11
1 ✽అప్పుడు ఆత్మ నన్ను ఎత్తి యెహోవా ఆలయానికి తూర్పుగా ఉన్న ద్వారం దగ్గరికి తీసుకువెళ్ళాడు. ద్వార ప్రవేశంలో ఇరవై అయిదుమంది మనుషులు ఉన్నారు. వాళ్ళలో ప్రజల నాయకులు అజ్జూరు కొడుకైన యజన్యా, బెనాయా కొడుకైన పెలట్యా నాకు కనబడ్డారు. 2 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “మానవపుత్రా, దురాలోచన చేస్తూ, నగరంలో చెడ్డ సలహా ఇచ్చేది ఈ మనుషులే. 3 ✽వాళ్ళు ‘ఈ నగరం వంటపాత్ర, మనం మాంసం. ఇండ్లు కట్టుకోవడానికి ఇది సమయం కాదు’ అని అంటారు. 4 కనుక వాళ్ళకు విరుద్ధంగా దైవావేశపూర్వకంగా పలుకు. మానవపుత్రా, దైవావేశపూర్వకంగా పలుకు.”5 వెంటనే యెహోవా ఆత్మ నామీదికి వచ్చి నాతో చెప్పినదేమిటంటే: “నీవు ఇలా చెప్పు: యెహోవా చెప్పేది ఇదే. ఇస్రాయేల్ ప్రజలారా, మీరు అలాగే చెప్పుకొంటున్నారు. మీ మనసు✽లో ఉన్న ఆలోచనలు నాకు తెలుసు. 6 ✝ఈ నగరంలో మీరు చాలామందిని చంపారు. మీచేత హతమైనవారితో వీధులు నిండి ఉన్నాయి. 7 ✽కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, నగరంలో మీరు చంపి పారవేసిన మృతదేహాలు మాంసం, నగరం వంటపాత్ర. అయితే నేను మిమ్ములను నగరంలోనుంచి వెళ్ళగొట్టివేస్తాను. 8 ఖడ్గమంటే మీకు భయం గదా. నేను మీమీదికి రప్పించబోయేది ఖడ్గమే. ఇది యెహోవాప్రభు వాక్కు. 9 మిమ్ములను నగరంలోనుంచి వెళ్ళగొట్టి విదేశీయుల వశం చేసి దండిస్తాను. 10 ✝మీరు ఖడ్గంచేత కూలుతారు. మిమ్ములను ఇస్రాయేల్ సరిహద్దుల దగ్గర నేను శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. 11 ఈ నగరం మీకు వంటపాత్రగా ఉండదు, ఇందులో మీరు మాంసంగా ఉండరు. ఇస్రాయేల్ సరిహద్దుల దగ్గరే మిమ్ములను శిక్షిస్తాను. 12 ✝అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. మీరు నా చట్టాలప్రకారం ప్రవర్తించకుండా, నా న్యాయనిర్ణయాలను అనుసరించకుండా మీ చుట్టూరా ఉన్న ఇతర ప్రజల నిర్ణయాలనే అనుసరించారు గనుక నేను అలా చేస్తాను.”
13 ✝నేను దేవునిమూలంగా అలా పలుకుతూ ఉండగానే బెనాయా కొడుకు పెలట్యా చనిపోయాడు. నేను సాష్టాంగపడి, “అయ్యో! ప్రభూ! యెహోవా! ఇస్రాయేల్ ప్రజలలో మిగతావారిని నీవు సమూల నాశనం చేస్తావా?” అని బిగ్గరగా అరిచాను.
14 అప్పుడు నాకు యెహోవా నుంచి వాక్కు వచ్చింది, 15 ✽“మానవపుత్రా, నీ సోదరుల విషయం, సమీప బంధువుల విషయం ఇస్రాయేల్ ప్రజలందరి విషయం జెరుసలం నగరవాసులు చెప్పేదేమిటంటే, ‘వాళ్ళు యెహోవాకు దూరంగా ఉన్నారు. ఈ దేశం మా స్వాధీనం చేయబడింది’. 16 అందుచేత నీవు వాళ్ళకు ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమంటే దూరంగా ఉన్న ఇతర జనాలమధ్యకు నేను వారిని తొలగించి వేరువేరు దేశాలలో చెదరగొట్టినా, కొంతకాలం వారు వెళ్ళిన దేశాలలో నేను వారికి పవిత్ర ఆశ్రయం✽గా ఉన్నాను. 17 ✽అందుచేత నీవు ఇలా చెప్పు: యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఆ జనాల మధ్యనుంచి నేను మిమ్ములను సమకూరుస్తాను, మీరు చెదరిపోయిన ఆ దేశాలనుంచి రప్పిస్తాను. ఇస్రాయేల్ దేశాన్ని మీ స్వాధీనం చేస్తాను.
18 ✽“వారు అక్కడికి వెళ్ళి అసహ్యమైన ఆచారాలన్నిటినీ విగ్రహాలన్నిటినీ దేశంలో ఉండకుండా తొలగిస్తారు. 19 ✝నేను వారి శరీరాలలో నుంచి రాతి గుండెలు✽ తీసివేసి వారికి మాంసం గుండెలు ఇస్తాను. వారికి ఏకీభావం గల క్రొత్త హృదయం✽ ఇస్తాను. వారితో క్రొత్త ఆత్మను ఉంచుతాను. 20 అప్పుడు వారు నా చట్టాలను అనుసరిస్తారు, నా న్యాయనిర్ణయాలను పాటిస్తారు. వారు నా ప్రజగా ఉంటారు, నేను వారికి దేవుడుగా✽ ఉంటాను. 21 ✝కానీ వాళ్ళ అసహ్యమైన ఆచారాలనూ విగ్రహాలనూ అనుసరించేవాళ్ళ నెత్తిమీదికి వాళ్ళ ప్రవర్తన ఫలం రప్పిస్తాను. ఇది యెహోవాప్రభు వాక్కు.”
22 ✽అప్పుడు కెరూబులు రెక్కలు చాపారు. వారి ప్రక్కన ఆ చక్రాలు ఉన్నాయి. వారికి పైగా ఇస్రాయేల్ ప్రజల దేవుని శోభాప్రకాశం ఉంది. 23 యెహోవా శోభాప్రకాశం నగరంలోనుంచి పైకి వెళ్ళి నగరానికి తూర్పుగా ఉన్న కొండకు పైగా నిలిచింది. 24 ఆ తరువాత దేవుని ఆత్మ ఇచ్చిన దర్శనంలో ఆత్మ నన్ను ఎత్తి కల్దీయదేశంలో ఉన్న బందీలదగ్గరికి నన్ను తీసుకుపోయాడు. అప్పుడు నాకు కనిపించిన దర్శనం పైకి పోయి అంతర్థానమైనది. 25 యెహోవా నాకు కనుపరచినదంతా ఆ బందీలకు చెప్పాను.