7
1 ✽యెహోవానుంచి వాక్కు మరో సారి నాకు వచ్చింది: 2 “మానవపుత్రా, యెహోవాప్రభువు ఇస్రాయేల్ దేశాన్ని గురించి ఇలా చెపుతున్నాడు: అంతం వచ్చింది! నలుదిక్కుల దేశానికి అంతం వచ్చింది! 3 ఇప్పుడే అంతం నీమీద ఉంది. నా కోపం నీమీదికి రప్పిస్తాను. నీ ప్రవర్తనకు తీర్పు తీరుస్తాను✽, అసహ్యమైన నీ సమస్త క్రియల ఫలం నీ మీదికి రప్పిస్తాను. 4 ✝నిన్ను జాలితో చూడను, శిక్షించకుండా దాటిపోను. నీ ప్రవర్తనకూ నీలో జరుగుతున్న నీచ క్రియలకూ ప్రతిఫలం కలిగిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసు కొంటారు.5 “యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, విపత్తు, అసాధారణమైన విపత్తు సంభవించబోతున్నది. 6 అంతం వస్తూ ఉంది. అంతమే వస్తూ ఉంది. నీమీద రేగి ఉంది. ఇదిగో! రానే వస్తూ ఉంది. 7 దేశవాసులారా! మీమీదికి దుర్దినం వస్తూ ఉంది. ఆ సమయం ఆసన్నమైంది. ఆ రోజు దగ్గరపడింది. పర్వతాలమీద వినబడుతూ ఉండేది ఆనంద ధ్వని కాదు గాని, అల్లరి చప్పుడే. 8 త్వరలోనే నేను నా కోపాగ్ని నీమీద కుమ్మరిస్తాను✽. నీమీద నా ఆగ్రహం తీరిపోయేలా చేస్తాను. నీ ప్రవర్తనకు తీర్పు తీరుస్తాను. నీచమైన నీ సమస్త క్రియల ఫలం నీమీదికి రప్పిస్తాను. 9 నిన్ను జాలితో చూడను, శిక్షించకుండా దాటిపోను. నీ ప్రవర్తనకూ నీలో జరుగుతున్న నీచ క్రియలకూ ప్రతిఫలం కలిగిస్తాను. అప్పుడు నిన్ను దెబ్బ కొట్టినది✽ నేనే – యెహోవాను – అని నీవు తెలుసుకొంటావు.
10 ✽“ఇదిగో, ఇదే ఆ రోజు! అది రానే వచ్చింది. ఆ దుర్దినం ఉదయించింది. దండం మొగ్గ వేసింది. గర్వం వికసించింది. బలాత్కారం పుట్టి దుర్మార్గులను శిక్షించే దండంలాగా అయింది. 11 వాళ్ళలో – ఆ మూకలో – ఎవ్వరూ మిగలరు. వాళ్ళ ఆస్తి, ఘనత ఏమీ మిగలదు. 12 కాలం ఆసన్నమైంది. రోజు దగ్గరపడింది. ఆ మూక అంతటిమీదా ఆగ్రహం నిలిచి ఉంది గనుక కొనేవాడు సంతోషించకూడదు, అమ్మేవాడు విచారపడకూడదు. 13 కొనేవాడు, అమ్మేవాడు ఇద్దరూ బ్రతికి ఉన్నంతవరకు అమ్మేవాడు అమ్మిన భూమికి తిరిగి రాడు. ఎందుకంటే, ఆ గుంపు అంతటి విషయం దైవదర్శనంలో వెల్లడి అయిన ఆ శిక్ష తప్పిపోదు. వాళ్ళు అపరాధులు గనుక వాళ్ళలో ఎవ్వరూ ధైర్యం వహించి తమ ప్రాణం దక్కించుకోలేకపోతారు. 14 ✽ఆ గుంపంతటిమీదా నా ఆగ్రహం నిలిచి ఉంది గనుక వాళ్ళు అంతా సిద్ధం చేసి, బూర ఊదినా యుద్ధానికి ఎవ్వడూ వెళ్ళడు.
15 “బయట ఖడ్గం ఉంది, లోపల ఘోరరోగం, కరవు ఉన్నాయి. పల్లెప్రాంతాలలో ఉన్నవారు కత్తిపాలవుతారు. పట్టణాలలో ఉన్నవారిని ఘోరరోగం, కరవు దిగమ్రింగివేస్తాయి. 16 మిగిలినవారు తప్పించుకొన్నా, వారంతా కొండలలో ఉండి, తమ అపరాధాల✽ కారణంగా లోయల్లో ఉన్న గువ్వల్లాగా మూలుగుతూ ఉంటారు. 17 అందరి చేతులకు బలం లేకుండా పోతుంది. అందరి మోకాళ్ళూ నీళ్ళవుతాయి. 18 ✝వాళ్ళు గొనెపట్ట కట్టుకొంటారు. వారికి ఘోర భయం ముంచుకువస్తుంది. అందరి ముఖాలనూ అవమానం కప్పుతుంది. అందరి తలలూ బోడి అవుతాయి. 19 ✽తమ వెండిని వీధులలో పారవేస్తారు. తమ బంగారం తమకు అసహ్యం అనిపిస్తుంది. యెహోవా తన కోపాగ్ని కుమ్మరించే రోజున వాళ్ళ వెండిబంగారాలు వాళ్ళను విడిపించలేకపోతాయి. వాళ్ళ వెండిబంగారాలు వాళ్ళు పాపంలో పడడానికి కారణం అయ్యాయి గనుక వాటి వల్ల తమ ఆకలి తీర్చుకోలేకుండా, తమ కడుపును నింపుకోలేకుండా ఉంటారు.
20 ✝“తమ ఆభరణాల అందాన్ని వాళ్ళు చూచి గర్వపడ్డారు. వాటితో వాళ్ళు అసహ్యమైన దేవతల విగ్రహాలు చేశారు. అందుచేత వాళ్ళ ఆభరణాలు వాళ్ళకు నీచమైనవిగా అనిపించుకొనేలా నేను చేస్తాను. 21 ✽దాన్నంతా దోపిడీగా విదేశీయుల స్వాధీనం చేస్తాను. కొల్లగా దుర్మార్గుల వశం చేస్తాను. వాళ్ళు దాన్ని అపవిత్ర పరుస్తారు. 22 నేను ఇస్రాయేల్ వారికి విముఖుణ్ణవుతాను✽. గనుక ఇతరులు నా బొక్కసం✽ అపవిత్రం చేస్తారు. దొంగలు చొరబడి దాన్ని అపవిత్రపరుస్తారు.
23 “దేశం రక్తపాతంతో నిండి ఉంది. నగరం దౌర్జన్యంతో నిండి ఉంది. అందుచేత సంకెళ్ళు✽ తయారు చేయండి! 24 ఇతర దేశాలవాళ్ళందరిలో చెడ్డ జనం✽ ఈ దేశవాసుల ఇండ్లను వశం చేసుకొనేలా నేను వాళ్ళను రప్పిస్తాను. బలాఢ్యుల గర్వాన్ని పూర్తిగా అణచివేస్తాను. వాళ్ళ ఆరాధనా స్థలాలను అపవిత్రం చేయడం జరుగుతుంది. 25 ✝నాశనం వచ్చేటప్పుడు వాళ్ళు శాంతిని వెదుకుతారు గాని అది వాళ్ళకు దొరకదు. 26 ✽విపత్తు వెంట విపత్తు, వదంతి తరువాత వదంతి వస్తాయి. ప్రవక్త దేవదర్శనం చూచి తమకు సందేశం వెల్లడించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. యాజులదగ్గర ధర్మశాస్త్రోపదేశం, పెద్దల దగ్గర సలహా ఏమీ దొరకదు. 27 రాజు శోకిస్తాడు. అధికారులను నిరాశ ఆవరిస్తుంది. దేశనివాసుల చేతులు వణుకుతాయి. వాళ్ళ ప్రవర్తనకు తగిన విధంగా✽ వాళ్ళపట్ల నేను వ్యవహరిస్తాను. వాళ్ళ సొంత తీర్పుల ప్రకారమే✽ వాళ్ళకు తీర్పు తీరుస్తాను. అప్పుడు నేనే యెహోవానని వాళ్ళు తెలుసుకొంటారు.”