽“న్యాయవంతుడొకడు ఉన్నాడు. అతడు నీతి న్యాయాలను అనుసరిస్తాడు. 6 ✽కొండలమీద✽ భోం చేయకుండా, ఇస్రాయేల్‌ప్రజలు పెట్టుకొన్న విగ్రహాలవైపు చూడకుండా ఉంటాడు. పొరుగువాడి భార్యను పాడు చేయడు. రుతు కాలంలో ఉన్న స్త్రీతో శయనించడు. 7 ✝✽ఎవరినీ బాధించడు గాని అప్పు తీసుకున్నవాడికి తాకట్టు మళ్ళీ ఇస్తాడు. ఎవరి వస్తువులనూ దోచుకోడు. ఆకలి ఉన్నవారికి ఆహారం, బట్టలు లేనివారికి బట్టలు ఇస్తాడు. 8 ✝వడ్డీకి అప్పివ్వడు, అప్పివ్వడంవల్ల లాభమేమీ చేకూర్చుకోడు. అన్యాయం చేయడు, పక్షపాతం లేకుండా అందరిపట్ల న్యాయం జరిగిస్తాడు. 9 ✝అతడు నమ్మకంగా నా చట్టాలను పాటిస్తూ, నా న్యాయ నిర్ణయాలను అనుసరిస్తూ ఉంటాడు. అలాంటివాడు న్యాయవంతుడు. అతడు తప్పనిసరిగా బ్రతుకుతాడు. ఇది యెహోవా వాక్కు.
10 ✽“ఆ న్యాయవంతునికి పుట్టిన కొడుకు దౌర్జన్యం, హత్య చేసేవాడనుకోండి. చేయవలసినవాటిలో దేనిని చేయక, చేయరానివాటిలో దేనినైనా చేస్తాడనుకోండి. 11 కొండలమీద భోం చేస్తాడు. పొరుగువాడి భార్యను అశుద్ధం చేస్తాడు. 12 దీనావస్థలో అక్కరలో ఉన్నవారిని బాధిస్తాడు, దోచుకొంటాడు. తాకట్టు మళ్ళీ ఇవ్వకుండా ఉంటాడు. విగ్రహాల వైపు చూస్తాడు. అసహ్య కార్యాలు చేస్తాడు. 13 వడ్డీకి అప్పిస్తాడు. అప్పివ్వడంవల్ల లాభం చేకూర్చుకొంటాడు. అలాంటివాడు బ్రతుకుతాడా? బ్రతకడు! ఆ అసహ్యకరమైన కార్యాలన్నీ చేసినందుచేత వాడు తప్పకుండా మరణశిక్షకు గురి అవుతాడు. వాడి మృతికి వాడే బాధ్యుడు.
14 ✽“అయితే ఆ కొడుకుకు పుట్టిన కొడుకు తన తండ్రి చేసిన పాపాలన్నీ చూచినా అలాంటివాటిని చేయకుండా ఉంటాడనుకోండి. 15 కొండలమీద భోం చేయడు. ఇస్రాయేల్‌ప్రజలు పెట్టుకొన్న విగ్రహాలవైపు చూడడు. పొరుగువాడి భార్యను అశుద్ధం చేయడు. 16 ఎవరినీ బాధించడు, తాకట్టు ఉంచుకోడు, దోచుకోడు. ఆకలి ఉన్నవారికి ఆహారం, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తాడు. 17 బీదవారిమీద అన్యాయంగా చెయ్యి వేయడు. వడ్డీకి అప్పియ్యడు. అప్పివ్వడంవల్ల లాభం చేకూర్చుకోడు. నా న్యాయనిర్ణయాలను అనుసరిస్తూ, నా చట్టాలను పాటిస్తూ ఉంటాడు. తన తండ్రి చేసిన అపరాధాల కారణంగా అలాంటివాడు చావడు. అతడు తప్పక బ్రతుకుతాడు. 18 కాని, అతడి తండ్రి దౌర్జన్యపరుడై పొరుగువాని వస్తువులను దోచుకొంటూ, తన ప్రజలమధ్య చెడుగు చేస్తూ ఉండేవాడు గనుక తాను చేసిన అపరాధాల కారణంగా వాడే చస్తాడు.
19 “అయితే మీరు ‘తండ్రి చేసిన అపరాధంచేత కొడుకు ఎందుకు శిక్షకు గురి కాడు?’ అని అడుగుతారు. కొడుకు నీతిన్యాయాలను అనుసరిస్తూ నా చట్టాలన్నిటినీ పాటిస్తూ అనుసరిస్తూ ఉన్నాడు గనుక అతడు తప్పనిసరిగా బ్రతుకుతాడు. 20 అపరాధం చేస్తూ ఉండేవాడే చస్తాడు. తండ్రి అపరాధం కారణంగా కొడుకు శిక్షకు గురి కాడు. కొడుకు కారణంగా తండ్రి శిక్షకు గురి కాడు. న్యాయవంతుడి న్యాయప్రవర్తన అతడికే చెందుతుంది, దుర్మార్గుడి దుర్మార్గం అతడికే చెందుతుంది.
21 ✽“అయితే దుర్మార్గుడు తాను చేసిన అపరాధాలన్నిటినీ వదలిపెట్టి నా చట్టాలన్నిటినీ అనుసరించి నీతిన్యాయాల ప్రకారం ప్రవర్తిస్తే, అతడు తప్పనిసరిగా బ్రతుకుతాడు. అతడు చావడు. 22 అతడు చేసిన అపరాధాలలో ఒకటి కూడా జ్ఞప్తికి రాదు. అతడి న్యాయ ప్రవర్తన కారణంగా బ్రతుకుతాడు. 23 ✽ దుర్మార్గుడు చస్తే నాకేమైనా సంతోషం కలుగుతుందా? నాకు సంతోషం కలిగించేదేమిటంటే, దుర్మార్గులు తమ దుర్మార్గాలను వదలిపెట్టి బ్రతకడమే గదా. ఇది యెహోవాప్రభువు వాక్కు. 24 ✽న్యాయవంతుడు నీతిన్యాయాలను వదలివేసి అపరాధి అయి, దుర్మార్గులు చేసే అసహ్యకార్యాలను చేస్తూ ఉంటే అతడు బ్రతుకుతాడా? మునుపు నీతిన్యాయాలను అనుసరించి చేసిన క్రియలు నా జ్ఞప్తికి రావు. అతడు ద్రోహి అయి చేసిన అపరాధాల కారణంగా చస్తాడు.
25 ✽ “అయినా, మీరు ‘యెహోవా విధానం న్యాయం కాదు’ అంటారు. ఇస్రాయేల్ ప్రజలారా, నేను చెప్పేది వినండి! నా విధానం న్యాయం కాదా? అన్యాయ విధానాలు మీవే గదా. 26 ✽న్యాయవంతుడు నీతిన్యాయాలను వదలివేసి అక్రమం చేస్తూ ఉంటే, అతడు దానికారణంగా చస్తాడు. అతడు చేసిన అక్రమాల కారణంగానే చస్తాడు. 27 దుర్మార్గుడు తాను చేస్తూ వచ్చిన చెడుగును విసర్జించి నీతిన్యాయాల ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటే, అతడు ప్రాణం దక్కించుకొంటాడు. 28 తాను చేస్తూ వచ్చిన అతిక్రమాలన్నిటి విషయం ఆలోచించి వాటిని విసర్జించడం కారణంగా అతడు తప్పనిసరిగా బ్రతుకుతాడు. అతడు చావడు. 29 అయినా, ఇస్రాయేల్‌ప్రజలు ‘యెహోవా విధానం న్యాయం కాదు’ అంటారు. ఇస్రాయేల్‌ప్రజలారా, నా విధానం న్యాయసమ్మతం కాదా? అన్యాయ విధానాలు మీవే గదా. 30 ✽అందుచేత, ఇస్రాయేల్ ప్రజలారా, నేను ప్రతివాడికీ అతడి ప్రవర్తన ప్రకారం తీర్పు తీరుస్తాను. ఇది యెహోవా వాక్కు.
“నావైపు తిరగండి! మీ అక్రమాలన్నిటినీ విడిచిపెట్టండి! అప్పుడు వాటివల్ల మీరు పడిపోరు✽. 31 ✽మీరు చేసిన అక్రమాలన్నిటినీ విసర్జించి క్రొత్త హృదయాన్నీ క్రొత్త మనసునూ కలిగించుకోండి. ఇస్రాయేల్‌ప్రజలారా! మీరెందుకు చస్తారు? 32 ✽ ఎవడైనా చస్తే అతడి చావు విషయం నాకేమీ సంతోషం కలగదు. గనుక నావైపు తిరిగి, బ్రతకండి! ఇది యెహోవా వాక్కు.