15
1 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 “మానవపుత్రా, ద్రాక్షచెట్టు కర్ర అడవిచెట్లలో తక్కినవాటి కర్రలకంటే ఏమైనా మంచిదా? 3 దేనినైనా చేయడానికి ద్రాక్షచెట్టు కర్రను ఎవరైనా తీసుకొంటారా? దానితో మేకును చేసి ఆ మేకుకు వస్తువులు తగిలిస్తారా? 4 దాన్ని వంటచెరుకుగా నిప్పులో వేస్తే, దాని రెండు కొనలు నిప్పుచేత బాగా కాలిపోయి, దాని మధ్యభాగం నల్లబడితే అది దేనికైనా పనికి వస్తుందా? 5 కాలకముందే పనికిరాకపోతే నిప్పుచేత కాలిపోయి నల్లబడ్డ తరువాత అది దేనికైనా పనికి వస్తుందా?
6 “అందుచేత యెహోవాప్రభువు ఇలా చెపుతున్నాడు: అడవి చెట్లలో ద్రాక్షచెట్టు కర్రను నేను నిప్పుకు నియమించినట్టే జెరుసలం నగరవాసుల పట్ల వ్యవహరిస్తాను. 7 వాళ్ళను ఏమీ కటాక్షించను. వాళ్ళు మునుపు మంటలనుంచి తప్పించుకొన్నా, మంటలు వాళ్ళను దహించివేస్తాయి. వాళ్ళను కటాక్షించక పోయినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. 8 వాళ్ళు ద్రోహం చేశారు గనుక నేను దేశాన్ని పాడు చేస్తాను. ఇది యెహోవాప్రభు వాక్కు.”