16
1 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 “మానవపుత్రా, జెరుసలంకు దాని అసహ్యకరమైన పనులను తెలియజేస్తూ ఇలా చెప్పు: 3 యెహోవాప్రభువు జెరుసలంకు చెప్పేదేమిటంటే, నీ ఉత్పత్తి, నీ జన్మం కనానువాళ్ళ దేశానికి చెందినవే. నీ తండ్రి అమోరీ జాతివాడు, నీ తల్లి హిత్తిజాతి స్త్రీ. 4 నీ పుట్టుక చూస్తే, నీవు జన్మించిన రోజు నీ బొడ్డును కోయడం జరగలేదు. నిన్ను శుభ్రం చేయడానికి నీళ్ళతో కడగడం జరగలేదు. నీకు ఉప్పు రాయడమూ బట్ట చుట్టడమూ జరగలేదు. 5 నిన్ను ఎవరూ దయ చూడలేదు. ఆ పనులలో ఒకటైనా నీకు చేయాలని ఎవరికీ జాలి వేయలేదు. నీవు పుట్టిన రోజు నిరాకరణకు గురి అయ్యావు. బయట నేలను పారవేయబడ్డావు నీవు.
6 “అప్పుడు నేను ఆ వైపుకు వచ్చి నీ రక్తంలో పడి తన్నుకొంటూ ఉన్న నిన్ను చూశాను. నీ రక్తంలో పడి ఉన్న నీతో ‘బ్రతుకు!’ అన్నాను. నీవు నీ రక్తంలో ఇంకా పడి ఉన్నప్పుడు ‘బ్రతుకు!’ అన్నాను. 7 పొలంలో ఉన్న మొక్క ఎదిగే విధంగా నీవు ఎదిగేలా నేను చేశాను. నీవు పెరిగి పెద్దదానివయ్యావు. ఆభరణాలతో అలంకరించుకోవడం మొదలుపెట్టావు. నీకు స్తనాలు ఏర్పడ్డాయి, నీ తలవెంట్రుకలు పెరిగాయి. అయినా, నీకు బట్టలు లేవు. దిగంబరంగా ఉన్నావు. 8 నేను మళ్ళీ ఆ వైపుకు వచ్చి ప్రేమకు తగిన వయసు నీకు ఉండడం చూశాను. అందుచేత నా వస్త్రం చెంగుతో నీ దిగంబరత్వాన్ని కప్పి నీతో వివాహ నిబంధన చేసుకొని నీతో శపథం చేసుకొన్నాను. నీవు నా దానివయ్యావు.
9 “నేను నీకు నీళ్ళతో స్నానం చేయించి, నీమీద ఉన్న రక్తం కడిగి నిన్ను నూనెతో అంటి ఉన్నాను. 10 బుట్టా వేసిన వస్త్రం, సున్నితమైన తోలు చెప్పులు నీకు తొడిగించాను. శ్రేష్ఠమైన బట్టలు, పట్టుబట్టలు నీకు వేయించాను. 11 అభరణాలతో నిన్ను అలంకరించాను. నీ చేతులకు కడియాలు పెట్టి నీకు కంఠభూషణం తగిలించి 12 నీ చెవులకూ ముక్కుకూ నగలు, నీ తలకు అందమైన కిరీటం పెట్టాను. 13 ఆ విధంగా నీవు వెండి బంగారాలతో అలంకరించబడ్డావు. నీ వస్త్రాలు శ్రేష్ఠమైన బట్ట, పట్టుబట్ట, బుట్టాలు వేసిన బట్ట. నీ ఆహారం సన్నని గోధుమ పిండి, తేనె, ఆలీవ్‌నూనె. నీవు చాలా అందకత్తెవయ్యావు, రాణివయ్యావు. 14 నేను నీకు ప్రసాదించిన నా శోభకారణంగా నీ అందానికి లోపం లేకపోయింది గనుక నీ అందాన్ని గురించిన కీర్తి వేరువేరు దేశాలకు వ్యాపిస్తూ వచ్చింది. ఇది యెహోవాప్రభు వాక్కు.
15 “అయితే నీవు నీ అందంమీద నమ్మకం ఉంచి నీ కీర్తిని ఆధారం చేసుకొని వేశ్యవయ్యావు. దారిన పొయ్యేవాళ్ళందరితో మస్తుగా వ్యభిచారం చేస్తూ వచ్చావు. ఎవడు పిలిస్తే వాడితో పోయావు. 16 నీ బట్టలలో కొన్ని తీసి వాటితో చిత్రవిచిత్రమైన ఎత్తయిన పూజాస్థలాలను చేసుకొన్నావు. వాటిమీద వేశ్యలాగా ప్రవర్తించావు. అలాంటి పనులు ఎంతమాత్రం తగవు. అవి ఎన్నడూ జరగకూడదు.
17 “నేను నీకిచ్చిన అందమైన ఆభరణాల వెండి బంగారాలను తీసుకొని పురుష రూప విగ్రహాలను చేసుకొని వాటితో వేశ్యలాగా ప్రవర్తించావు. 18 బుట్టాలు వేసిన నీ బట్టలను తీసి ఆ విగ్రహాలకు తొడిగించావు. నా నూనె, నా ధూపం వాటికి అర్పించావు. 19 తినడానికి నేను నీకిచ్చిన ఆహారం – ఆ సన్నని గోధుమపిండి, ఆలీవ్‌నూనె, తేనె – పరిమళ నైవేద్యంగా ఆ విగ్రహాలకు అర్పించావు. అలాగే జరిగింది గదా. ఇది యెహోవాప్రభు వాక్కు.
20 “అంతేకాదు. నీవు నాకు కన్న కొడుకులనూ కూతుళ్ళనూ ఆహారంగా ఆ విగ్రహాలకు బలి చేశావు. నీవు వేశ్యగా ప్రవర్తించడం చాలదనుకొన్నావా? 21 నా పిల్లలను వధించి బలిగా ఆ విగ్రహాలకు అర్పించావు! 22 నీవు వ్యభిచారం చేస్తూ, నీ అసహ్యమైన పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు, నీకు నీ బాల్యం జ్ఞప్తికి రాలేదు. బట్టలేమీ లేక దిగంబరంగా ఉండి, నీ రక్తంలో తన్నుకొంటూ ఉన్న సంగతి మరిచిపోయావు.
23 “నీకు బాధ తప్పదు. ఇది యెహోవాప్రభు వాక్కు. నీకు బాధ తప్పదు. నీ చెడుతనమంతటితో మరొకటి కలిపావు. 24 ప్రతి నడివీధి ప్రక్కన మట్టిదిబ్బ వేసి, ఆ ఎత్తయిన పూజా స్థలాలను కట్టావు. 25 ప్రతి అడ్డత్రోవను నీ దైవపీఠాలను కట్టి నీ అందాన్ని అవమానపరచుకొని ఆ వైపుకు వచ్చే ప్రతివాడితో పడుకొన్నావు. నీ పడుపు పనులు మరీ మరీ ఎక్కువవుతూ వచ్చాయి. 26 ఈజిప్ట్‌వాళ్ళతో, అధిక కామాతురత ఉన్న ఆ నీ పొరుగువాళ్ళతో నీవు వ్యభిచారం చేశావు. మరీ ఎక్కువ అవుతూ ఉన్న నీ పడుపు పనులతో నాకు కోపం రేపావు. 27 అందుచేత నేను నీకు వ్యతిరేకంగా నా చెయ్యి చాపి, నీ జీవనోపాధిని తక్కువ చేశాను. నిన్ను ద్వేషించిన ఫిలిష్తీయదేశ స్త్రీల చేతికి నిన్ను ఇచ్చాను. నీ పోకిరి పనులంటే వాళ్ళకు సిగ్గనిపించింది. 28 ఇంకా తృప్తిపడక నీవు అష్షూరువాళ్ళతో కూడా వ్యభిచారం చేశావు. వాళ్ళతో వ్యభిచరించినా నీకు తృప్తి కలగలేదు. 29 తరువాత వర్తకుల దేశమైన కల్దీయ దేశం వాళ్ళతో అధికంగా వ్యభిచరించావు. అయినా నీకు తృప్తి కలగలేదు.
30 “సిగ్గుమాలిన వేశ్యలాగా ప్రవర్తిస్తూ, ఆ కార్యాలన్నీ చేస్తూ ఉంటే నీ హృదయం ఎంత నీరసంగా ఉంది! ఇది యెహోవాప్రభు వాక్కు. 31 నీవు ప్రతి అడ్డత్రోవను మట్టిదిబ్బ వేసి ప్రతి నడివీధిప్రక్కన ఎత్తుగా దైవపీఠం కట్టినప్పుడు ఒక విషయంలో వేశ్యలాంటిదానివి కావు – నీవు జీతం తిరస్కరించావు. 32 నీవు వ్యభిచరించే భార్యలాగా ఉన్నావు. అలాంటి భార్య భర్తకు బదులుగా పరాయివాళ్ళను స్వీకరిస్తుంది గదా. 33 ప్రతి వేశ్య పురుషులిచ్చే పడుపుసొమ్ము తీసుకొంటుంది గదా. నీవైతే నీ విటులందరికీ సొమ్ము ఇస్తున్నావు. వ్యభిచారం కోసం నలుదిక్కులనుంచి రావాలని వాళ్ళకు బహుమతులు ఇస్తున్నావు. 34 నీ పడుపుపనులలో నీకూ ఇతర వేశ్యలకూ మధ్య ఉన్న భేదం అదే. వ్యభిచరించడానికి ఎవ్వడూ నీ వెంట తిరగడం లేదు, నీకు పడుపుసొమ్ము ఇవ్వడం లేదు గాని నీవే జీతం ఇస్తున్నావు. నీకూ ఇతర వేశ్యలకూ మధ్య ఉన్న భేదం ఇదే.
35 “కాబట్టి, వేశ్యా, యెహోవా వాక్కు విను. 36 యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, నీ విటులతో చేసిన పడుపు పనులలో నీ సొమ్ము వ్యయపరచి నీ దిగంబరత్వాన్ని కనపరచిన కారణంగా, నీ అసహ్యమైన విగ్రహాల కారణంగా, ఆ విగ్రహాలకు నీ పిల్లల రక్తం అర్పించడం కారణంగా నేను ఇలా చేస్తాను: 37 నీవు ఎవరితో సుఖించావో ఆ నీ విటులందరినీ సమకూరుస్తాను. నీవు ప్రేమించినవాళ్ళతోపాటు నీవు ద్వేషించినవాళ్ళను అందరినీ పోగు చేస్తాను. నీకు వ్యతిరేకంగా వాళ్ళను సమకూర్చి, వాళ్ళ ఎదుట నీ బట్టలు తీసివేసి నీ దిగంబరత్వాన్ని వాళ్ళకు కనపరుస్తాను. 38 వ్యభిచారం చేసిన స్త్రీలకూ హత్యచేసిన స్త్రీలకూ రావలసిన దండన నీకు విధిస్తాను. నీపట్ల రోషం, కోపాగ్ని, రక్తపాతం నియమిస్తాను. 39 వాళ్ళ చేతికి నిన్ను అప్పగిస్తాను. వాళ్ళు ఈ మట్టిదిబ్బలు నేలమట్టం చేసి, నీ ఎత్తయిన పూజాస్థలాలను పడగొట్టి నీ బట్టలూ అందమైన ఆభరణాలూ తీసుకొని నిన్ను దిగంబరంగా, ఏ వస్త్రమూ లేనిదానినిగా చేస్తారు. 40 వాళ్ళు నీమీదికి మూకను పురికొలిపి నిన్ను రాళ్ళతో కొట్టి ఖడ్గాలతో ముక్కలు ముక్కలుగా కోసివేస్తారు. 41 వాళ్ళు నీ ఇండ్లను కాల్చివేసి అనేక స్త్రీల కళ్ళెదుటే నిన్ను దండిస్తారు. నీవు ఇంకా వేశ్యగా ప్రవర్తించకుండా అవుతావు. విటులకు నీవు ఇకనుంచి సొమ్ము ఇవ్వవు.
42 “అప్పుడు నీమీద ఉన్న నా కోపాగ్ని చల్లారిపోతుంది. నీపట్ల ఉన్న నా రోషం లేకుండా పోతుంది. అప్పటినుంచి నీమీద కోపపడను. ప్రశాంతంగా ఉంటాను. 43 నీ బాల్యాన్ని గురించి తలచుకోకుండా నీవు చేసినవాటన్నిటిచేతా నాకు కోపం రేపుతూ వచ్చావు గనుక నీ క్రియల ఫలం నీవు అనుభవించేలా చేస్తాను. ఇది యెహోవాప్రభు వాక్కు. నీ అసహ్యమైన అలవాట్లన్నిటితోనూ నీవు ఆ పోకిరీ పనులను కలిపావు గదా.
44 “సామెతలు చెప్పే ప్రతి ఒక్కరూ నిన్ను గురించి ‘తల్లిలాగే పిల్ల’ అనే సామెత చెపుతారు. 45 నీ తల్లి తన భర్తనూ పిల్లలనూ తృణీకరించింది. నీవు ఆమెకు వాస్తవమైన కూతురువు. నీ అక్క చెల్లెండ్రు తమ భర్తలనూ పిల్లలనూ తృణీకరించారు. నీవు వాళ్ళకు వాస్తవమైన సోదరివి. నీ తల్లి హిత్తిజాతికి చెందినది. నీ తండ్రి అమోరీవాడు. 46 నీ అక్క ఉత్తరదిక్కున తన కూతుళ్ళతోపాటు ఉన్న షోమ్రోను. నీ చెల్లెలు దక్షిణ దిక్కున తన కూతుళ్ళతోపాటు ఉన్న సొదొమ, 47 ఆ నీ అక్క చెల్లెండ్ర త్రోవలలో నడవడమూ వాళ్ళ అసహ్యమైన క్రియలప్రకారం చేయడమూ చిన్న సంగతి అనుకొని నీవు అన్నిట్లోనూ వాళ్ళకంటే నీచంగా ప్రవర్తించావు. 48 నీవూ నీ కూతుళ్ళూ చేసినట్లు నీ చెల్లెలు సొదొమ, దాని కూతుళ్ళు చేయలేదని నా జీవంతోడు చెపుతున్నావు. ఇది యెహోవాప్రభు వాక్కు.
49 “నీ చెల్లెలు సొదొమ అపరాధం ఏమిటంటే, దానికీ దాని కూతుళ్ళకూ ఉన్న గర్వం, తిండిబోతుతనం, సోమరితనం. అది దీనావస్థలో ఉన్నవారికీ దరిద్రులకూ సహాయం చేయలేదు. 50 వాళ్ళు విర్రవీగుతూ, నా ఎదుట అసహ్యమైన కార్యాలు చేస్తూ వచ్చారు, గనుక నేను ఇది చూచి వాళ్ళను తొలగించాను. 51 షోమ్రోను కూడా నీ పాపాలలో సగమైనా చేయలేదు. వాళ్ళకంటే నీవు ఎన్నో ఎక్కువ అసహ్యమైన కార్యాలు చేశావు. నీ అసహ్య కార్యాలన్నీ చూస్తే నీ అక్కచెల్లెండ్రు నిర్దోషుల్లాగా కనిపిస్తున్నారు! 52 వాళ్ళకంటే నీవు ఎక్కువ అసహ్యకరమైన కార్యాలు చేసినందుచేత వాళ్ళు నీకంటే మంచివాళ్ళని తీర్పు తీర్చినట్టున్నావు! కాబట్టి నీవు నిందలపాలవుతావు. నీ కారణంగా వాళ్ళు నిర్దోషులుగా కనిపించడంవల్ల నీవు సిగ్గుకూ నిందలకూ గురి అవుతావు.
53 “నేను సొదొమనూ దాని కూతుళ్ళనూ, షోమ్రోనునూ దాని కూతుళ్ళనూ పూర్వక్షేమస్థితికి తెస్తాను. 54 నీవు చేసినవాటన్నిటి మూలంగా వాళ్ళకు ఆదరణ కలిగించినందుచేత నీవు సిగ్గుకూ నిందలకూ గురి అయ్యేలా వాళ్ళతోకూడా నిన్ను పూర్వక్షేమస్థితికి తెస్తాను. 55 నీ అక్కచెల్లెండ్రు – సొదొమ, దాని కూతుళ్ళు, షోమ్రోను, దాని కూతుళ్ళు – ముందున్న స్థితికి వచ్చినప్పుడు నీవూ నీ కూతుళ్ళూ కూడా ముందున్న స్థితికి వస్తారు. 56 నీ చెడుతనం వెల్లడి కాకముందు, నీవు ఇంకా గర్విస్తూ ఉన్న రోజుల్లో నీ చెల్లెలు సొదొమ పేరు చెప్పడానికైనా నీకు ఇష్టం లేదు. 57 ఇప్పుడు నిన్ను తృణీకరించే ఫిలిష్తీయవాళ్ళ కూతుళ్ళూ సిరియావాళ్ళ కూతుళ్ళూ – నీ చుట్టు ఉన్న వాళ్ళంతా – నిన్ను తిరస్కరిస్తున్నారు. 58 నీ పోకిరి పనులవల్లా నీ అసహ్యకరమైన అలవాట్లవల్లా కలిగే ఫలితం నీవు అనుభవిస్తున్నావు. ఇది యెహోవా వాక్కు.
59 “యెహోవాప్రభువు ఇలా చెపుతున్నాడు: నీవు నీ ప్రమాణం అలక్ష్యం చేసి నా ఒడంబడికను మీరావు. అందుచేత నీకు తగినట్టే నీపట్ల వ్యవహరిస్తాను. 60 అయినా, నీ బాల్యంలో నేను నీతో చేసిన ఒడంబడిక తలచుకొని ఎప్పటికీ నిలిచి ఉండే ఒడంబడిక నీతో చేసి సుస్థిరం చేస్తాను. 61 నీ అక్క చెల్లెండ్రు ఆ ఒడంబడికలో పాలిభాగస్థులు కాకపోయినా, నేను వాళ్ళను నీకు కూతుళ్ళుగా ఇస్తాను. నీవు వాళ్ళను చేర్చుకొనేటప్పుడు నీ ప్రవర్తన జ్ఞాపకం చేసుకొని సిగ్గుపాలవుతావు. 62 అయితే నేను నీతో నా ఒడంబడిక స్థిరపరుస్తాను. నేనే యెహోవానని నీవు తెలుసుకొంటావు. 63 నీవు చేసినవాటన్నిటికీ నేను ప్రాయశ్చిత్తం చేస్తాను. అప్పుడు నీవు నీ ప్రవర్తన జ్ఞాపకం చేసుకొని సిగ్గుపడి మౌనం వహిస్తావు. ఇది యెహోవాప్రభు వాక్కు.