4
1 “మానవపుత్రా, చిల్ల పెంకు తీసుకువచ్చి నీ ముందర ఉంచుకొని జెరుసలం నగరాన్ని దానిమీద చిత్రించు. 2 ముట్టడికి సూచకంగా దాని ఎదుట కావలి గోపురాలనూ ముట్టడిదిబ్బనూ శిబిరాలనూ గోడలనూ చుట్టూరా కూలగొట్టే యంత్రాలనూ చిత్రించు. 3 ఇనుప రేకు తెచ్చి నీకూ నగరానికీ మధ్య ఇనుప గోడగా దానిని నిలబెట్టి ఆ నగరంవైపు నీ ముఖం తిప్పి చూస్తూ వుండు. నగరం ముట్టడికి గురి అవుతూ ఉన్నట్టుంటుంది. నీవు ముట్టడించేవాడుగా ఉంటావు. అదంతా ఇస్రాయేల్ ప్రజలకు సూచనగా ఉంటుంది.
4 “తరువాత ఎడమ ప్రక్కకు తిరిగి పడుకో, ఇస్రాయేల్ ప్రజల అపరాధం నీమీద మోపుకో, నీవు ఎన్ని రోజులు ఆ ప్రక్కకు పడుకొని ఉంటావో అన్ని రోజులు వారి అపరాధం భరిస్తూ ఉంటావు. 5 వారు అపరాధం చేస్తూ వచ్చిన సంవత్సరాల లెక్కప్రకారం నీకు మూడు వందల తొంభై రోజులు నిర్ణయించాను. ఈ విధంగా ఇస్రాయేల్ ప్రజల అపరాధం నీవు భరిస్తూ ఉంటావు.
6 “ఆ రోజులు గడిచిన తరువాత నీవు కుడి ప్రక్కకు తిరిగి పడుకొని యూదా ప్రజల అపరాధం భరించాలి. వారి విషయం సంవత్సరానికి ఒక రోజు చొప్పున నలభై రోజులు నీకు నిర్ణయించాను. 7 నీవు జెరుసలం ముట్టడివైపు చూస్తూ, చొక్కా తీసివేసిన బాహువు చాపి, జెరుసలం గురించి దైవావేశ పూర్వకంగా ప్రకటించాలి. 8 నీవు ముట్టడించేవాడిలాగా ఉన్న రోజులు గడిచేవరకు నీవు రెండో ప్రక్కకు తిరగకుండేలా నిన్ను త్రాళ్ళతో కట్టిస్తాను.
9 “నీవు గోధుమలూ యవలూ చిక్కుడుగింజలూ పప్పూ సజ్జలూ జొన్నలూ తెచ్చుకొని ఒకే పాత్రలో ఉంచి నీకోసం రొట్టెలు కాల్చుకో. నీవు ప్రక్కమీద పడుకొని ఉన్న ఆ మూడు వందల తొంభై రోజులు ఆ రొట్టెలు తింటూ రావాలి. 10 ప్రతిరోజూ రెండు వందల గ్రాముల ప్రకారం తినాలి. అది తూచి చూడాలి. నిర్ణీత వేళకు తినాలి. 11 నీళ్ళు కూడా కొలత చూచి రోజూ రెండు గ్లాసులు త్రాగాలి. నిర్ణీత వేళకు త్రాగాలి. 12 యవల అప్పం చేసినట్టు రొట్టెలు చేసి, వంటచెరకుగా మనిషి మలం ఉపయోగించి, ప్రజల కళ్ళెదుటే వాటిని కాల్చి తినాలి. 13 నేను ఇస్రాయేల్ ప్రజలను చెదరగొట్టే జనాలమధ్య వారు ఈ ప్రకారం అశుద్ధమైన ఆహారం తినవలసివస్తుంది” అని యెహోవా నాతో అన్నాడు.
14 అందుకు నేను “అయ్యో, యెహోవాప్రభూ! నేనెన్నడూ అశుద్ధుణ్ణి కాలేదు. బాల్యంనుంచి నేటివరకూ దానంతట అదే చచ్చినదాన్ని గానీ మృగాలు చీల్చినదాన్ని గానీ నేనెన్నడూ తినలేదు. అసహ్యమైన మాంసం నా నోట ఎప్పుడూ పడలేదు” అన్నాను.
15 ఆయన “సరే, నేను నిర్ణయించినదేమిటంటే, రొట్టె కాల్చడానికి మనిషి మలానికి బదులు పేడ ఉపయోగించ వచ్చు” అన్నాడు. 16 అప్పుడాయన నాతో అన్నాడు, “మానవపుత్రా, జెరుసలంకు ఆహారం సరఫరా చేయబడకుండా నేను చేస్తాను. అక్కడివారు విచారపడుతూ, ఆహారం జాగ్రత్తగా తూచి తింటారు. నిరాశతో నీళ్ళు కొలత చూచి త్రాగుతారు. 17 అన్నపానాలు కొదువగా ఉండడంచేత ఒకణ్ణి ఒకడు చూస్తూ, నిర్ఘాంతపోతారు, తమ అపరాధాలలో నీరసించి పోతారు.