12
1 మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 2 ✝“మానవ పుత్రా, నీవు తిరుగబడే ప్రజలమధ్య నివాసం చేస్తున్నావు. చూడాలంటే వాళ్ళకు కండ్లున్నాయి గాని వాళ్ళు చూడరు. వినాలంటే చెవులున్నాయి గాని వినరు. ఎందుకంటే, వాళ్ళు తిరగబడే జనం. 3 ✽అందుచేత, మానవపుత్రా, వాళ్ళు చూస్తూ ఉండగానే నీవు దేశాంతరం పోవడానికి సామాను మూట కట్టుకొని బయలుదేరాలి. పగటివేళ, వాళ్ళ కళ్ళెదుటే నీవున్న స్థలం విడిచి వేరే స్థలానికి వెళ్ళు. అది చూచి తాము తిరగబడే జనమని వాళ్ళు గ్రహిస్తారేమో. 4 పగటివేళ, వాళ్ళు చూస్తూ ఉండగానే, నీవు దేశాంతరం పోయేవాడివైనట్టుగా మూట కట్టి ఉన్న నీ సామాను బయటికి తీసుకురా. సాయంకాల సమయంలో, వాళ్ళు చూస్తూ ఉండగానే, దేశాంతరం పోయేవారిలాగా నీవు బయలుదేరు. 5 వాళ్ళు చూస్తుండగానే గోడకు కన్నం వేసి, దానిగుండా నీ సామాను తీసుకుపో. 6 వాళ్ళు చూస్తూ ఉండగానే చీకటి పడ్డ తరువాత మూట భుజం మీద పెట్టుకొని వెళ్ళిపో. నేల నీకు కనబడకుండా నీ ముఖం కప్పుకో. నీవు ఇస్రాయేల్ ప్రజకు సూచనగా ఉండాలని నేను నిర్ణయించాను.”7 ఆయన నాకు ఆజ్ఞాపించినట్టే చేశాను. దేశాంతరం పోయేవాణ్ణయినట్టు, పగటివేళ నా సామాను బయటికి తెచ్చాను. సాయంకాల సమయంలో చేతులతో గోడకు కన్నం చేశాను. చీకటి పడ్డాక వాళ్ళు చూస్తూ ఉండగానే నా భుజంమీద సామాను పెట్టుకొని బయలుదేరాను.
8 ప్రొద్దున యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 9 “మానవపుత్రా, తిరగబడే ఇస్రాయేల్‌వాళ్ళు ‘నీవేం చేస్తున్నావు?’ అని అడిగారు గదా. 10 నీవు వాళ్ళతో ఇలా చెప్పు: యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఈ సందేశం జెరుసలంలో ఉన్న పరిపాలకుడికీ అక్కడున్న ఇస్రాయేల్ వాళ్ళందరికీ చెందుతుంది. 11 వాళ్ళకు ఇలా చెప్పు: నేను మీకు సూచనగా ఉన్నాను. నేను చేసి సూచించినట్టే వాళ్లకు సంభవిస్తుంది. వాళ్ళు బందీలుగా దేశాంతరం పోతారు.
12 ✽“వాళ్ళ పరిపాలకుడు భుజంమీద సామాను పెట్టుకొని చీకటిలో బయలుదేరుతాడు. అతడు బయటికి వెళ్ళేట్టు వాళ్ళు గోడకు కన్నం చేస్తారు. అతడు ముఖం కప్పుకొని నేల చూడకుండా వెళ్ళిపోతాడు. 13 అయితే అతణ్ణి పట్టుకోవడానికి నేను నా వల పరచి అతణ్ణి చిక్కించుకొని కల్దీయవాళ్ళ దేశంలో ఉన్న బబులోనుకు అతణ్ణి తెప్పిస్తాను. అతడు అక్కడ చస్తాడు. గాని ఆ స్థలం చూడడు. 14 అతడి చుట్టున్న వాళ్ళందరినీ – అతడి పరివారాన్నీ సైనికులనూ – నేను నలుదిక్కులకు చెదరగొట్టి ఖడ్గం దూసి వాళ్ళను తరుముతాను. 15 నేను వాళ్ళను ఇతర జనాల మధ్యకు వెళ్ళగొట్టి వేరువేరు దేశాలలో చెదరగొట్టిన తరువాత, నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు✽. 16 వాళ్ళలో కొంతమంది ఖడ్గంచేత కరవుచేత ఘోర రోగంచేత చావకుండా చేస్తాను. నేనే యెహోవానని వారు తెలుసుకోవాలనీ, తమ అసహ్యమైన ప్రవర్తన తాము వెళ్ళే దేశాలలో వివరించి చెప్పాలనీ నా ఆశయం.”
17 ✽మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 18 “మానవపుత్రా, నీవు భోజనం చేస్తూ గజగజలాడు. ఆందోళనతో, కంగారుతో నీళ్ళు త్రాగు. 19 అప్పుడు దేశప్రజలకు ఇలా చెప్పు: జెరుసలం నగరవాసుల విషయం, ఇస్రాయేల్ దేశవాసుల విషయం యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, వాళ్ళు కంగారుతో భోజనం చేస్తారు. నిర్ఘాంతపోతూ నీళ్ళు త్రాగుతారు. ఎందుకంటే, ఆ దేశంలో కాపురమున్నవాళ్ళందరూ చేసే దౌర్జన్యం కారణంగా దానిలో ఉన్నదంతా నాశనం అవుతుంది. 20 ప్రజలు కాపురమున్న పట్టణాలు నిర్జనమవుతాయి. దేశం పాడవుతుంది. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు.”
21 ✽మరోసారి యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 22 “మానవపుత్రా, ఇస్రాయేల్ దేశంలో ‘రోజులు గడిచి పోతున్నాయి. స్వప్న దర్శనాలన్నీ శూన్యం అవుతున్నాయి’ అని సామెతగా చెప్పుకొంటున్నారేం. 23 ✽నీవు వాళ్ళకు ఇలా తెలియజెయ్యి: యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇకమీదట ఇస్రాయేల్ ప్రజలలో ఎవ్వడూ ఆ సామెత పలకకుండా నేను దాన్ని నిలిపివేయిస్తాను. వాళ్ళకు ఇలా చెప్పు: ప్రతి దర్శనం నెరవేరే రోజులు దగ్గరపడుతున్నాయి. 24 ✽అప్పటినుంచి వ్యర్థమైన దర్శనాలు గానీ సోదె చెప్పేవాళ్ళ పొగడ్త మాటలు గానీ ఇస్రాయేల్ ప్రజలలో ఉండవు. 25 నేను యెహోవాను. నేను మాట్లాడుతాను. నా మాటలు నెరవేరుతాయి. ఆలస్యం ఉండదు. తిరగబడే జనమా, నేను చెప్పేమాటలు మీ రోజుల్లోనే నెరవేరుతాయి. ఇది ప్రభువైన యెహోవా వాక్కు.”
26 మరోసారి యెహోవా నుంచి వాక్కు నాకు వచ్చింది: 27 ✽“మానవపుత్రా, ఇస్రాయేల్‌ప్రజలు నిన్ను గురించి ఇలా చెప్పుకొంటున్నారు గదా – ‘వాడికి కనిపించిన దర్శనం అనేక రోజులైన తరువాత జరిగే దానిని గురించి. వాడు చెప్పే భవిష్యత్తు చాలా కాలమైన తరువాత వస్తుంది.” 28 అందుచేత వాళ్ళతో ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఇకనుంచి నేను చెప్పే మాటలన్నీ ఆలస్యం లేకుండా నెరవేరుతాయి. నేను ఏ మాట చెప్పితే ఆ మాట జరిగి తీరుతుంది. ఇది యెహోవా వాక్కు.”