2
1 ఆయన నాతో “మానవపుత్రా✽, నీవు లేచి నిలబడు✽. నేను నీతో మాట్లాడుతాను” అన్నాడు. 2 ✽ఆయన మాట్లాడగానే దేవుని ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టాడు. అప్పుడాయన నాతో ఇలా అనడం విన్నాను:3 “మానవపుత్రా, నేను నిన్ను ఇస్రాయేల్ ప్రజల దగ్గరికి పంపిస్తున్నాను. ఆ ప్రజలు ద్రోహులై నామీద తిరగబడ్డారు✽. వారూ వారి పూర్వీకులూ ఈ రోజువరకు కూడా నామీద తిరుగుబాటు చేసేవారు. 4 వారు మూర్ఖులు, కఠిన హృదయులు. నేను నిన్ను వారిదగ్గరికి పంపిస్తున్నాను. నీవు వారితో మాట్లాడేటప్పుడు ‘యెహోవాప్రభువు ఇలా చెపుతున్నాడు’ అనాలి✽. 5 వారు తిరగబడే జనం. అయినా – వారు నీ మాటలు విన్నా, వినకపోయినా – తమ మధ్య ప్రవక్త ఉన్నట్టు తెలుసుకొంటారు. 6 మానవపుత్రా, నీవు వారికీ వారి మాటలకూ భయపడకూడదు✽. నీ చుట్టు ముండ్ల చెట్లూ కంటకాలూ ఉన్నా, నీవు తేళ్ళ✽మధ్య నివాసం చేసినా, ఏమీ భయపడకు. వారు తిరగబడుతూ ఉండేవారే. అయినా, నీవు వారి ఎదుట ఉన్నప్పుడు, వారి మాటలు విన్నప్పుడు నీవు భయపడకూడదు. 7 వారు తిరగబడుతూ ఉండేవారు. అయినా – వారు విన్నా, వినకపోయినా – నీవు నా మాటలు వారికి చెప్పాలి. 8 ✽మానవపుత్రుడా, నీవు తిరగబడే ఆ వంశంలాగా ఉండకుండా, నేను చెప్పే మాటలు విను. ఇప్పుడు నీ నోరు తెరచి నేను ఇచ్చేదాన్ని తిను.”
9 ✽నేను చూస్తూ ఉంటే, ఒక చెయ్యి నావైపుకు చాపడం కనిపించింది. చేతిలో చుట్టి వున్న పత్రం ఉంది. 10 ఆయన నా ఎదుట పత్రాన్ని విప్పాడు. దాని రెండు ప్రక్కలమీద విలాపం, దుఃఖం, రోదనంతో నిండిన మాటలు వ్రాసి ఉన్నాయి.