13
1 మరోసారి యెహోవా నుంచి వాక్కు నాకు వచ్చింది: 2 “మానవపుత్రా, ప్రకటించే ఇస్రాయేల్ ప్రవక్తలకు విరుద్ధంగా దైవావేశపూర్వకంగా పలుకు; మనసుకు తోచినట్లు ప్రకటించేవాళ్ళతో ఇలా చెప్పు: యెహోవా చెప్పేది వినండి. 3 యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, దర్శనం ఏమీ చూడకుండా సొంత ఆలోచనలను అనుసరించే అవివేక ప్రవక్తలకు బాధ తప్పదు. 4 ఇస్రాయేల్ ప్రజలారా, మీ ప్రవక్తలు శిథిలమైన స్థలాలలో ఉన్న నక్కలలాంటివాళ్ళు. 5 యెహోవా దినాన వచ్చే యుద్ధంలో ఇస్రాయేల్ ప్రజలు దృఢంగా నిలిచి ఉండేలా మీరు గోడలో ఉన్న పగులు దగ్గరికి వెళ్ళి వారి చుట్టున్న గోడను బాగు చేయలేదు. 6 ఈ ప్రవక్తలు చూచే దర్శనాలు వాస్తవమైనవి కావు. వాళ్ళ సోదె అబద్ధం. యెహోవా వాళ్ళను పంపలేదు గాని ‘యెహోవా ఇలా పలుకుతున్నాడు’ అంటారు. అయినా, తమ మాటలు నెరవేరుతాయని ఆశతో ఎదురు చూస్తారు. 7 నేను మీతో పలకకపోయినా ‘యెహోవా ఇలా పలుకుతున్నాడు’ అని మీరు చెపితే, మీరు చూచిన దర్శనాలు వాస్తవమైనవి కావు గదా. మీరు చెప్పే సోదె అబద్ధమే గదా.
8 “అందుచేత యెహోవాప్రభువు ఇలా చెపుతున్నాడు: మీ వ్యర్థమైన మాటల కారణంగా, మీ అసత్య దర్శనాల కారణంగా నేను మీకు విరోధినయ్యాను. ఇది యెహోవాప్రభు వాక్కు. 9 వాస్తవం కాని దర్శనాలు చూచి మోసకరమైన సోదె చెప్పే ప్రవక్తలకు నేను వ్యతిరేకిని. వాళ్ళకు నా ప్రజల సభలో స్థానం ఉండదు. ఇస్రాయేల్ ప్రజల జాబితాలో వాళ్ళ పేర్లు ఉండవు. వాళ్ళు ఇస్రాయేల్ దేశంలో మళ్ళీ అడుగుపెట్టరు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకొంటారు.
10 “క్షేమం ఏమీ లేకపోయినా వాళ్ళు ‘క్షేమం’ అంటూ నా ప్రజను మోసగిస్తున్నారు. నా ప్రజ గోడను ఇంకా నిర్మిస్తూ ఉండగానే వాళ్ళు దానికి సున్నం పూస్తున్నారన్న మాట. 11 కాబట్టి, సున్నం పూత వేస్తున్న వాళ్ళతో ఇలా చెప్పు: ఆ గోడ కూలుతుంది. వర్షం ప్రవాహంలాగా కురుస్తుంది, గొప్ప వడగండ్లు పడతాయి, వడిగల గాలి వీస్తుంది. 12 గోడ కూలేటప్పుడు ప్రజలు మిమ్ములను చూచి, ‘మీరు పూసిన సున్నం పూత ఏం అయింది?’ అని అడుగుతారు గదా. 13 యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, నేను ఆగ్రహంతో వడిగల గాలి తెప్పిస్తాను, కోపగించి, వర్ష ప్రవాహాలు కురిపిస్తాను, ఉగ్రతతో గొప్ప వడగండ్లు పడేలా చేస్తాను. 14 మీరు సున్నం పూసిన గోడను కూలగొట్టివేస్తాను. దాని పునాది కనిపించేలా దాన్ని నేలమట్టం చేస్తాను. ఆ గోడ పడేటప్పుడు దానిక్రింద మీరు నాశనం అవుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. 15 ఆ విధంగా ఆ గోడమీద, దానికి సున్నం పూసిన వాళ్ళమీద నా కోపం తీర్చుకొంటాను. అప్పుడు మీతో అంటాను, ‘గోడ పోయింది, దానికి సున్నం పూసినవాళ్ళు కూడా పోయారు.’ 16 దానికి సున్నం పూసిన వాళ్ళెవరంటే ఇస్రాయేల్ ప్రవక్తలే. క్షేమం ఏమీ లేకపోయినా వాళ్ళు ఏవో దర్శనాలు చూచినట్టుగా జెరుసలంవాళ్ళకు ప్రకటిస్తున్నారు. ఇది యెహోవా వాక్కు.
17 “మానవపుత్రా, నీ ప్రజలలో మనసు వచ్చినట్లు ప్రకటించే స్త్రీలపట్ల నీ వైఖరి కఠినం చేసుకొని వారికి వ్యతిరేకంగా దేవునిమూలంగా ఇలా చెప్పు: 18 యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఇతరులను వలలో చిక్కించుకోవడానికి మణికట్లకు మంత్రపుతాళ్ళను చుట్టి తమ తలలకు సరిపోయిన పొడుగు ముసుకులను చేసే స్త్రీలకు బాధ తప్పదు. మీరు నా ప్రజలను వలలో చిక్కించుకోవాలని ఉండగా మీ ప్రాణాలు దక్కించుకొంటారా? 19 కొన్ని పిడికిళ్ళ యవలకూ రొట్టె ముక్కలకూ ఆశించి నా ప్రజలమధ్య నా పేరును చెడగొట్టారు. అబద్ధాలు వినే నా ప్రజలకు మీరు అబద్ధాలు చెప్పడంచేత చావతగని వారిని చంపించారు. చావతగిన వాళ్ళను చావకుండా చేశారు.
20 “అందుచేత యెహోవాప్రభువు ఇలా చెపుతున్నాడు: నేను నొప్పించని సన్మార్గులను మీరు అబద్ధాలచేత నిరుత్సాహపరిచారు, దుర్మార్గులు తమ దుర్మార్గాన్ని విడవకుండా, తమ ప్రాణాలను దక్కించుకోకుండా మీరు వాళ్ళను ధైర్యపరచారు. 21 ఇతరులను వలలో చిక్కించుకోవడానికి మీరు కట్టిన మంత్రపుతాళ్ళకు నేను విరోధిని. వాటిని మీ చేతులమీదనుంచి ఊడదీసి, మీరు వలలో చిక్కించుకొన్నవారిని విడిపిస్తాను. 22 నేనే యెహోవానని మీరు తెలుసుకొనేలా మీరు వేసుకొన్న ముసుకులను నేను లాగివేసి, నా ప్రజను మీ చేతులలో నుంచి తప్పిస్తాను. ఇకమీదట మీరు వారిని వలలో చిక్కించుకొనే అవకాశం ఉండదు. 23 అంతేగాక, ఇకనుంచి మీరు వాస్తవం కాని దర్శనాలు చూడరు, పరవశులై పలకరు. నా ప్రజలను మీ వశంనుంచి తప్పిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు.”