10
1 ✝అప్పుడు నేను చూస్తూ ఉన్నప్పుడు కెరూబుల తలలకు పైగా ఉన్న విశాలంమీద నీలమణిలాంటి సింహాసనం కనిపించింది. 2 ✽ నారబట్టలు వేసుకొని ఉన్న ఆ వ్యక్తితో యెహోవా ఇలా అన్నాడు: “కెరూబులక్రింద ఉన్న చక్రాల మధ్యకు వెళ్ళు. కెరూబులమధ్య ఉన్న నిప్పు కణికలు చేతులనిండా తీసుకువచ్చి నగరం మీద చల్లు.” నేను చూస్తూ ఉంటే ఆ వ్యక్తి చక్రాలమధ్యకు వెళ్ళాడు. 3 అతడు వెళ్ళినప్పుడు కెరూబులు ఆలయం కుడిప్రక్కన ఉన్నాయి. యెహోవా మేఘం లోపలి ఆవరణాన్ని కమ్మి ఉంది. 4 ✽ అప్పుడు యెహోవా శోభా ప్రకాశం కెరూబుల పైనుంచి కదిలి ఆలయం గడప దగ్గరికి వచ్చి ఉంది. ఆలయం ఆ మేఘంతో నిండి ఉంది. ఆవరణం యెహోవా శోభ కాంతితో నిండి ఉంది. 5 ✝కెరూబులలో రెక్కల చప్పుడు బయటి ఆవరణం వరకూ వినబడుతూ ఉంది. ఆ చప్పుడు అమిత శక్తివంతుడైన దేవుడు మాట్లాడే స్వరం లాంటిది.6 ఆయన “చక్రాల మధ్యనుంచి – కెరూబుల మధ్య నుంచి నిప్పు తీసుకో అని నారబట్టలు వేసుకొని ఉన్న ఆ వ్యక్తికి ఆజ్ఞ జారీ చేసినప్పుడు అతడు వాటి మధ్యకు వెళ్ళి ఒక చక్రం దగ్గర నిలిచాడు. 7 కెరూబులలో ఒకడు మధ్య ఉన్న నిప్పువైపుకు చెయ్యి చాపి నిప్పులో కొంత తీసి నారబట్టలు వేసుకొని ఉన్న వ్యక్తి చేతిలో పెట్టాడు. అతడా నిప్పు పట్టుకొని బయటికి వెళ్ళాడు. 8 ✝కెరూబుల రెక్కలక్రింద మనిషి చేయిలాంటి ఆకారం కనిపించింది.
9 ✝కెరూబుల దగ్గర నాలుగు చక్రాలను – ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రం – నేను చూశాను. ఆ చక్రాలు గోమేధికంలాగా నిగనిగలాడుతూ ఉండేవి. 10 నాలుగూ ఒకే రకం. చక్రంలో చక్రమున్నట్టు ఉండేవి. 11 అవి నాలుగు వైపులలో ఏ వైపుకైనా పోతూ ఉన్నప్పుడు అవి ప్రక్కకు ఏమీ తిరగలేదు. కెరూబుల ముఖాలు ఏ వైపుకు ఉన్నాయో ఆ వైపుకే అవి పోయేవి. పోతూ ఉంటే అవి ప్రక్కకు ఏమీ తిరగలేదు. 12 ✽ఆ కెరూబుల శరీరాలకు అంతటా – వీపులకూ చేతులకూ రెక్కలకూ కూడా – కండ్లు ఉన్నాయి. వాటి నాలుగు చక్రాలకు కూడా కండ్లు ఉన్నాయి. 13 ✽ఆ చక్రాలను ‘తిరిగే చక్రాలు’ అనడం నేను విన్నాను. 14 ప్రతి కెరూబుకూ నాలుగు ముఖాలుండేవి. ఒకటి కెరూబు ముఖం, రెండోది మనిషి ముఖం, మూడోది సింహం ముఖం, నాలుగోది గరుడపక్షి ముఖం.
15 ✽ అప్పుడు కెరూబులు పైకి వెళ్ళాయి. కెబార్‌నది దగ్గర నాకు కనిపించిన జీవులు ఈ కెరూబులే. 16 ✝కెరూబులు కదిలితే వారిదగ్గర ఉన్న చక్రాలు కూడా కదిలేవి. భూమిమీదనుంచి లేవడానికి కెరూబులు రెక్కలు చాపితే చక్రాలు వారి దగ్గరనుంచి తొలగలేదు. 17 ఎందుకంటే, ఆ జీవులకున్న ఆత్మ చక్రాలలో ఉండడంవల్ల కెరూబులు ఆగితే ఇవీ ఆగేవి. కెరూబులు పైకి పోతే ఇవీ పైకి పోయేవి.
18 ✽అప్పుడు యెహోవా శోభాప్రకాశం ఆలయం గడపదగ్గర నుంచి కదిలి కెరూబులకు పైగా ఆగింది. 19 నేను చూస్తూ ఉంటే కెరూబులు రెక్కలు చాపి నేలనుంచి పైకి వెళ్ళారు. వారు పోతూ ఉంటే వారితోపాటు చక్రాలు పోయాయి. యెహోవా ఆలయానికి తూర్పుగా ఉన్న ద్వారందగ్గర వారు ఆగారు. వారికి పైగా ఇస్రాయేల్ ప్రజల దేవుని శోభాప్రకాశం నిలిచింది. 20 కెబార్ నదిదగ్గర ఇస్రాయేల్ ప్రజల దేవునికి క్రిందగా ఉండి, నాకు కనిపించిన జీవులు ఈ కెరూబులే. వారు కెరూబులని నేను తెలుసుకొన్నాను. 21 ✝ఒక్కొక్క కెరూబుకు నాలుగు ముఖాలూ నాలుగు రెక్కలూ ఉండేవి. వారి రెక్కల క్రింద మనిషి చేతుల్లాంటివి ఉన్నాయి. 22 వారి ముఖాలు కెబార్‌నది దగ్గర నాకు కనిపించిన జీవుల ముఖాలు ఒకటే. వాటి ఆకారాలు ఒకటే. వారందరూ తిన్నగా ముందుకు వెళ్ళేవారు.