8
1 ✽ఆరో సంవత్సరం ఆరో నెల అయిదో రోజున నేను నా ఇంట్లో కూర్చుని ఉన్నాను. యూదావారి పెద్దలు✽ నా ఎదుట కూర్చుని ఉన్నారు. అప్పుడు యెహోవాప్రభువు తన చెయ్యి✽ నామీద పెట్టాడు. 2 ✽ నేను చూస్తూ ఉండగా జ్వాలమయమైన మానవ రూపం నాకు కనిపించింది. ఆ రూపం నడుమునుంచి దిగువకు మంటల్లాగా ఉంది. నడుమునుంచి మీదికి ప్రకాశమానంగా ఉంది. ఆయన రూపం మండుతున్న కంచులాగా నాకు కనిపించింది. 3 ✽చేయిలాంటి దానిని ఆయన చాపి నా తలవెంట్రుకలు పట్టుకొన్నాడు. ఆత్మ భూమికీ ఆకాశానికీ మధ్యకు నన్ను ఎత్తాడు, దేవదర్శనాలలో నన్ను జెరుసలంకు, ఉత్తర దిక్కున ఉన్న ఆవరణ ద్వారందగ్గరికి తీసుకుపోయాడు. ఆ స్థలంలో యెహోవాకు రోషం✽ కలిగించే విగ్రహం ఉంది. 4 ✝అక్కడ ఇస్రాయేల్ ప్రజల దేవుని శోభాప్రకాశం నాకు కనబడింది. అది మునుపు మైదానంలో నాకు కనిపించినదానిలాంటిదే.5 అప్పుడాయన నాతో “మానవపుత్రా, ఉత్తర దిక్కుకు చూడు” అన్నాడు. నేను ఆవైపు చూశాను. ఉత్తర దిక్కున బలిపీఠం దగ్గర ఉన్న ద్వారం లోపలే రోషం కలిగించే ఆ విగ్రహం ఉంది. 6 ఆయన నాతో ఇంకా అన్నాడు, “మానవపుత్రా, అక్కడ వాళ్ళు ఏమి చేస్తున్నారో అది చూస్తున్నావా? అక్కడ ఇస్రాయేల్‌వారు చేస్తూ ఉన్న అతి అసహ్యమైన✽ క్రియలు చూస్తున్నావా? అవి నా పవిత్రాలయానికి నన్ను దూరం చేస్తాయి✽. అయినా, వీటికంటే ఇంకా అసహ్యమైనవాటిని నీవు చూడబోతున్నావు.”
7 అప్పుడాయన ఆవరణ ద్వారం దగ్గరికి నన్ను తీసుకువెళ్ళాడు. అక్కడ గోడలో పగులు నాకు కనిపించింది. 8 ఆయన అన్నాడు, “మానవపుత్రా, గోడకు కన్నం త్రవ్వు.” నేను త్రవ్వినప్పుడు ఒక ద్వారం కనిపించింది.
9 “లోపలికి వెళ్ళి, వాళ్ళు అక్కడ చేస్తున్న క్రియలు ఎంత ఘోర అసహ్యమో చూడు” అని ఆయన నాతో అన్నాడు.
10 ✽నేను లోపలికి వెళ్ళి చూస్తే గోడ అంతటా ప్రాకే జంతువుల చిత్తరువులూ అసహ్యమైన మృగాల చిత్తరువులూ ఇస్రాయేల్‌వాళ్ళ దేవతల అన్ని విగ్రహాల చిత్తరువులూ నాకు కనిపించాయి. 11 ✽వాటికి ఎదురుగా ఇస్రాయేల్ ప్రజల పెద్దలలో డెబ్భయిమంది నిలబడి ఉన్నారు. వాళ్ళమధ్య షాఫాన్ కొడుకు యజన్యా ఉన్నాడు. ప్రతివాడూ ధూపార్తి చేతపట్టుకొని ఉన్నాడు. పరిమళ ధూపం మేఘంలాగా పైకి పోతూ ఉంది.
12 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు: “మానవపుత్రా, ఇస్రాయేల్‌ప్రజల పెద్దలు ఒక్కొక్కరూ చీకటిలో తమ విగ్రహాల స్థలంలో ఏమి చేస్తున్నారో చూస్తున్నావా? ‘యెహోవా మనల్ని చూడడు. యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడు” అని వాళ్ళు చెప్పుకొన్నారు.” 13 ఆయన ఇంకా అన్నాడు, “దీనికంటే మరీ అసహ్యమైన క్రియలు వాళ్ళు చేయడం నీవు చూస్తావు.”
14 అప్పుడాయన నన్ను యెహోవా ఆలయానికి ఉత్తర దిక్కున ఉన్న ద్వారం దగ్గరికి తీసుకుపోయాడు. అక్కడ స్త్రీలు కూర్చుని ఉండి తమ్మూజు✽ గురించి ఏడవడం చూశాను. 15 ✽ఆయన నాతో “మానవపుత్రా, అది చూస్తున్నావా? అయితే దీనికంటే మరీ అసహ్య కార్యాలు చూడబోతున్నావు” అన్నాడు.
16 అప్పుడాయన నన్ను యెహోవా ఆలయం లోపలి ఆవరణంలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ యెహోవా ఆలయ ద్వారందగ్గర, వాకిటి వసారాకూ బలిపీఠానికీ మధ్య సుమారు ఇరవై అయిదుమంది పురుషులు కనిపించారు. వాళ్ళ వీపులు యెహోవా ఆలయంవైపు, వాళ్ళ ముఖాలు తూర్పువైపు ఉన్నాయి. వాళ్ళు తూర్పున ఉన్న సూర్యగోళానికి నమస్కారం చేస్తూ ఉన్నారు.
17 ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవపుత్రా, ఇది చూశావా? యూదావాళ్ళు ఇక్కడ ఇలాంటి అసహ్యాలు జరిగించడం చాలదా? దేశాన్ని బలాత్కారంతో నింపి ఎడతెగకుండా నాకు కోపం రేపాలా? వాళ్ళు తమ ముక్కుకు రెమ్మ ఉంచుకొంటున్నారు, చూడు. 18 ✝అందుచేత వాళ్ళపట్ల నేను కోపంతో వ్యవహరిస్తాను. వాళ్ళను జాలితో చూడను, శిక్షించకుండా ఉండను. వాళ్ళు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినా నేను వినను.”