6
1  యెహోవా వాక్కు నాకు మళ్ళీ వచ్చింది: 2 “మానవపుత్రా, ఇస్రాయేల్ పర్వతాలవైపుకు నీ ముఖం త్రిప్పుకొని వాటిని గురించి ఇలా దేవునిమూలంగా చెప్పు: 3 ఇస్రాయేల్ పర్వతాల్లారా! యెహోవాప్రభువు చెప్పేది వినండి! పర్వతాలతో, కొండలతో, కనుమలతో, లోయలతో యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, ఇదిగో, నేను మీమీదికి ఖడ్గాన్ని రప్పించబోతున్నాను. మీ ఎత్తయిన పూజాస్థలాలను నాశనం చేస్తాను. 4 మీ బలిపీఠాలు పాడవుతాయి. మీ ధూప వేదికలు చిన్నాభిన్నమవుతాయి. మీ విగ్రహాల ఎదుటే మీవారిని నేను హతమారుస్తాను. 5 ఇస్రాయేల్‌వారి శవాలను వారి విగ్రహాల ఎదుట పడవేయిస్తాను. మీ ఎముకలను మీ బలిపీఠాల చుట్టూ పారవేయిస్తాను. 6 మీరు కాపురమున్న ప్రదేశాలన్నిటిలో మీ బలిపీఠాలు శిథిలమై, పాడైపోతాయి, మీ విగ్రహాలు చిన్నాభిన్నమై నాశనమవుతాయి, మీ ధూపవేదికలు పడగొట్టబడతాయి, మీరు చేసినవన్నీ నిర్మూలమవుతాయి, మీ పట్టణాలు పాడవుతాయి, మీ ఎత్తయిన పూజస్థలాలు నిర్జనమవుతాయి, 7 మీ జనం హతమై కూలుతారు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొంటారు.
8 “అయితే మీలో కొంతమందిని మిగిలేలా చేస్తాను. మీరు వేరువేరు దేశాలలో, ఆయా జనాలమధ్య చెదరిపోయేటప్పుడు కొంతమంది ఖడ్గాన్ని తప్పించుకొంటారు. 9 మీలో తప్పించుకొన్నవారు వారిని బందీలుగా తీసుకుపోయిన జనాలమధ్య నన్ను జ్ఞాపకం చేసుకొంటారు. వారు వ్యభిచారుల్లాగా ఉండి హృదయంలో నన్ను వదలివేసి, విగ్రహాలను ఆశతో చూచినందుచేత నా గుండెలు పగిలిపోయాయని వారు తలచుకొంటారు. తాము చేసిన చెడుగు, తమ సమస్తమైన నీచ ప్రవర్తన కారణంగా తమను అసహ్యించుకొంటారు. 10 నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు. ఈ కీడు వారికి చేస్తానన్న మాట నేను ఊరికే చెప్పలేదు.
11 “ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, ఇస్రాయేల్ వారి అసహ్యమైన సమస్త నీచప్రవర్తన కారణంగా నీ చేతులు చరిచి నేల తన్ని, ‘అయ్యో’! అని రోదనం చేయి. వారు ఖడ్గంచేతా కరవుచేతా ఘోర రోగంచేతా కూలుతారు. 12 దూరంగా ఉన్నవారు ఘోర రోగంచేత చస్తారు. దగ్గర ఉన్నవారు కత్తి పాలవుతారు. మిగిలి ముట్టడికి గురి అయినవారు కరవుచేత చస్తారు. ఈ విధంగా నేను వారిమీద నా ఆగ్రహం తీర్చుకొంటాను. 13 వారి హతమైన జనులు తమ విగ్రహాలమధ్య, బలిపీఠాల చుట్టూరా కూలుతారు. ఎత్తయిన ప్రతి కొండమీదా ప్రతి పర్వత శిఖరంమీదా తమ సమస్త విగ్రహాలకు పరిమళ ధూపం వేసిన ప్రతి పచ్చని చెట్టుక్రిందా దట్టమైన ప్రతి సిందూర వృక్షంక్రిందా వారు హతమై పడుతారు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొంటారు. 14 వారు కాపురమున్న ప్రదేశాలంతటా నేను వారిమీదికి నా చెయ్యి చాచి వారి దేశాన్ని దిబ్లాత్ ఎడారికంటే పాడుగా నిర్జనంగా చేస్తాను. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు.”