9
1 అప్పుడాయన బిగ్గరగా ఇలా కేక వేయడం నేను విన్నాను: “నగరం కావలివారు ఇక్కడికి రండి. హతం చేసే తన ఆయుధం ప్రతి ఒక్కడూ చేతపట్టుకురావాలి.” 2 వెంటనే ఉత్తర దిక్కున ఉన్న పైద్వారం వైపునుంచి ఆరుగురు మనుషులు రావడం నేను చూశాను. ఒక్కొక్కడు నాశనం చేసే ఆయుధం చేతపట్టుకొని ఉన్నాడు. నారబట్టలు వేసుకొని ఉన్న వ్యక్తి వారిమధ్య ఉన్నాడు. అతడి నడుముకు లేఖకుడి సామానుపెట్టె ఉంది. వారు ఆవరణంలోకి వచ్చి కంచు బలిపీఠం దగ్గర నిలిచారు.
3 అంతవరకు కెరూబులమీద ఉన్న ఇస్రాయేల్ ప్రజల దేవుని శోభాప్రకాశం అప్పుడు పైకి కదిలి ఆలయం గడప దగ్గరికి వచ్చి నిలిచింది. నారబట్టలు వేసుకొని లేఖకుడి సామానుపెట్టె నడుముకు కట్టుకొన్న ఆ వ్యక్తిని యెహోవా పిలిచి ఇలా అన్నాడు: 4 “నీవు జెరుసలం నగరం అంతటా తిరుగు. నగరంలో జరుగుతూ ఉన్న అసహ్యమైన పనులన్నిటి విషయం మూలుగుతూ నొచ్చుకొంటూ ఉన్నవారి నొసట గురుతు వెయ్యి.”
5 నేను వింటూ ఉంటే, ఆయన ఆ ఆరుగురు మనుషులతో ఇలా అన్నాడు: “అతడి వెంట మీరు నగరంలో తిరుగుతూ, ప్రజలను హతం చేయాలి. దయ చూపవద్దు. కనికరించవద్దు. 6 పెద్దవాళ్ళనూ యువకులనూ కన్యలనూ స్త్రీలనూ పిల్లలనూ చంపితీరాలి. ఆ గురుతు ఉన్నవారికి మాత్రమే ఏ హానీ చేయకూడదు. నా పవిత్ర స్థానం దగ్గర మొదలుపెట్టండి.” అందుచేత ఆలయం ముందర ఉన్న పెద్దలతో వారు ఆరంభించారు.
7 ఆయన వారితో “ఆలయాన్ని అశుద్ధం చేయండి. ఆవరణాలను హతమైనవాళ్ళతో నింపండి. ఇప్పుడు మొదలు పెట్టండి” అన్నాడు. గనుక వారు బయలుదేరి నగరంలో ప్రజలను హతం చేయసాగారు.
8 వారు ప్రజలను హతమారుస్తూ ఉంటే, ఒంటరిగా ఉండిపోయిన నేను సాష్టాంగపడి, “అయ్యో, ప్రభూ! యెహోవా! జెరుసలంమీద నీ కోపాన్ని కుమ్మరించి ఇస్రాయేల్ ప్రజలలో మిగిలినవారందరినీ నాశనం చేస్తావా?” అని అరిచాను.
9 అందుకాయన ఇలా జవాబిచ్చాడు: “ఇస్రాయేల్ ప్రజలూ యూదాప్రజలూ చేసిన అపరాధాలు చాలా ఘోరమైనవి. దేశం రక్తపాతంతో నిండి ఉంది. నగరం అక్రమ కార్యాలతో నిండి ఉంది. ‘యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడు. యెహోవా మనల్ని చూడడు’ అని వాళ్ళు చెప్పుకొన్నారు. 10 అందుచేత నేను వాళ్ళపై జాలి చూపను, శిక్షించకుండా ఉండను. వాళ్ళ ప్రవర్తన ఫలం వాళ్ళ నెత్తిమీదికి తెస్తాను.”
11 అప్పుడు నారబట్టలు వేసుకొని నడుముకు లేఖకుడి సామానుపెట్టె కట్టుకొన్న ఆ వ్యక్తి వచ్చి, “నీవు ఆజ్ఞాపించినట్టే చేశాను” అన్నాడు.