14
1 ✽ఇస్రాయేల్ ప్రజల పెద్దలలో కొంతమంది నా దగ్గరికి వచ్చి నా ఎదుట కూర్చున్నారు. 2 అప్పుడు యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 3 ✽“మానవపుత్రా, ఈ మనుషులు తమ హృదయాలలో విగ్రహాలను నిలుపుకొన్నారు, తమ ముఖాల ఎదుట తమ అపరాధం అనే అడ్డు ఉంచుకొన్నారు. నేను వీళ్ళను నాదగ్గర విచారణ చేయనియ్యాలా? 4 ✽నీవు వీళ్ళతో మాట్లాడి ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఇస్రాయేల్ ప్రజలలో ఎవడైనా అతడి హృదయంలో విగ్రహాలను నిలుపుకొని, అతడి ముఖం ఎదుట అపరాధం అనే అడ్డు ఉంచుకొని ప్రవక్త దగ్గరికి వస్తే, అతడికున్న అనేక విగ్రహాలకు తగినట్టుగా నేను – యెహోవాను – జవాబిస్తాను. 5 ✽వారి విగ్రహాల కారణంగా నన్ను వదలిపెట్టిన ఇస్రాయేల్ ప్రజలందరి హృదయాలను నేను లోపరచుకోవాలని అలా చేస్తాను.6 ✽“అందుచేత ఇస్రాయేల్ ప్రజలతో ఇలా చెప్పు: యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, పశ్చాత్తాపపడండి! మీ విగ్రహాలను వదలిపెట్టండి! మీ అసహ్యమైన క్రియలన్నిటినీ విసర్జించండి.
7 “ఇస్రాయేల్ ప్రజల్లో గానీ వారి దేశంలో నివాసం చేస్తున్న విదేశీయులలో గానీ ఎవడైనా నాకు దూరంగా ఉండి హృదయంలో విగ్రహాలను నిలుపుకొని తన ముఖం ఎదుట తమ అపరాధం అనే అడ్డు ఉంచి తనకోసం నా దగ్గర విచారణ చేయడానికి ప్రవక్త దగ్గరికి వస్తాడనుకోండి. నేను – యెహోవాను – స్వయంగా వాడికి జవాబిస్తాను. 8 ఎలాగంటే, నేను వాడికి విరోధినై వాణ్ణి నా ప్రజల్లో లేకుండా చేసి వాణ్ణి సూచనగా, సామెతగా చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. 9 ✽ఆ ప్రవక్త ఏదైనా మాట పలకడానికి పురికొలపబడితే అతణ్ణి పురికొలిపినది నేనే – యెహోవానే. అప్పుడు ఆ ప్రవక్తకు విరోధంగా నా చెయ్యి చాచి, వాణ్ణి నా ఇస్రాయేల్ ప్రజల్లో లేకుండా నాశనం చేస్తాను. 10 ✽అలాంటి వాళ్ళు తమ అపరాధం భరించాలి. ప్రవక్త దగ్గర విచారణ చేసేవాడి అపరాధమెంతో ప్రవక్త అపరాధం అంతే. 11 ✽అందువల్ల ఇస్రాయేల్ ప్రజలు నానుంచి మళ్ళీ తొలగిపోరు, అతిక్రమాలు చేయకుండా, తమను అశుద్ధం చేసుకోకుండా ఉంటారు. వారు నాకు ప్రజగా ఉంటారు, నేను వారికి దేవుడుగా ఉంటాను.”
12 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 13 ✽“మానవపుత్రా, ఒకవేళ ద్రోహం చేయడంచేత ఏదైనా ఒక దేశం నాకు వ్యతిరేకంగా అపరాధం చేస్తుందనుకో. నేను దానికి వ్యతిరేకంగా నా చెయ్యి చాచి దానికి ఆహారం సరఫరా కాకుండా చేసి కరవు రప్పించి మనుషులనూ పశువులనూ చంపిస్తాననుకో. 14 అలాంటప్పుడు ఒకవేళ నోవహు, దానియేలు, యోబు – ఈ ముగ్గురు – ఆ దేశంలో ఉన్నా, వారు తమ న్యాయ ప్రవర్తనచేత తమను మాత్రమే కాపాడుకో గలిగేవారు. ఇది యెహోవా వాక్కు.
15 “ఒకవేళ ఆ దేశమంతటా దుష్ట మృగాలను నేను రప్పిస్తే, ఎవరూ సంచరించలేకుండా ఆ మృగాలు దేశాన్ని నిర్జనంగా పాడుగా చేస్తే, 16 ఆ ముగ్గురు అందులో ఉన్నా, తమను మాత్రమే కాపాడుకోగలిగేవారు. తమ కొడుకులనూ కూతుళ్ళనూ కాపాడుకోలేకపోతారనీ, ఆ దేశం పాడైపోతుందనీ నా జీవంతోడు నేను – యెహోవాప్రభువును – చెపుతున్నాను.
17 “ఒకవేళ నేను ఆ దేశంమీదికి ఖడ్గం రప్పించి, ఖడ్గం దేశంలో తిరుగుతూ ఉండాలి అని చెప్పి, మనుషులనూ పశువులనూ చంపిస్తాను అనుకో. 18 ఆ ముగ్గురు అందులో ఉన్నా, తమ కొడుకులనూ కూతుళ్ళనూ కాపాడలేక, తమను మాత్రమే కాపాడుకోగలిగేవారని నా జీవంతోడు నేను – యెహోవాప్రభువును – చెపుతున్నాను.
19 “ఒకవేళ ఆ దేశంలోకి ఘోర రోగం రప్పించి మనుషులనూ పశువులనూ చంపించేటంతగా నా ఆగ్రహాన్ని కుమ్మరిస్తాను అనుకో. 20 నోవహు, దానియేలు, యోబు ఆ దేశంలో ఉన్నా, తమ కొడుకులనూ, కూతుళ్ళనూ కాపాడగలిగేవారు కాదు. తమ న్యాయ ప్రవర్తనచేత తమను మాత్రమే కాపాడుకోగలిగేవారని నా జీవంతోడు నేను – యెహోవా ప్రభువును – చెపుతున్నాను.
21 “యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, నేను జెరుసలంలో ఉన్న మనుషులనూ పశువులనూ చంపించడానికి నాలుగు హానికరమైన శిక్షలు✽ – ఖడ్గం, కరవు, దుష్ట మృగాలు, ఘోర రోగం రప్పించేటప్పుడు, దాని స్థితి మరి ఎక్కువ భయంకరంగా ఉంటుంది. 22 ✽ అయినా, అందులో కొంతమంది కొడుకులూ కూతుళ్ళూ మిగులుతారు. వారిని అందులోనుంచి రప్పించడం జరుగుతుంది. వారు బయలుదేరి మీదగ్గరికి చేరుతారు. మీరు వారి ప్రవర్తననూ క్రియలనూ చూస్తారు. అప్పుడు నేను జెరుసలంమీదికి రప్పించిన కీడు విషయం, దానిపట్ల జరిగించిన దానంతటి విషయం మీకు ఓదార్పు కలుగుతుంది. 23 ✽మీరు వారి ప్రవర్తననూ క్రియలనూ చూచి, ఓదార్పు పొందుతారు. ఎందుకంటే, నేను దానిపట్ల జరిగించినదానిలో నిష్కారణంగా ఏమీ జరిగించలేదని మీరు తెలుసుకొంటారు. ఇది యెహోవాప్రభు వాక్కు.”