17
1 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 “మానవపుత్రా, ఉదాహరణంగా ఒక పొడుపు కథ ఇస్రాయేల్ ప్రజలకు ఇలా చెప్పు: 3 యెహోవా చెప్పేదేమిటంటే, ఒక గొప్ప గరుడపక్షికి పొడుగైన పెద్ద రెక్కలూ వేరువేరు రంగుల దట్టమైన ఈకెలూ ఉన్నాయి. అది లెబానోను పర్వత ప్రదేశానికి వచ్చి ఒక దేవదారు చెట్టు పై కొమ్మను పట్టుకొంది. 4 దాని లేత రెమ్మలను త్రుంచి వర్తకుల దేశానికి తీసుకుపోయింది. వ్యాపారస్థులున్న పట్టణంలో ఆ రెమ్మలను నాటింది. 5 ఆ పక్షి మీ దేశం విత్తనాలలో కొన్ని తీసుకుపోయి సారవంతమైన భూమిలో వేసింది. నీళ్ళు సమృద్ధిగా ఉన్న స్థలంలో నిరవంజి చెట్టును నాటినవిధంగా ఆ విత్తనాలు నాటింది. 6 అవి అంకురించి పైకి ఎక్కువ పెరగకుండా వ్యాపిస్తూ ఉన్న ద్రాక్షచెట్టు అయ్యాయి. ఆ చెట్టు కొమ్మలు ఆ పక్షివైపుకు తిరిగి, పెరిగాయి. దాని వేళ్ళు దానిక్రింద ఉన్నాయి. ఆ విధంగా అది ద్రాక్ష చెట్టయి రెమ్మలూ కొమ్మలూ వేస్తూ వచ్చింది.
7 “ఇంకో గొప్ప గరుడపక్షి ఉండేది. దానికి కూడా పెద్ద రెక్కలూ దట్టమైన ఈకెలూ ఉన్నాయి. ఉన్నట్టుండి ఆ ద్రాక్షచెట్టు నీళ్ళకోసం తానున్న స్థలంనుంచి తన వేళ్ళనూ కొమ్మలనూ ఆ పక్షివైపుకు త్రిప్పుకొంది. 8 అయితే అది కొమ్మలు వేసి బాగా ఫలించే మంచి చెట్టయ్యేలా నీళ్ళు సమృద్ధిగా ఉన్న మంచి భూమిలో నాటబడింది. 9 గనుక ఇలా చెప్పు – యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఆ ద్రాక్షచెట్టు వర్ధిల్లుతుందా? దాని వేళ్ళను పెరికి దాని పండ్లు కోసివేయడమూ అది ఎండిపోవడమూ జరగదా? దాని చిగుళ్ళన్నీ ఎండిపోవా? దాన్ని పెళ్ళగించడానికి చాలామంది కావాలని కాదు, బలమైన హస్తం కూడా అనవసరం. 10 ఒకవేళ దాన్ని మళ్ళీ నాటినా అది వర్ధిల్లుతుందా? తూర్పుగాలి దానిమీద విసిరేటప్పుడు అది పూర్తిగా ఎండిపోదా? అది నాటి ఉన్న భూమిలోనే తప్పక ఎండిపోతుంది.”
11 అప్పుడు యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 12 “తిరుగుబాటు చేసే ఈ ప్రజతో నీవు చెప్పవలసినది ఏమిటంటే, ఆ సంగతుల భావమేమిటో మీకు తెలియదా? ఇదిగో వినండి, బబులోనురాజు జెరుసలంకు వెళ్ళి దాని రాజునూ అధిపతులనూ పట్టుకొని బబులోను పట్టణానికి వెంటబెట్టుకుపోయాడు. 13 రాజవంశంలో ఒకణ్ణి ఎన్నుకొని అతడితో సంధి చేసి అతడిచేత శపథం చేయించాడు. 14 యూదా రాజ్యం హీనదశలో ఉండి, అభివృద్ధి చెందలేక, ఆ సంధి పాటించడం మూలంగానే నిలిచి ఉండాలని దేశంలో ఉన్న గొప్పవాళ్ళను కూడా బబులోనురాజు తీసుకుపోయాడు. 15 అయితే ఆ రాజు అతడిమీద తిరుగుబాటు చేశాడు. ఎలాగంటే ఈజిప్ట్ దేశంవాళ్ళు గుర్రాలనూ మహా సైన్యాన్నీ ఇచ్చి సహాయం చేయాలని అతడు అక్కడికి రాయబారం పంపాడు. ఆ ప్రయత్నం సఫలం అవుతుందా? అలాంటి చర్యలు చేసేవాడు తప్పించుకొంటాడా? అతడు సంధి భంగం చేసి, తప్పించుకోగలడా?
16 “అతడు బబులోనులోనే – ఎవరిచేత అతడు సింహాసనం ఎక్కాడో, ఎవరి విషయం శపథాన్ని తృణీకరించాడో, ఎవరి సంధి భంగం చేశాడో ఆ రాజు దేశంలోనే చస్తాడు. అలా జరుగుతుందని నా జీవంతోడు నేను – యెహోవా ప్రభువును – చెపుతున్నాను. 17 యుద్ధకాలంలో, బబులోనువాళ్ళు చాలామందిని చంపడానికి మట్టిదిబ్బలు వేసి బురుజులు కట్టే సమయాన, ఫరో ఎంత బలంతో, ఎంత గొప్ప సైన్యంతో వచ్చినా అతడికి ఏమీ సహాయం చేయలేకపోతాడు. 18 శపథం తృణీకరించి సంధి భంగం చేశాడు, ప్రమాణానికి గుర్తుగా చేతులు కలిపిన తరువాత అతడు అలా ప్రవర్తించాడు గనుక తప్పించుకోడు.
19 “ఇందుకు యెహోవాప్రభువు ఇలా అంటున్నాడు: అతడు నా ప్రమాణం తృణీకరించి నా ఒడంబడిక భంగం చేశాడు. నా జీవంతోడు నేను ఆ దోషానికి తగిన శిక్ష అతడి నెత్తిమీదికి రప్పిస్తాను. 20 అతణ్ణి పట్టుకోవడానికి నా వల పన్ని దానిలో అతణ్ణి చిక్కించుకొని బబులోనుకు తెప్పిస్తాను. నాపట్ల అతడు చేసిన ద్రోహం కారణంగా అక్కడే అతణ్ణి శిక్షిస్తాను. 21 అతడి సైనికులంతా పారిపోతూ ఉన్నప్పుడు కత్తిచేత కూలుతారు. మిగతావారు నలుదిక్కులకు చెదరిపోతారు. అప్పుడు నేను – యెహోవాను – ఈ మాటలు పలికానని మీరు తెలుసుకొంటారు.”
22 యెహోవాప్రభువు ఇలా చెపుతున్నాడు, “ఎత్తయిన దేవదారు చెట్టు పైకొమ్మలలో లేత కొమ్మను తీసి దాన్ని నాటుతాను. పైగా ఉన్నదాని లేత రెమ్మలలో ఒకదాన్ని త్రుంచి ఎత్తయిన మహా పర్వతంమీద దాన్ని నాటుతాను. 23 ఇస్రాయేల్‌దేశంలో ఉన్న ఎత్తయిన పర్వతం మీద దాన్ని నాటుతాను. అది కొమ్మలు వేసి ఫలించి శ్రేష్ఠమైన దేవదారు చెట్టవుతుంది. అన్ని రకాల పక్షులు దానిలో గూళ్ళు కట్టుకొంటాయి. దాని కొమ్మల నీడలో వాటికి ఉనికిపట్టు దొరుకుతుంది. 24 నేను – యెహోవాను – ఎత్తయిన చెట్టును క్రిందికి కూలుస్తాననీ పొట్టి చెట్టు ఎత్తుగా పెరిగేలా చేస్తాననీ, పచ్చని చెట్టును ఎండిపోయేలా చేస్తాననీ, ఎండినచెట్టు వికసించేలా చేస్తాననీ పచ్చిక మైదానాలలో ఉన్న చెట్లన్నీ తెలుసుకొంటాయి. నేను – యెహోవాను – ఈ మాటలు పలికాను. నేనే వాటిప్రకారం జరిగిస్తాను.”