5
1 ✽ “మానవపుత్రా, ఇప్పుడు పదును గల ఖడ్గం మంగలకత్తిగా తెచ్చి నీ తలవెంట్రుకలనూ గడ్డాన్నీ క్షౌరం చేసుకో. త్రాసు తెచ్చి వెంట్రుకలను తూచి భాగాలు చెయ్యి. 2 ✽నీ ముట్టడి రోజులు పూర్తి అయ్యేటప్పుడు వెంట్రుకలలో మూడో భాగం నగరం నడుమ కాల్చివేయాలి. మరో మూడో భాగం నగరం చుట్టు ఖడ్గంతో కొట్టాలి. మిగిలిన మూడో భాగం గాలికి ఎగిరిపోనియ్యాలి. ఎందుకంటే, నేను ఖడ్గం దూసి అక్కడివారిని తరుముతాను. 3 ✽అయితే వెంట్రుకలలో కొన్ని నీ చెంగున కట్టుకో. 4 తరువాత వాటిలో కొన్ని తీసుకొని నిప్పులో వేసి కాల్చు. అక్కడ నుంచి నిప్పు బయలుదేరి, ఇస్రాయేల్ జనమంతటినీ తగలబెడుతుంది.5 ✽“ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, ఇది జెరుసలం. నేను దానిని ఇతర జనాలకు కేంద్రం✽గా నిలిపాను. దాని చుట్టూరా దేశాలున్నాయి. 6 ✽కానీ, అది తమ చుట్టూ ఉన్న ఇతర జనాలకంటే దేశస్థులకంటే ఎక్కువ దుర్మార్గంగా నా న్యాయ నిర్ణయాలనూ నా చట్టాలనూ తృణీకరించింది, నా న్యాయ నిర్ణయాలను త్రోసిపుచ్చింది. నా చట్టాలను అనుసరించలేదు. 7 అందుచేత యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, మీరు నా చట్టాలను అనుసరించక నా న్యాయ నిర్ణయాలను పాటించక మీ చుట్టు ఉన్న ఇతర జనాలకంటే అల్లరిమూకగా ఉన్నారు. మీ చుట్టూ ఉన్న ఇతర జనాల నిర్ణయాలను కూడా మీరు అనుసరించలేదు.
8 “గనుక యెహోవాప్రభువు చెప్పేదేమిటంటే, జెరుసలం! నాకు నీమీద విరుద్ధ భావం కలిగింది. ఇతర జనాల కళ్ళెదుటే నిన్ను దండనకు గురి చేస్తాను. 9 ✽ నీ అసహ్యమైన వాటి కారణంగా ముందెన్నడూ నేను నీలో చేయనిది, తరువాత మళ్ళీ చేయబోనిది ఇప్పుడు చేస్తాను. 10 ✝కాబట్టి, నీలో తండ్రులు తమ పిల్లలను తింటారు. పిల్లలు తమ తండ్రులను తింటారు. నేను నిన్ను దండనకు గురి చేస్తాను, నీలో మిగిలినవారిని నలుదిక్కులకు చెదరగొట్టివేస్తాను. 11 నీవు నీ అసహ్యమైన విగ్రహాలచేత, నీ అసహ్యమైన క్రియలచేత నా పవిత్రాలయాన్ని అశుద్ధం చేశావు గనుక నేను నిన్ను శిక్షించకుండా ఉండను. నిర్దయగా✽ నిన్ను వదలివేస్తాను. ఇలా చేస్తానని ప్రభువైన యెహోవా అనే నేనే నా జీవంతోడు శపథం చేస్తున్నాను. 12 ✽నీ నివాసాలలో మూడో భాగం నీలోనే ఘోర రోగంచేతా కరవుచేతా చస్తారు. మూడో భాగం నీ గోడల బయట ఖడ్గానికి గురి అయి కూలుతారు. మిగిలినవారిని నలుదిక్కులకు నేను చెదరగొట్టి వారివెంట ఖడ్గాన్ని పంపిస్తాను.
13 ✽ “అప్పుడు నా ఆగ్రహం తీరిపోతుంది. వారిమీద ఉన్న నా కోపాగ్ని చల్లారిపోతుంది. నాకు ఉపశమనం కలుగుతుంది. నేను వారిమీద నా కోపం తీర్చుకొనేటప్పుడు✽ నేను – యెహోవాను – నా ఆసక్తితో పలికానని వారు తెలుసుకొంటారు✽. 14 ✝నేను నిన్ను పాడుగా చేస్తాను. నీ చుట్టు ఉన్న ఇతర జనాలమధ్య, ఆ వైపుకు వస్తూ పోతూ ఉన్నవారందరి తిరస్కారానికి నిన్ను గురిగా చేస్తాను. 15 నేను కోపంతో ఆగ్రహంతో తీవ్రమైన గద్దింపులతో నిన్ను శిక్షించేటప్పుడు, నీవు నీ చుట్టు ఉన్న జనాల తిరస్కారానికీ ఎగతాళికీ గురి అవుతావు. వారు నిన్ను చూచి ఆశ్చర్యపడిపోతారు, హెచ్చరిక పొందుతారు. నేను యెహోవాను. ఇలా పలికినది నేనే. 16 ✽నేను నీమీదికి తీవ్రమైన కరవు బాణాలను గుప్పిస్తాను. నీకు ఆహారం సరఫరా చేయబడకుండా చేసి, కరవు అంతకంతకు ఎక్కువయ్యేలా చేస్తాను. అది నీవారి నాశనానికే రప్పిస్తాను. 17 నీమీదికి కరవునూ దుష్ట మృగాలనూ పంపిస్తాను. అవి నీకు సంతానం లేకుండా చేస్తాయి. ఘోర రోగం, రక్తపాతం నీకు కలుగుతాయి. నీమీదికి ఖడ్గాన్ని కూడా రప్పిస్తాను. నేను యెహోవాను. ఇలా పలికినది నేనే.”