యెహెజ్కేలు
1
1 ముప్పయ్యో సంవత్సరం✽ నాలుగో నెల అయిదో రోజున నేను కెబార్ నది✽ ఒడ్డున, బందీలు✽గా వచ్చినవారి మధ్య ఉన్నాను. ఉన్నట్టుండి ఆకాశం తెరుచుకొంది✽. దేవదర్శనాలు నాకు కలిగాయి. 2 ఆ నెలలో అయిదో రోజున (అది యెహోయాకీనురాజు బందీగా పోయిన అయిదో సంవత్సరం) 3 ✽కల్దీయవాళ్ళ దేశంలో, కెబార్ నది ఒడ్డున, బూజీ కొడుకూ యాజీ అయిన యెహెజ్కేలుకు యెహోవానుంచి వాక్కు వచ్చింది. అక్కడ యెహోవా చెయ్యి అతనిమీద ఉంది.4 ✽నేను చూస్తూ ఉన్నప్పుడు ఉత్తర దిక్కునుంచి తుఫాను వచ్చింది. బ్రహ్మాండమైన మేఘం కనిపించింది. అందులో జ్వాలమయమైన మెరుపులు ఉన్నాయి. అతి ప్రకాశమానమైన కాంతి ఆ మేఘాన్ని ఆవరించింది. ఆ మంటలమధ్య మెరుగుపెట్టిన కంచులాంటిది ఉంది. 5 ✽✽ఆ మంటల్లో నాలుగు జీవుల ఆకారాలు కనిపించాయి. వాటి ఆకారం మనిషి రూపం లాంటిది. 6 గాని, ఒక్కొక్కదానికి నాలుగు ముఖాలూ నాలుగు రెక్కలూ ఉన్నాయి. 7 వాటి కాళ్ళు తిన్ననివి. వాటి పాదాలు దూడ డెక్కలవంటివి. మెరుగు పెట్టిన కంచులాగా అవి తళతళలాడుతూ ఉన్నాయి. 8 వాటి నాలుగు ప్రక్కలకు, రెక్కలక్రింద, మనిషి చేతుల్లాంటి చేతులు ఉన్నాయి. ఆ నాలుగు జీవులకు ముఖాలూ రెక్కలూ ఉన్నాయి. 9 వాటి రెక్కలు ఒకదానికొకటి తగులుతూ ఉన్నాయి. ఆ జీవులన్నీ తిన్నగా ముందుకు సాగుతూ ఉండేవి. అవి ప్రక్కకు ఏమీ తిరగలేదు.
10 వాటి ముఖాలు ఇలా ఉన్నాయి: నాలుగు జీవులలో ప్రతిదానికీ మనిషి ముఖం ఉంది. కుడి ప్రక్కన సింహం ముఖం, ఎడమ ప్రక్కన ఎద్దు ముఖం ఉన్నాయి. ప్రతిదానికీ గరుడపక్షి ముఖం కూడా ఉంది. 11 వాటి ముఖాలు అలాంటివే! వాటి రెక్కలు పైగా చాపి ఉన్నాయి. ప్రతిదాని రెక్కలలో రెండు ఇరుప్రక్కలకు ఉన్న జీవుల రెక్కలవరకు ఉన్నాయి, రెండు రెక్కలు దాని దేహాన్ని కప్పాయి. 12 ప్రతి జీవీ తిన్నగా ముందుకు సాగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళాలని ఆత్మకు ఇష్టం ఉందో అవి ఆ వైపుకే పోతూ ఉన్నాయి. అవి ప్రక్కకు ఏమీ తిరగలేదు. 13 ఆ జీవులు మధ్య మండుతున్న నిప్పుకణికల్లాంటివి దివిటీలలాంటివి కనిపించాయి. అవి అటూ ఇటూ పోతూ ఉన్నాయి. ఆ జ్వాల ఎంతో ప్రకాశమానమైనది. జ్వాలలోనుంచి మెరుపుతీగెలు బయలుదేరుతూ ఉన్నాయి. 14 ఆ జీవులు మెరుపుతీగెలలాగా అటూ ఇటూ వేగంతో పోతూ ఉన్నాయి.
15 ఆ జీవులను నేను చూస్తూ ఉంటే, ఒక చక్రం✽ నాలుగు ముఖాలు గల ఆ జీవులలో ప్రతిదాని దగ్గర, భూమిమీద కనిపించింది. 16 ఆ చక్రాలు, వాటి పనితనం ఇలా ఉన్నాయి: అవి గోమేధికంలాగా నిగనిగలాడుతూ ఉన్నాయి. నాలుగూ ఒకే రకం. చక్రంలో చక్రమున్నట్టుగా ఉన్నాయి. 17 వాటి నాలుగు వైపులలో ఏ వైపుకైనా పోయేవి. అవి ప్రక్కకు ఏమీ తిరగలేదు. 18 చక్రాల అంచులు ఎత్తుగా, భయంకరంగా ఉన్నాయి. నాలుగు అంచులకు చుట్టూ అంతటా కండ్లున్నాయి.
19 ఆ జీవులు కదిలినప్పుడెల్లా వాటి ప్రక్కన చక్రాలు కూడా కదిలేవి. జీవులు భూమిమీదనుంచి లేస్తే చక్రాలు కూడా లేచేవి.
20 ఎక్కడికి వెళ్ళాలని ఆత్మకు ఇష్టం ఉందో జీవులు అక్కడికే వెళ్ళేవి. వాటితోపాటు చక్రాలు లేచేవి. ఎందుకంటే, జీవులకున్న ఆత్మ చక్రాలలో ఉంది. 21 జీవులకున్న ఆత్మ చక్రాలలో ఉండడంవల్లే జీవులు ముందుకు పోతే, ఇవీ ముందుకు పోయేవి. జీవులు ఆగితే ఇవీ ఆగేవి. జీవులు భూమిమీదనుంచి లేస్తే వాటితోపాటు ఇవీ లేచేవి.
22 జీవుల తలలకు పైగా విశాలమైనది✽ ఒకటి ఉంది. అది మంచుగడ్డలాగా అద్భుతంగా తళతళలాడుతూ ఉంది. అది జీవుల తలలకు పైగా వ్యాపించి ఉంది. 23 దానిక్రింద వాటి రెక్కలు ఒకదానివైపు ఒకటి చాపి ఉన్నాయి. ప్రతి జీవీ రెక్కలలో రెండింటితో తన దేహాన్ని కప్పేది. 24 జీవులు కదులుతూ ఉంటే, వాటి రెక్కల చప్పుడు నాకు వినిపించేది. ఆ చప్పుడు జలప్రవాహాల ఘోషలాంటిది, అమిత శక్తివంతుని కంఠ ధ్వనిలాంటిది, సైన్యం చేసే కలకలంలాంటిది. జీవులు ఆగినప్పుడు వాటి రెక్కలను దించుకొన్నాయి.
25 అవి ఆగి రెక్కలను దించుకొని ఉంటే, వాటి తలలకు పైగా ఉన్న విశాలమైనదాని మీదనుంచి ఒక స్వరం వినబడేది. 26 వాటి తలలకు పైగా ఉన్న ఆ విశాలమైనదానికి పైగా నీలమణిలాంటిది కనిపించింది. దాని రూపం సింహాసనాన్ని పోలినది. ఆ సింహాసనంలాంటి దానిమీద మనిషివంటి వాడొకడు కూర్చుని ఉన్నాడు. 27 ✝నడుమునుంచి మీదికి ఆయన రూపం మెరుస్తున్న కంచులాగా, నిప్పులాగా ఉన్నట్టు నాకు కనిపించింది. నడుమునుంచి దిగువకు ఆయన రూపం జ్వాలమయమైనట్టుంది. ఆయనను అతి ప్రకాశమానమైన కాంతి ఆవరించింది. 28 ఆయన చుట్టూరా ఉన్న కాంతి వానకాలంలో కనిపించే రంగులవిల్లు✽ లాంటిది. యెహోవా శోభాప్రకాశం✽ అలా కనిపించింది. అది చూచి నేను సాష్టాంగపడ్డాను. అప్పుడు నాతో మాట్లాడుతూ ఉన్న స్వరం నాకు వినబడింది.