3
1  ఆయన ఇంకా నాతో అన్నాడు, “మానవపుత్రా, నీ ఎదుట ఉండేదానిని తిను – చుట్టి వున్న ఈ పత్రం తిను. తరువాత ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడు.” 2 గనుక నేను నోరు తెరిచాను. ఆయన ఆ చుట్టి వున్న పత్రాన్ని నాకు తినిపించి, నాతో 3 “మానవపుత్రా, నేనిచ్చే ఈ పత్రాన్ని తిని దానితో నీ కడుపు నింపుకో” అన్నాడు. అందుచేత దాన్ని తిన్నాను. అది నా నోటికి తేనెలాగా తియ్యగా ఉంది.
4 అప్పుడాయన నాతో అన్నాడు, “మానవపుత్రా, ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి నా మాటలు వారికి చెప్పు. 5 నేను నిన్ను పంపేది నీకు తెలియని కఠినమైన భాష మాట్లాడే ప్రజదగ్గరికి కాదు గాని ఇస్రాయేల్ ప్రజ దగ్గరికే, 6 నీకు తెలియని కఠినమైన భాష మాట్లాడుతూ, నీవు గ్రహించలేని మాటలు పలుకుతూ ఉండే వేరువేరు ప్రజలదగ్గరికి నేను నిన్ను పంపడం లేదు. ఒకవేళ అలాంటివారి దగ్గరికి నిన్ను పంపితే వాళ్ళు నీ మాటలు వినేవాళ్ళే. 7  కాని, ఇస్రాయేల్ ప్రజకు నా మాటలు వినడానికి ఇష్టం లేదు. గనుక నీ మాటలు వినడానికి వారికిష్టం ఉండదు. ఎందుకంటే, ఇస్రాయేల్‌వారంతా మూర్ఖులు, కఠిన హృదయులు. 8 అయితే నేను నీ ముఖాన్ని వాళ్ళ ముఖంలాగా, నీ నుదురును వాళ్ళ నుదురులాగా గట్టిగా చేస్తాను. 9 నీ నుదుటిని చెకుముకిరాతికంటే గట్టిగా ఉన్న వజ్రంలాగా చేస్తాను. భయపడకు. వారు తిరగబడుతూ ఉండే జనమే గాని వారిని చూచి హడలిపోకు.”
10 ఆయన ఇంకా నాతో అన్నాడు, “మానవపుత్రా, నేను నీతో చెప్పే మాటలన్నీ జాగ్రత్తగా విని, మనసులో ఉంచుకో. 11 బందీలుగా వచ్చిన నీ దేశస్థుల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడు. వారు విన్నా, వినకపోయినా, నీవు ‘ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు’ అనాలి.”
12 అప్పుడు ఆత్మ నన్ను పైకి ఎత్తాడు. నా వెనుక “యెహోవా నివాస స్థలంలో ఆయన శోభాప్రకాశానికి స్తుతి కలుగుతుంది గాక” అని గొప్ప స్వరం చెప్పడం నేను విన్నాను. 13 ఒకదానికొకటి తగులుతూ ఉన్న ఆ జీవుల రెక్కల చప్పుడు, వాటిదగ్గర ఉన్న చక్రాల చప్పుడు కూడా విన్నాను. ఆ చప్పుడు మహా గర్జనలాంటిది. 14 ఆత్మ నన్ను ఎత్తి తీసుకుపోతూ ఉండగా యెహోవా బలమైన చెయ్యి నామీద ఉంది. నేను వెళ్తూ ఉన్నప్పుడు హృదయంలో తీవ్రంగా నొచ్చుకొంటూ, మండిపడుతూ ఉన్నాను. 15  నేను కెబార్ నదిదగ్గర ఉన్న తేల్‌ఆబీబ్‌కు చేరుకొన్నాను. అక్కడ బందీలుగా వచ్చిన యూదులు కొందరు కాపురమున్నారు. అక్కడ – వారు కాపురమున్న స్థలంలోనే – నేను నిర్ఘాంతపోయి వారిమధ్య ఏడు రోజులు కూర్చుని ఉన్నాను. 16 ఆ ఏడు రోజులు గడిచాక యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది:
17 “మానవపుత్రా, నేను నిన్ను ఇస్రాయేల్ ప్రజలకు కావలివాడుగా నియమించాను. గనుక నేను చెప్పేది విని నా హెచ్చరికలు వారికి తెలియజెయ్యి. 18 ఒక దుర్మార్గుడితో ‘నీవు తప్పక చావాలి’ అని నేను చెపుతాననుకో. ఒకవేళ నీవు అతణ్ణి హెచ్చరించపోతే, అతడి ప్రాణం దక్కించడానికి అతణ్ణి చూచి దుర్మార్గాన్ని విడిచిపెట్టాలని హెచ్చరిక చెప్పకపోతే, ఆ దుర్మార్గుడు తాను చేసిన అపరాధాలకు చస్తాడు గాని, అతడి రక్తం విషయం నిన్ను జవాబుదారిగా ఎంచుతాను. 19 నీవు ఆ దుర్మార్గుణ్ణి హెచ్చరిస్తే, అతడు తన దుర్మార్గం నుంచీ చెడ్డ పనులనుంచీ తిరగకపోతే, చేసిన అపరాధాలకు అతడు చస్తాడు. అయితే నీ మటుకు నీవు తప్పించుకొంటావు.
20 “న్యాయవంతుడు తన న్యాయ ప్రవర్తన నుంచి తిరిగి, అక్రమాలు చేస్తూ ఉంటాడనుకో. నేను అతడి ముందర అడ్డుపెడితే అతడు చస్తాడు. నీవు అతణ్ణి హెచ్చరించకపోతే, తాను చేసిన అపరాధాలకు అతడు చస్తాడు. మునుపు అతడు చేసిన న్యాయప్రవర్తన జ్ఞాపకానికి రాదు. అయితే అతడి రక్తం విషయం నిన్ను జవాబుదారిగా ఎంచుతాను. 21 న్యాయవంతుణ్ణి అపరాధం చేయవద్దని నీవు హెచ్చరిస్తావనుకో. అతడు హెచ్చరిక విని అపరాధం చేయకపోతే తప్పకుండా బ్రతుకుతాడు. అంతేగాక, నీ మటుకు నీవు తప్పించుకొంటావు.”
22 అక్కడ యెహోవా చెయ్యి నామీద ఉంది. ఆయన నాతో “నీవు లేచి మైదానానికి వెళ్ళు. అక్కడ నేను నీతో మాట్లాడుతాను” అన్నాడు.
23 అందుచేత నేను లేచి మైదానానికి వెళ్ళాను. అక్కడ యెహోవా శోభాప్రకాశం నిలిచి ఉంది. అది కెబార్ నదిదగ్గర నేను చూచిన శోభాప్రకాశంలాంటిదే. నేను సాష్టాంగపడ్డాను. 24 అప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టాడు. ఆయన నాతో ఇలా అన్నాడు:
“వెళ్ళి ఇంటిలో తలుపు మూసివేసి ఉండు. 25 మానవపుత్రా, వారు నిన్ను త్రాళ్ళతో కట్టివేస్తారు. నీవు ప్రజలమధ్యకు వెళ్ళకుండేలా నిన్ను బంధిస్తారు. 26 వారు తిరగబడుతూ ఉండే జనం. అయితే నేను నీ నాలుక అంగిటికి అంటుకొని ఉండేలా చేస్తాను. నీవు మౌనంగా ఉండి వారిని గద్దించలేకపోతావు. 27 అయితే నేను నీతో మాట్లాడినప్పుడు నీ నోరు తెరుస్తాను. ఆ సమయాన నీవు ‘యెహోవాప్రభువు ఇలా చెపుతున్నాడు’ అనాలి. వారు తిరగబడుతూ ఉండే జనం గనుక వినడానికి ఇష్టమున్నవాణ్ణి విననియ్యి, వద్దనేవాణ్ణి వద్దననియ్యి.